మొక్కుబడిగానే..! | ITDA Officers Neglected On Tribals Development In Bhadrachalam | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగానే..!

Published Wed, Aug 14 2019 12:49 PM | Last Updated on Wed, Aug 14 2019 12:50 PM

ITDA Officers Neglected On Tribals Development In Bhadrachalam - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మహబూబాబాద్‌ ఎంపీ కవిత, చిత్రంలో కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ గౌతమ్‌ తదితరులు

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రితో పాటు చుట్టుపక్కల ఉన్న మరో మూడు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన ఐటీడీఏ పాలకమండలి.. మొక్కుబడిగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన పాలకమండలి సమావేశాన్ని 38 నెలల తరువాత నిర్వహించడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో భద్రాద్రి కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ అధ్యక్షతన  మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇంతకాలం సమావేశాలు నిర్వహించకపోవడంతో ఇటీవల పదవీకాలం పూర్తయిన ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గిరిజన సమస్యలపై గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. ఇక సమావేశ హాల్‌లో ఖాళీ లేదనే సాకుతో అధికారులు మీడియాను అనుమతించలేదు. గిరిజనుల సమస్యలను ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాలు బహిర్గతం కావడం అధికారులకు ఇష్టం లేనందునే ఇలా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
పోడు సమస్యే కీలకం.. 
పాలకమండలి సమావేశంలో పోడు భూముల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంటేశ్వరరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద పోడుభూముల విషయమై ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న గిరిజనులను అటవీ అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఎమ్మెల్యేనైన తాను అక్కడికి వెళ్లానని, తాను మాట్లాడిన విషయాలను అటవీ అధికారులు రికార్డు చేసి ఎలా బహిర్గతం చేశారని ప్రశ్నించారు. అటవీ అధికారుల విధులను తాను ఆటంకపరిచానని చెప్పడం అవాస్తవమన్నారు. డీఎఫ్‌ఓ రాంబాబు కావాలనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలున్న అనేకమంది గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెడుపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. మావోయిస్టుల ఉద్యమం పెరగడానికి కూడా అటవీ అధికారుల వైఖరే కారణమని వనమా ఆరోపించారు.

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పోడు కొట్టుకుని భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల జోలికి వెళ్లవద్దన్నారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో వెంటనే సిబ్బందిని నియమించి, మౌలిక సదుపాయా లు కల్పించాలని కోరారు. సారపాక, మర్కోడులో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని కోరారు. గుండాలలో ఏకలవ్య పాఠశాల మంజూరైతే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. గతంలో పినపాకకు మంజూరైన ఏక లవ్య పాఠశాలకు స్థలం ఇవ్వకపోవడంతో ఆ పాఠశాల చింతూరుకు తరలిపోయిందన్నారు.   ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులంతా మద్దతు తెలిపారు. పోడు భూముల జోలికి అధికారులు వెళ్లవద్దని తీర్మానం చేశారు. 

అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలి... 
మూడు సంవత్సరాల తర్వాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చర్చకు వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత సూచించారు. భద్రాచలం డివిజన్‌లోని మారుమూల ప్రాంత గిరిజనులైన కోయ, కొండరెడ్లు, నాయక్‌పోడ్‌ తెగకు చెందిన ఆదిమజాతి గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయంపై ఆధారపడతారని, వారి సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.  పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు వేధించడం సరికాదని, వారికి అన్యాయం జరగకుండా సహకరించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు విద్య, ఆరోగ్యం, గ్రామాల్లోని మౌలిక వసతుల విషయంలో క్షుణ్ణంగా తెలియజేశారని, వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. వాటి పరిష్కారానికి తాను కూడా కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో విద్యారంగంలో పలు మార్పులు వచ్చాయని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన ఐదుగురు సీఆర్‌పీలను తీసుకోవడం లేదని చెప్పగా దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఐదుగురు సోషల్, తెలుగు, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల వారీగా ఉన్నారని, జిల్లాలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు కొరత ఉందని, పాఠశాలల్లో 10 మంది ఉన్నా, 30 మంది ఉన్నా సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం ఉండటంతో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో 232 మంది టీచర్లు ఉన్నారని, 18 మందిని తీసుకోగా, మిగిలిన ఐదుగురికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఉభయ జిల్లాల్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 50 మంది సీఆర్‌పీలను రెగ్యులర్‌ చేయకపోవడం తో వారి పరిస్థితి దీనంగా ఉందన్నారు. భద్రాచలంలో ఒకటే డిగ్రీ కళాశాల ఉందని, మరో కళా శాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరా రు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మాట్లాడుతూ ఇల్లెందులో ఉన్న 30 పడకల ఆస్పత్రి 60 కి.మీ.ల పరిధిలో పనిచేస్తున్నదని, అక్కడ గైనకాలజిస్టు నియామకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుస్తాం..
ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలన్నదే తమ ధ్యేయమని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్‌ రజత్‌కుమార్‌ శైనీ తెలిపారు. పరిపాలనను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికే ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిం దని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనుల సమగ్రాభివృద్ధికి విశిష్ట సేవలు అందచేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు అధికంగా నివసిస్తున్నారని, వారి సమగ్రాభివృద్ధికి అంద రం ఒక టీం వర్క్‌గా పనిచేస్తే అభివృద్ధి సాధిం చగలమని చెప్పారు. నూతనంగా జిల్లా ఏర్పడడం, దాదాపు మూడున్నర సంవత్సరాల తరువాత ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నందున ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల వారీగా తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు, ఆంగోతు బిందు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఐటీడీఏ పీఓ వి.పి.గౌతమ్, సబ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రా, జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement