
గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి
– లంబాడీ హక్కుల పోరాట సమితి నేతల డిమాండ్
జంగారెడ్డిగూడెం : గిరిజనులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో లంబాడీ హక్కుల పోరాట సమతి సమావేశం జరిగింది. డివిజన్ అధ్యక్షుడు భూక్యా ధనునాయక్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న గిరిజనులకు మంత్రివర్గంలో చోటులేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంలో గిరిజనులకు చోటు కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు గిరిజనులకు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ అక్టోబర్ 2న పుట్టపర్తిలో గిరిజనుల ఐక్యత బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 500 మంది జనాభా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ పదవి గిరిజనులకే ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కష్ణా జిల్లాలో సీట్లు కేటాయించాలనే అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభకు సంబంధించి కరపత్రాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు, లంబాడీలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. గొగ్గులోతు మోహనరావు నాయక్, డీకే నాయక్, డి.నాగేశ్వరరావు నాయక్, జె.వెంకటేశ్వరరావు నాయక్ పాల్గొన్నారు.