
గిరిజనుల విడుదలకు పోలీస్‌స్టేషన్ ముట్టడి
ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో ఆందోళన
పోలీసుస్టేషన్ ఎదుట బాధిత కుటుంబసభ్యుల బైఠాయింపు
పాడేరు రూరల్ (జి.మాడుగుల): జి.మాడుగుల మండలం గుదలంవీధి ఆశ్రమంలో ఇటీవల మావోయిస్టుల దాడికి సంబంధించి ఆరుగురు గిరిజనులను తక్షణం విడుదల చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో గిరిజనులు, వారి కుటుంబసభ్యులు జి.మాడుగుల పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. బాధితులు స్టేషన్‌ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాలుగురోజుల క్రితం కొఠారి వెంకటరాజు, కొర్రా చిట్టిబాబు, కొఠారి లక్ష్మయ్య, సీదరి అప్పలరాజును, శనివారం ఉదయం గొల్లోరి కృష్ణంరాజు, డేవిడ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. తమ కుమారుడ్ని అన్యాయంగా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారని గొల్లోరి కృష్ణంరాజు తండ్రి చిన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తమవారి జాడ రేపటిలోగా తెలియజేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గిరిజనులను తక్షణమే విడుదల చేయనిపక్షంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్న గిరిజనుల కుటుంబాలు ఆవేదన అంతా ఇంతా కాదన్నారు.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంట్ర ఏ ఆధారం లేకుండా అమాయక గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
గిరిజనులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చెప్పిన మేరకు ఆరుగురు గిరిజనులను ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయకపోతే సోమవారం నుంచి స్థానిక స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ శేఖరంతో ఆమె మాట్లాడారు. విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం లోగా విడుదల చేస్తామని సీఐ తెలిపారు. ఆందోళనలో పాడేరు జెడ్పీటీసీ పోలుపర్తి నూకరత్నం, బీరం సర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ కొటారి చిన్నమ్మి, అనర్బ గ్రామస్తులు పాల్గొన్నారు.