ప్రతీకాత్మక చిత్రం
అనంతపురం క్రైం: చిట్టీలు, అధిక వడ్డీల పేరిట ప్రజలను మోసగించిన జయలక్ష్మి కటకటాలపాలైంది. ఆమెను కర్నూలు జిల్లా అహోబిలం దేవాలయ సమీపంలో మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కారు, రెండు సెల్‌ఫోన్లు, 20 చిట్టీల బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనంతపురంలోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఓంకార్ ఎదుట హాజరుపర్చారు. రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
చదవండి: ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
కడప నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన జయలక్ష్మి 15 ఏళ్లుగా అనంతపురంలో నివాసముంటోంది. అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్ నిర్వహించేది. అక్కడికి వచ్చే వారితో పాటు స్థానికులతో పరిచయం పెంచుకుంది. చిట్టీలు, అధిక వడ్డీల వ్యాపారం మొదలుపెట్టింది. పలువురి నుంచి భారీ మొత్తాలు వసూలు చేసింది. తిరిగివ్వలేదు. కోవూర్‌నగర్‌కు చెందిన సరోజ రూ.19.50 లక్షలు, నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధికి చెందిన శాంతాదేవి రూ.15 లక్షలు, భువనసాయి రూ.3 లక్షలు, లక్ష్మి రూ.20 లక్షలు, కిషోర్ రూ.20 లక్షలు, పవన్‌కుమార్ నాయక్ రూ.9 లక్షలు, కృష్ణమ్మ రూ.15 లక్షలు, అనిత రూ.22 లక్షలు, రామ్మోహన్ రెడ్డి రూ.10 లక్షలు ఇచ్చి మోసపోయారు. వీరు జయలక్ష్మిపై నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై సెక్షన్ 420, చిట్‌ఫండ్ యాక్ట్, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమెపై వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి.
అరెస్టు చేశారిలా..
జయలక్ష్మి, ఆమె భర్త శ్రీహరిబాబు అహోబిలంలో ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి జయలక్ష్మిని అరెస్టు చేసి, అనంతపురంలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించింది. స్టేషన్‌లో మహిళా పోలీసుల సమక్షంలో మూడు గంటల పాటు విచారించి.. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment