
పోడు భూములను పరిశీలిస్తున్న మదన్‌లాల్, డీఎఫ్‌ఓ (ఫైల్)
సాక్షి,కారేపల్లి: ఇక్కడ పోడే ప్రధాన సమస్య. అసెంబ్లీ ఎన్నికల వేళ, అభ్యర్థుల ప్రచారం పోడు చుట్టే తిరుగుతోంది. మా పార్టీకి ఓటు వేసి, నన్ను గెలిపిస్తే.. ఫారెస్టోళ్లను పోడు జోలికి రాకుండా చూస్తా.. పోడుదారులకు అండగా నిలబడతా.. గతంలో పోడు పోకుండా కాపాడింది నేనే.. నాకే మీరు ఓటు వేయాలి. లేదంటే మీకు పోడు దక్కకుండా పోతుంది. అంటూ కారేపల్లి మండలంలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ‘పోడునే’ ప్రచారాస్త్రంగా సంధిస్తున్నారు. కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చీమలపాడు, రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం, మాణిక్కారం, కోమట్లగూడెం, సింగరేణి, సీతారాంపురం, ఉసిరికాయలపల్లి, తొడితలగూడెం, టేకులగూడెం గ్రామాలున్నాయి.ఈ పంచాయతీల పరిధిలో 1,680 మంది గిరిజన రైతులు 7,080 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు.
వీరిలో 1,326 మంది రైతులకు 5,310 ఎకరాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అటవీ హక్కు పత్రాలు అందజేశారు. గిరిజన పోడుదారులకు హక్కు కల్పించారు. అప్పటి నుంచి బ్యాంకు రుణాలతోపాటు, రైతు పరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇంకా 354 మంది గిరిజన పోడుదారులకు 1,770 ఎకరాల్లో హక్కు పత్రాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ గిరిజన పోడుదారులకు సర్వేల పేరుతో ఇటు ఫారెస్ట్, అటు రెవెన్యూ అధికారులు మభ్య పెడుతుండటం, ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు పోడుదారులపై దాడులకు పాల్పడి పోడు లాక్కునే ప్రయత్నాలు చేయటం, అందుకు పోడుదారులు ప్రతిఘటించటం, వారిపై కేసులు నమోదు కావటం పరిపాటిగా మారింది. తాత ముత్తాతల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న మాపై హరితహారం పేరుతో ఫారెస్టోళ్లను ప్రభుత్వమే ఉసిగొల్పుతోందని ఇక్కడి గిరిజన పోడుదారులు ఆరోపిస్తూ.. ఉద్యమాలు చేపట్టిన ఘటనలు లేకపోలేదు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సమస్య..
వైరా నియోజకవర్గంలో కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో పోడుదారులు ఎక్కువగా ఉన్నారు. పోడుదారుల ఓట్లకు గాలం వేసేందుకు వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థులు పోడును ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. కారేపల్లి మండలం ఏజెన్సీ కావటంతో ఎక్కువ శాతం గిరిజనులు తాండాలలో, గూడేలలో నివాసం ఉంటూ పోడు వ్యవసాయంతో జీవిస్తున్నారు. వీరి ఓట్లే.. గెలుపుకు కీలకం కానున్నాయి. సింగరేణి రెవెన్యూ మినహా.. మిగిలిన 10 రెవెన్యూ గ్రామాలు ఏజెన్సీలో ఉండటంతో ఇటు గిరిజన, గిరిజనేతర పోడుదారులు పోడుకోసం పోరాటం చేస్తున్నారు. 2005 కంటే ముందు నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయక పోగా, పోడును లాక్కోవాలని కుటిల యత్నం చేస్తోందని గిరిజన సంఘం నాయకులు వాపోతున్నారు.
ఇదేక్రమంలో టీఆర్‌ఎస్ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ప్రభుత్వ పరమైన విధానాలతో.. పోడుదారుల నుంచి చిక్కొచ్చి పడగా, ప్రచారంలో నిలదీతలు, మా పోడు సంగతేంటని ప్రశ్నించటాలు జరుగుతున్న సంగతి విధితమే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడుదారులకు అండగా నిలుస్తుందని, అటవీ హక్కు పత్రాలు ఇప్పిస్తామని, పోడు జోలికి ప్రభుత్వం రాదని.. మదన్‌లాల్ నచ్చచెప్పిన ఘటనలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం.. పోడుదారులకు అండగా నిలబడి పోరాడింది మా పార్టీ అని, అసెంబ్లీలో పోడుదారుల గళం విప్పాలంటే, సీపీఎంకు ఓటు వేయాలని, లేదంటే పోడును పాలక ప్రభుత్వాలు లాగేసుకుంటాయని పేర్కొం టూనే, పోడుదారుల వెంట మేము అంటూ.. ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థి విజయాబాయి సైతం.. సీపీఐను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ హక్కు పత్రాలు వచ్చేలా చూస్తామని, పోడుదారులను అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొనటం.. స్థానికంగా ఆశక్తిని రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు (స్వతంత్ర) అభ్యర్థి రాములునాయక్ మొదటి నుంచి పోడుదారులకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా పోడుదారుల ఓట్లే కీలకంగా మారటం.. అభ్యర్థులు పోడునే ప్రచార అస్త్రంగా ఎంచుకోవడం చర్చనీంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment