సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భద్రాచలం నుంచి కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లే రహదారులపైకి వరద నీరు రావడంతో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 13.9 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి 13 లక్షల 6వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బొబ్బిల్లంకలో ఏటిగట్లు కోతకు గురవుతోంది. గట్టుకు గండిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇనుప బస్తాలతో మరమ్మత్తులు చేపట్టారు.
జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు..
చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 40 అడుగులకు నది నీటిమట్టం చేరింది. డొంకరాయి జలాశయానికి వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా 10,936 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 9 రోజులుగా సుమారు 50 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. నాలుగు మండల్లాలల్లో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరింది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,59,889 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 61,348 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 865.70 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.1322 టీఎంసీలు. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment