సాక్షి, తూర్పుగోదావరి/ఖమ్మం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తోంది. నీటిమట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల 9వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి అక్విడెట్, యానాం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదారి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే మార్గంలో తూరుబాక బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి రహదారిపై గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామచంద్రాపురం స్టేజి వద్ద గల కడియాలబుడ్డి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రభావం తగ్గింది. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6470 క్యూసెక్కులు ఉండగా, అడుగు మేర 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేరుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 640 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 62 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 5.80 టీఎంసీలు.
అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం, తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం కెపాసిటి 137 కాగా. ప్రస్తుతం 136కి చేరుకుంది. జలాశయం లోకి ఇన్ ఫ్లో 518 క్యూసెక్కుల నీరు. మూడు గేట్లు ద్వారా 456 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
కర్నూలు జిల్లా: తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636, ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment