dowleswaram barrage
-
ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం
-
భద్రాచలం: గోదావరి మహోగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భద్రాచలం నుంచి కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లే రహదారులపైకి వరద నీరు రావడంతో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికతూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 13.9 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి 13 లక్షల 6వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బొబ్బిల్లంకలో ఏటిగట్లు కోతకు గురవుతోంది. గట్టుకు గండిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇనుప బస్తాలతో మరమ్మత్తులు చేపట్టారు.జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు..చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 40 అడుగులకు నది నీటిమట్టం చేరింది. డొంకరాయి జలాశయానికి వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా 10,936 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 9 రోజులుగా సుమారు 50 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. నాలుగు మండల్లాలల్లో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరింది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,59,889 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 61,348 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 865.70 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.1322 టీఎంసీలు. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
తగ్గుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ఏలూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 7 గంటలకు 14,08,117 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువల ద్వారా 3,900 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు.. మిగులుగా ఉన్న 14,04,217 క్యూసెక్కుల (121.35 టీఎంసీల)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 393 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వదిలేయాల్సి వచి్చంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.70 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి బేసిన్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో ఎగువన వరద క్రమేణా తగ్గుతోంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 9.75 లక్షలు, దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి 10.22 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.3 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగుతోంది. ఇక పోలవరం బ్యారేజీలోకి 11,68,897 క్యూసెక్కులు చేరుతుండగా. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన 33.42 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. ఎగువ వరద తగ్గిన నేపథ్యంలో గురువారం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి దూకుడు తగ్గనుంది.జలదిగ్బంధంలోనే వేలేరుపాడు వేలేరుపాడు మండలం జల దిగ్బంధంలోనే ఉంది. 33 గ్రామాల్లోకి నీరు ప్రవేశించి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత లేదనే కారణంతో బుధవారం ఉదయం నుంచి పునరావాస కేంద్రాలను అధికారులు నిలిపివేశారు. గ్రామాల్లో నీరు నిలిచి ఉన్నా ప్రజలు ఊళ్లకు వెళ్లాల్సి వచి్చంది. విలీన మండలాల్లోని కమ్మరిగూడెం, అల్లూరు నగర్, కోయ మాధవరం, రామవరం ఉదయ్‌నగర్, రాళ్లపూడిలో 208 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. -
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం సాయంత్రం బ్యారేజ్‌లోకి 16,43,480 క్యూసెక్కులు (142.02 టీఎంసీలు) చేరుతుండటంతో నీటిమట్టం 16 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చి న గరిష్ట ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గోదావరి డెల్టాకు 10,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 16,32,780 క్యూసెక్కులను (141.09 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 831.357 టీఎంసీల గోదావరి మిగులు జలాలు కడలిపాలవడం గమనార్హం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు వస్తున్న ప్రవాహం 13.06 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 50.9 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి 13,80,216 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం స్పిల్ వేకు ఎగువన 34.28, దిగువన 26.21, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 35.43, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25.47 మీటర్లకు చేరుకుంది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి 13.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్‌లలోకి చేరే ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టనుంది. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల వరద తగ్గుముఖం పట్టింది. గోదావరి వరద శనివారం అర్థరాత్రి నుంచి తగ్గుతుండగా శబరినది వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గసాగింది. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చింతూరు మండలంలో వరదనీరు జాతీయ రహదారులపై నిలిచిపోవడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ప్రజలను, అధికారులను ఆందోళనకు గురిచేసిన వరద ప్రభావం ఆదివారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరదతో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పలు ఇళ్లు నీట మునిగాయి. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి 833 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తోందని ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 348.27 అడుగుల మట్టంలో నీరు ఉంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి గంటకు 881 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు మండలం కోమటిలంక గ్రామం వద్ద నాగరాజు కోడు (పోలరాజు డ్రెయిన్) వద్ద కాజ్‌వేపై వరద నీరు ప్రమాదకర పరిస్థితిలో ప్రవహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి వద్ద గోదావరి నిలకడగానే ప్రవహిస్తోంది. నరసాపురం పట్టణంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఏటిగట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, మర్రిమూల, పెదమల్లంలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9 మండలాల్లోని 30 గ్రామాలు వరద బారిన పడ్డాయి. ఇక్కడ శనివారం కన్నా ఆదివారం ఒక అడుగు ఎత్తున ముంపు పెరిగింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. పి.గన్నవరం పాత అక్విడెక్టు, అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మూడుచోట్ల కాజ్‌వేలు మునిగిపోగా, కొత్తగా పలు కాజ్‌వేల మీదకు వరద నీరు చేరింది. పి.గన్నవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, అయినవిల్లి మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. -
ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీగా వరద
-
ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
-
వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి/ధవళేశ్వరం: గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ.. భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్ (సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తించింది. చదవండి: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆ్రస్టేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్ ప్రొ.ఆర్. రగబ్ రగబ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నీటిపారుదలరంగ నిపుణులు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు దక్కినట్లయిందని నిపు ణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో రాష్ట్రంలో ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి. ఇక 2019లో ఇండోనేషియాలో జరిగిన 23వ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని కేసీ (కర్నూల్–కడప) కెనాల్ (కర్నూల్ జిల్లా), కంబం చెరువు (ప్రకాశం జిల్లా), పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్ జిల్లా)లను ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించింది. ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు గోదావరి డెల్టాకు 160 ఏళ్లుగా సాగు, తాగునీరు అందిస్తూ దేశ ధాన్యాగారంగా గోదావరి డెల్టా భాసిల్లడానికి కారణమైన ధవళేశ్వరం బ్యారేజ్‌ను మంత్రి అంబటి రాంబాబు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిల సూచనల మేరకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా గుర్తించాలని ఐసీఐడీకి పంపాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోటీలో ధవళేశ్వరం బ్యారేజ్‌ను ఐసీఐడీ ఎంపిక చేసింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు లభించింది. శతాబ్దాల క్రితం రాజులు నిరి్మంచిన చెరువులు, ఆనకట్టలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. అందులో పెద్దతిప్పసముద్రం, వ్యాసరాయసముద్రం, రంగరాయ సముద్రం, బుక్కపట్నం, రాయల చెరువులు ప్రధానమైనవి. వాటికి కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తాం. – వాసుదేవరెడ్డి, డీఈ, జలవనరుల శాఖ -
AP: వరద గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 13,74,840 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 13,66,040 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. వరదను పోలవరం వద్ద ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు.. 48 గేట్ల ద్వారా 11,62,898 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 33.930 మీటర్లకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 3,51,446 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే పదిగేట్లను పదడుగులు ఎత్తి 2,79,830, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,374.. కలిపి 3,42,204 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,80,397 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం 16 గేట్లను పదడుగులు ఎత్తి 2,36,400, క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,480.. కలిపి 2,68,880 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,181 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 11,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం/కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటలకు 11,58,927 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటిమట్టం 13 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 3,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 11,55,027 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు మంగళవారం రాత్రి 7 గంటలకు 13,55,586 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 51.7 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 9,89,625 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండగా దుమ్ముగూడెం సమీపంలోని సీతమ్మసాగర్ వద్దకు 13,11,731 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. సీతమ్మసాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. వాటికి వాగులు, వంకల వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్దకు బుధవారం 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్ద 33.380 మీటర్లకు నీటిమట్టం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 33.380 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రోడ్డుమార్గంలోని కడెమ్మ వంతెనకు ఇరువైపులా వరదనీరు చేరింది. కాగా, గోదావరి ఉద్ధృతికి శబరి నది తోడవడంతో విలీన మండలాలు ముంపునకు గురయ్యాయి. కూనవరంలో ఉదయ్‌భాస్కర్ కాలనీ, గిన్నెలబజారు మంగళవారం ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం సోమవారం అర్ధరాత్రే ఇళ్లను ఖాళీ చేయించి బాధితులను కోతులగుట్ట పునరావాస కాలనీకి తరలించింది. కూనవరం వద్ద గోదావరి మట్టం 48 అడుగులకు చేరింది. చరిత్రలో ఏడో అతి పెద్ద వరద ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,734 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గరిష్టంగా 1990లో 7,092.285 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవగా.. ఆ తర్వాత 1994లో 5,959.228 టీఎంసీలు, 2013లో 5,921.9 టీఎంసీలు, 1984లో 4,879.693 టీఎంసీలు, 2006లో 4,841.84 టీఎంసీలు, 1988లో 4,800.839 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఏడాదిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,213.371 టీఎంసీలే సముద్రంలో కలవడం గమనార్హం. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది. ► నాగార్జునసాగర్‌లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధారలో పెరిగిన వరద ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్‌లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కడలి ఒడిలోకి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణాలో స్థిరంగా వరద.. ► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్ టెయిల్‌పాండ్‌లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ► నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. వంశధార, నాగావళి పరవళ్లు.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద గోదారి.. కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్‌లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి వరద
-
27 రోజులు.. 2,192 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ఈ నెలలో కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 1861 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో గోదావరి జలాలు కడలి పాలవడం గమనార్హం. ఈ నెల ముగియడానికి మరో నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 75 చొప్పున నాలుగు రోజుల్లో మరో 300 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. అంటే.. జూలై ముగిసే నాటికి కనీసం 2,492.93 టీఎంసీలు సముద్రంలో కలవనున్నాయి. సాధారణంగా జూలైలో గోదావరికి భారీ వరదలు రావు. ఈ నెలలో సాధారణంగా 100 నుంచి 500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయి. ఇంతకంటే అధికంగా గోదావరి జలాలు కడలి పాలయ్యే అవకాశాలు తక్కువ. 2013 జూలైలో తొలి సారిగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అది కూడా జూలై ద్వితీయార్థంలో రావడంతో 2,033.86 టీఎంసీలు కడలి పాలయ్యాయి. ఇప్పటివరకూ అదే అత్యధిక రికార్డు. కానీ.. ఈ ఏడాది చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ద్వితీయార్థంలోనూ కొనసాగుతున్నాయి. కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీలు సముద్రంలో కలవడం ద్వారా 2013 జూలైలో సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత గోదావరి ఈ ఏడాది బద్దలు కొట్టడం గమనార్హం. మూడుసార్లు గరిష్ట ప్రవాహం వచ్చినా.. సాధారణంగా గోదావరి నదికి ఆగస్ట్ నెలలో మాత్రమే గరిష్ట ప్రవాహం వస్తుంటుంది. అందుకు భిన్నంగా.. గోదావరి చరిత్రలో 1861, 1988, 1989 సంవత్సరాల్లో జూలై నెలలో గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద ప్రవాహాలు వచ్చాయి. కానీ.. ఈ ఏడాది జూలై 16న ధవళేశ్వరం బ్యారేజీలో 26.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో జూలైలో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. 1861 నుంచి ఇప్పటివరకూ గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేశారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 6న అత్యధికంగా 28,05,773 క్యూసెక్కుల ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి రాగా.. గోదావరి చరిత్రలో ఇది రెండో అత్యధిక వరద ప్రవాహంగా నమోదైంది. వరద జలాల మళ్లింపునకు సర్కారు యత్నం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రం పాలవుతున్న ఈ నీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకుని.. రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించి వాటిని సుభిక్షం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి పోసి.. సోమశిల (పెన్నా)కు తరలించేందుకు ప్రణాళిక రచించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) అనుసంధానం ద్వారా 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రణాళిక రచించింది. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం గోదారమ్మ శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు, సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో భద్రాచలం వద్ద రాత్రి 7 గంటలకు 8,28,701 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 40.60 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడం.. శబరి కూడా శాంతించడంతో పోలవరం ప్రాజెక్టులోకి 6,63,660 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.39 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.62 మీటర్లకు తగ్గింది. పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండవాగుల నీరు నదిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు దిగువన వరద నీటి ప్రవాహంతో కడెమ్మ స్లూయిజ్ నుంచి కొండవాగు నీరు నదిలోకి చేరే పరిస్థితి లేదు. కాగా, ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రవాహం 9,70,218 క్యూసెక్కులకు, వరద మట్టం 11.70 అడుగులకు తగ్గింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రంలోకి 9,65,018 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు
సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది. ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముందుగానే అంచనా.. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్‌ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది.. ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్ మెసేజ్‌లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు. క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’ పోలవరం రూరల్ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్‌పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: గోదావరి శాంతించింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గురువారం గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 13,46,852 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 14.20 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగు లకంటే దిగువకు చేరుకునే వరకు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. బ్యారేజ్ లోకి చేరుతున్న నీటిలో 7,700 క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 13,39,152 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం బ్యారేజ్‌లోకి వచ్చే వర ద మరింత తగ్గనుంది. వర్షాలు తెరిపి ఇవ్వడంతో ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు తదితర ఉప నదుల నుంచి గోదావరికి వచ్చే వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 7,83,460 క్యూసెక్కులకు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యా రేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 8,92,340 క్యూసె క్కులకు తగ్గింది. దాంతో వాటి దిగువనున్న సీత మ్మసాగర్‌లోకి వస్తున్న వరద 10,67,705 క్యూసె క్కులకు తగ్గింది. గురువారం సాయంత్రం 6 గంట లకు భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 46.30 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. పోలవరం వద్దకు గురువారం 6 గంటలకు 11,37,103 క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్ వే వద్ద నీటిమట్టం 33.47 మీటర్లకు చేరింది. స్పిల్ వేకు దిగువన నీటిమట్టం 25.15 మీటర్లు ఉంది. -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ఎగువన వర్షాలు తెరిపివ్వడం.. ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గోదావరి వరద ప్రవాహం మంగళవారం మరింతగా తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,59,913 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 17.40 అడుగులకు తగ్గింది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగుల దిగువకు వచ్చే వరకు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు 5,400 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 18,54,413 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలోనూ తగ్గుముఖం ఎగువ భద్రాచలం వద్దకు వచ్చే వరద కూడా క్రమేణ తగ్గుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 12,51,999 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం 49.6 అడుగులకు తగ్గింది. దాంతో అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వచ్చే వరద 8,62,200 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి చేరుతున్న వరద 9,10,400 క్యూసెక్కులకు, సీతమ్మ సాగర్‌లోకి వస్తున్న వరద 11,65,362 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి భద్రాచలం వద్ద 43 అడుగుల కంటే దిగువకు గోదావరి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకుంటారు. వరద ప్రవాహం తగ్గినా పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చూస్తూ.. వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. -
తప్పుల వల్లే తిప్పలు
సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. కుంభవృష్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్ బేసిన్లలో ఎల్లి సబ్ బేసిన్ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్ బేసిన్ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది. భూమిలోకి ఇంకని నీరు గోదావరి బేసిన్ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్ పెటర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. -
Andhra Pradesh: గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, చింతూరు/దేవీపట్నం: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాలు తెరపి ఇవ్వడంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి తగ్గినప్పటికీ రానున్న 24 గంటలు కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 24,29,246 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దాంతో నీటి మట్టం 71 అడుగులకు చేరుకుంది. 32 ఏళ్ల క్రితం అంటే.. 1990 ఆగస్టు 24న గోదావరికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు భద్రాచలంలో వరద నీటి మట్టం 70.8 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు 32 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తుండటం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద వరద మట్టం 72 అడుగులకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గంట గంటకూ పెరుగుతున్న వరద ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 20,00,162 క్యూసెక్కులు చేరుతుండటంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 37.7 మీటర్లకు చేరుకుంది. గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పోలవరం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. శనివారం రాత్రికి 28.50 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద పోలవరంలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలో వరద మట్టం 17.75 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 21,78,427 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దాంతో నీటి మట్టం 19.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టాకు 10,000 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 21,68,427 క్యూసెక్కుల నీటిని కడలిలోకి వదిలేస్తున్నారు. ఎగువన శాంతిస్తున్న గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదారమ్మ శాంతిస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలోకి వస్తున్న వరద 2,94,429, లక్ష్మీ బ్యారేజీలోకి చేరుతున్న వరద 23,29,903 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ నుంచి విడుదల చేస్తున్న వరదతో సమ్మక్క బ్యారేజ్‌లోకి 24,21,180 క్యూసెక్కులు చేరుతోంది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సీతమ్మసాగర్‌లోకి 23,94,567 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద విడుదల చేసిన వరద.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరుకోవడానికి 48 గంటలు పడుతుంది. కాటన్ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 48 గంటలపాటు గోదావరి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. గోదావరి బేసిన్లో హైఅలర్ట్‌ను ప్రకటించింది. వందలాది గ్రామాలు నీట మునక వరద గోదావరి ఊళ్లను ముంచెత్తి ప్రవహిస్తోంది. 1986 తర్వాత గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద నీరు కారణంగా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలుగు మండలాల్లో వరదనీరు చుట్టుముట్టడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కూనవరం, వీఆర్.పురం మండలాలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకోగా చింతూరు, ఎటపాక గ్రామాల్లో నది పరీవాహక గ్రామాలను వరద ముంచెత్తింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద బ్యాక్ వాటర్ పోటు కారణంగా పోశమ్మగండి వద్ద వరద నీరు కొండను తాకింది. దేవీపట్నం మండలంలో కొండమొదలు పంచాయతీలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామస్తులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని సురక్షిత ప్రదేశాల్లో తల దాచుకుంటున్నారు. వీరికి శుక్రవారం దుప్పట్లు, టార్పాలిన్లు, కూరగాయాలు తదితర నిత్యావసరాలు పంపించినట్టు తహసీల్దార్ వీరభద్రరావు తెలిపారు. -
దడ పుట్టిస్తున్న ధవళేశ్వరం
-
ధవళేశ్వరం బ్యారేజ్‌కు భారీగా పోటెత్తుతున్న వరద
-
ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన డీఎస్సార్పీ
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీని బుధవారం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సార్పీ) పరిశీలించింది. బ్యారేజీకి ఉన్న 175 గేట్లను తనిఖీ చేసింది. తొలుత ఈ బృందం పోలవరం సీఈ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది. ప్రస్తుతం బ్యారేజి పరిస్థితి, చేపట్టాల్సిన పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో రిటైర్డ్ సీఈ ఈశ్వర్ ఎస్.చౌదరి, రిటైర్డ్ ఈఎన్సీలు బి.ఎస్.ఎన్.రెడ్డి, పి.రామరాజు, రిటైర్డ్ సీఈలు రౌతు సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జీఎస్ఐ రిటైర్డ్ డీజీ ఎం.రాజు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ స్కేప్ ఎక్స్పర్ట్ ఎండీ యాసిన్ తదితరులు బ్యారేజీని పరిశీలించారు. కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్లను సందర్శించారు. హోయిస్ట్ మెకానిజమ్, బ్యారేజ్ గేట్లు, గేర్ బాక్స్, లిమిట్ స్విచ్, బ్రేక్ యూనిట్, మోటార్లు, వైర్ రోప్‌లను పరిశీలించారు. గోదావరి డెల్టా సీఈ ఎన్.పుల్లారావు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు బ్యారేజ్ పరిస్థితిని కమిటీ సభ్యులకు వివరించారు. సాయంత్రం డీఎస్సార్పీ బృందం సభ్యులు నీటిపారుదలశాఖ అధికారులతో మరోసారి సమావేశమై బ్యారేజ్ పరిస్థితిపై చర్చించారు. కాటన్ బ్యారేజ్‌ను తనిఖీ చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబి పాండ్య పేర్కొన్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. బ్యారేజ్‌ను పరిశీలించే బృందంలో అన్ని విభాగాల నిపుణులు ఉన్నారన్నారు. బ్యారేజీకి పూర్వవైభవం డీఎస్సార్పీ బృందం సభ్యులు గురువారం కూడా బ్యారేజీ ఆఫ్రాన్‌తోపాటు గేట్ల పనితీరును మరోసారి తనిఖీ చేసి గోదావరి డెల్టా అధికారులతో సమావేశమవుతారు. తనిఖీల్లోను, అధికారులతో నిర్వహించిన సమావేశంలోను వెల్లడైన అంశాల ఆధారంగా ధవళేశ్వరం బ్యారేజీ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేయనున్నారు. డ్యామ్ రీహేబిలిటేషన్ ,ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్)లో ప్రపంచబ్యాంకు రుణంతో ఆధునికీకరణ పనులు చేపడతారు. కాటన్ బ్యారేజ్ డ్రిప్ పథకానికి ఎంపిక అయితే 40 ఏళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులు జరుగుతాయి. ఆధునికీకరణ ద్వారా కాటన్ బ్యారేజీకి పూర్వవైభవం వస్తుందని గోదావరి డెల్టా సీఈ ఎన్.పుల్లారావు పేర్కొన్నారు. -
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
-
ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ మంగళవారం సాగునీరు విడుదల చేశారు. దీంతో పోలవరం స్పిల్‌వే మీదుగా మొదటిసారి గోదావరి జిల్లాలకు సాగునీరు అందనుంది. చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
Sir Arthur Cotton: డెల్టా రైతుల నుదుటి రాతలు మార్చిన మాన్యుడు
నిర్మానుష్యంగా బొమ్మూరు మెట్టమీద ఒక గుర్రపుశాల, ఒక పెద్ద ఇల్లు అక్కడ నుండి చూస్తే గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టతో పాటు ఉరకలేస్తున్న గోదారమ్మ సోయగాలను వీక్షించవచ్చు. నీటి మీద రాతలు రాయలేం గానీ నీటిని ఆపి ఆనకట్ట కట్టి డెల్టా ప్రజల నుదుటిరాతను మార్చిన ‘దేవుడు’ సర్ ఆర్థర్ కాటన్ నివసించిన పవిత్ర స్థలం. క్రీ.శ. 1803 సంవత్సరం మే 15న ఇంగ్లాండు అడ్డీస్ కాంబేలో హెన్రీ కాలేలీ కాటన్ దంపతులకు 10వ సంతానంగా జన్మించిన అర్థర్ కాటన్ 15 ఏళ్ళ ప్రాయంలోనే కేడెట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సౌత్ ఇండియాలోని మద్రాస్ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసులో ఉద్యోగం పొందారు. కరువుతో అల్లాడుతున్న మధుర, కోయంబత్తూరు, తిరునల్వేలి ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసారు. 1840లో కృష్ణానదిపై ఆనకట్టకు ప్రతిపాదనలు రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేసారు. 17, 18 శతాబ్దాల కాలంలో అతివృష్టి, అనావృష్టి వరదలు వంటి వాటి కారణంగా బంగాళాఖాత తీరప్రాంతమైన కోరంగి, విశాఖపట్నం, యానాం, తదితర ప్రాంతాలలో కొన్ని వేలమంది చనిపోవడం, కొన్ని నౌకలు కూడా జలసమాధి కావడం జరిగింది. 1844లో మచిలీపట్నంలో వచ్చిన తుఫానుకు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ధాన్యరాశులు సముద్రంలో కలిసిపోయి 15 వేల మంది ప్రజలు మరణించడంతోపాటు గోదావరి, కృష్ణా ప్రాంతాలలో ప్రజలు ఆకలిమంటలతో అల్లాడిపోయారు. అప్పటికే కాటన్ 1844, 1845, 1846 సంవత్సరాలలో నివేదికలు పంపించినా బ్రిటిష్ పాలనా యంత్రాంగం ఆమోదించలేదు. దీంతో స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి 1847లో ఆనకట్ట నిర్మాణం మొదలు పెట్టారు కాటన్. ఎన్నో కష్టనష్టాలకోర్చి రవాణా సౌకర్యం లేని ఆ రోజులలో తన గుర్రంపై తిరిగి ఆయకట్టు ఎత్తుపల్లాలను సరిచూచుకొని కాలువలు తవ్వి చివరి ప్రాంత ఆయకట్టుకు కూడా నీరందించేలా డెల్టా వ్యవస్థను, ఆలాగే డ్రైనేజీ సదుపాయం, లాకుల వ్యవస్థ నిర్మించి కాలువలలో ప్రవహించే నీరు వృధాకాకుండా రైతులకు ఎక్కువ నీరు ఉపయోగపడేలా డెల్టాను రూపొందించిన ఘనులు. 1852లో గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో అపర భగీరథుడిగా మిగిలి, ఘనకీర్తిని సంపాదించుకున్నారు. దేశచరిత్రలో తొలిసారిగా కృష్ణా, గోదావరి డెల్టాల వ్యవస్థను కాలువ ఆయకట్లు, డ్రైనేజ్ పద్ధతిలో నిర్మించి మార్గదర్శకులైనారు. గోదావరి ప్రాంతానికి చెందిన వీణం వీరన్న 1847లో కాటన్ దగ్గర సహాయ ఇంజినీర్‌గా పనిచేసి కాటన్‌కు తోడుగా ఉండి ఆయన కార్యక్రమాలను అమలు చేసిన తొలి తెలుగు ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిపోయినారు. 1840లోనే కృష్ణానదిపై ఆనకట్ట ప్రతిపాదనలు బ్రిటీష్ ప్రభుత్వానికి పంపించి సిఫార్సు చేయడమే కాకుండా ధవళేశ్వరం బ్యారేజ్ పూర్తయిన తర్వాత కృష్ణా ఆనకట్టను నిర్మించారు కాటన్. అందుకే గోదావరి, కృష్ణా ప్రాంత ప్రజలు దేవాలయాలకు వెళ్లినపుడు మొదటిగా అన్నం పెట్టినవాడే దేవుడిగా భావించి కాటన్ మహాశయుణ్ణి తలచుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రాంతాన్ని అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చడంలో కాటన్ కృషి మరువలేనిది. 1858, 1863, 1867 సంవత్సరాల్లో కాటన్ బ్రిటిష్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు గంగానదిపై, ఒరిస్సాలోని ముఖ్యనదులపై ఆనకట్టలు నిర్మించే అమోఘమైన సలహాలు ఇచ్చారు. ఈ కాలంలోనే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకూ భారతదేశంలోని అన్ని నదులను అనుసంధానం చేసి యావత్ భారతదేశాన్ని సస్యశ్యామలం చేసే వినూత్న నివేదికలను మ్యాప్‌లను తయారుచేసి ఆ విధంగా జలరవాణాను కూడా ప్రోత్సహించాలని ఆనాడే ఆకాంక్షించారు. రవాణా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే కాటన్ వందలాది మైళ్ళు గుర్రంపై తిరిగి ఈ మహాయజ్ఞాన్ని పూర్తిచేసారు. కారు చౌకగా లభించే జలరవాణా ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవస్థను రూపొందించిన మహానుభావుడు. ఈ ప్రాంత ప్రజలు తినే తిండిలో, తాగే నీటిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో వెల్లివిరిసిన నాగరికతలో ఆయనే కనబడతాడు. రైతు వ్యవసాయానికి అనుకూలంగా కృష్ణా, గోదావరి డెల్టాలను ఆధునీకరణ చేసి నీటి వృధాను తగ్గించి, కాటన్ మహాశయుని ఆశయాలను కాపాడి, మన ముందు తరాలను అందించడమే ఆయనకు మనమర్పించే నివాళి. - కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 -
వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలంప్రాజెక్టు: పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుముఖం పడుతోంది. సోమవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 1.81 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలను సముద్రంలోకి వదులుతుంటే.. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 13.20 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలను కడలిలోకి వదులుతున్నారు. ► ఆల్మట్టి నుంచి లక్ష క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 68 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద 2.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ► నాగార్జున సాగర్ నుంచి దిగువకు 89 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 2.26 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 39.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. పది వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 13.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికి వరద మరింతగా తగ్గే అవకాశం ఉంది. -
మరోసారి మహోగ్రం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, కుక్కునూరు: గోదారమ్మ తగ్గినట్లే తగ్గి అంతలోనే మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వద్ద మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 55.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.75 అడుగుల నీటిమట్టం ఉండగా మొత్తం 175 గేట్లను ఎత్తి 18,59,570 క్యూసెక్యులను సముద్రంలోకి వదులుతున్నారు. ► భద్రాచలం వద్ద వరద తాకిడి మరోసారి పెరగడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు తిరిగి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద నీరు రహదారిపైకి చేరడంతో కుక్కునూరు – భద్రాచలం రాకపోకలు నిలిచిపోయాయి. ► ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ► రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ధనలక్ష్మి పరిశీలించారు. ► శబరి వరద నీరు చింతూరులో ప్రవేశించి సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు. చింతూరు వంతెన వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైన లాంచీ సరంగు పెంటయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. -
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 881.30 అడుగుల్లో 195.21 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 79,131 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 71,321 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి 1.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 260.59 టీఎంసీలకు చేరింది. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 18,989 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో పులిచింతలలో నీటి నిల్వ 14.98 టీఎంసీలకు చేరింది. ► ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మరో మూడు రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండనున్నాయి. ► పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరుల్లో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గింది. బుధవారం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 68,522 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 48,754 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శాంతించిన గోదావరి గత నాలుగు రోజులుగా మహోగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గడంతో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 18.56 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం ఉదయానికి వరద ప్రవాహం మరింత తగ్గుతుందని.. ధవళేశ్వరంలో నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను, ఇంకా తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని వెల్లడించారు. – మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 190.79 టీఎంసీలు (ఈ నీటితో పోలవరం ప్రాజెక్టు ఒకే రోజులో నిండిపోతుంది) కడలిపాలయ్యాయి. – పోలవరం వద్ద కూడా గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. – పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించి బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. – ఏజెన్సీలోని 19 గిరిజన గ్రామాలు జలదిగ్భంధంలోనే కొనసాగుతున్నాయి. నిర్వాసితులకు టూరిజం బోట్ల ద్వారా నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. – అమావాస్య ప్రభావంతో.. సముద్రపు పోటుతో నర్సాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణ పరిధిలో గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. – తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేశారు. – విలీన మండలాల్లో ముంపులో ఉన్న లోతట్టు గ్రామాల్లో అధికారులు లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. – చింతూరు మండలంలో చట్టి చిదుమూరు, కుయిగూరు వద్ద జాతీయ రహదారిపై నీరు ఉండడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. దేవీపట్నంలో ఇళ్లన్నీ ముంపులోనే ఉన్నాయి. – కోనసీమలోని లంక గ్రామాలు ముంపు నుంచి బయటపడలేదు. మలికిపురం మండలం దిండిలో వశిష్ట గోదావరి ఏటి గట్టు లీకవ్వగా వెంటనే హెడ్ వర్క్స్ అధికారులు లీకేజీని అరికట్టారు. – కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పడవపై వెళ్లి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఎంపీ చింతా అనూరాధ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
తగ్గుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత రెండు రోజులుగా భారీ వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం రాత్రికి తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద 17.75 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 19.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో 22,40,194 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 150.7 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 702.07 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లోనూ అన్నిచోట్లా వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. తూర్పు గోదావరి జిల్లా పెదకందలపాలెంలో వరదనీటిలో పిల్లలను మోసుకెళ్తున్న దృశ్యం సహాయక చర్యలు ముమ్మరం ► వరద ప్రభావిత గ్రామాల్లో లాంచీలు, ఇంజన్ బోట్ల ద్వారా బాధితులకు పాలు, బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కొవ్వొత్తులు, ఇతర నిత్యావసరాలను యుద్ధప్రాతిపదికన అందిస్తున్నారు. ► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలుగు మండలాల్లో 16 గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకోగా 74 గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో 3,846 కుటుంబాలకు చెందిన 11,036 మందిని 59 పునరావాస కేంద్రాలకు తరలించారు. గర్భిణులతోపాటు అత్యవసర వైద్యసేవలు అవసరమైన 149 మందిని చింతూరు ఏరియా ఆస్పత్రి, కూనవరం పీహెచ్‌సీలకు పంపారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో 71 గ్రామాల్లో 10 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని అధికారులు అంచనా వేశారు. వారి కోసం 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 5 వేల మందికి చోటు కల్పించారు. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ► ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. ► ముంపులో ఉన్న విలీన మండలాల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా సరుకులను మోస్తూ అందజేశారు. ► కమ్యూనికేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తూ వైద్యులు, పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ► ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు.. పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు.. చిర్ల జగ్గరెడ్డి, పొన్నాడ సతీశ్‌కుమార్, తెల్లం బాలరాజు, అధికారులు పర్యటించారు. ► ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. శ్రీశైలంలోకి 3.63 లక్షల క్యూసెక్కులు కృష్ణా, తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం చేరుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3,63,772 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ సీజన్లో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరుకోనుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 877.50 అడుగుల్లో 176 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులు నిర్ణయించారు. ► తుంగభద్ర డ్యామ్ నిండిపోవడంతో 20 గేట్లను ఎత్తి 77 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం నుంచి 42,378 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 255.82 టీఎంసీలకు చేరుకుంది. ► మూసీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరద ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 13.32 టీఎంసీలకు చేరింది. ► ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి 1.13 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టాకు వదలగా మిగిలిన 1.05 లక్షల క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ముంచెత్తిన గోదారి
నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉపనదులు.. ప్రాణహిత, ఇంద్రావతి, శబరిలతోపాటు ఇతర కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లోని విలీన మండలాలు, కోనసీమలో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. రాకపోకలు స్తంభించాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే వేలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద మట్టం 61.20 అడుగులకు చేరుకోవడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 19,69,535 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 2013 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. 175 గేట్లు ఎత్తి 20,01,525 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. సోమవారం రాత్రికి వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరి మంగళవారం ఉదయానికి 14 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగిలో, చింతూరు మండలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విలీన మండలాల్లో వరద బీభత్సం ► గోదావరి, శబరి నదుల ఉధృతితో విలీన మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ మండలాల్లో సుమారు 100 గ్రామాలు ముంపులో ఉన్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, 20 శివారు గ్రామాలు నీట మునిగాయి. కుక్కునూరు మండలంలో 10 గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. ► దేవీపట్నం మండలంలో పోచమ్మగండి అమ్మవారి ఆలయంతోపాటు ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. ► తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ► స్తంభాలు ముంపులో ఉండటంతో విలీన మండలాల్లో విద్యుత్ నిలిచిపోయి అంధకారం అలుముకుంది. అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్ నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆరు అడుగుల మేర నీరు చేరింది. వశిష్ట గోదావరి పోటెత్తడంతో నర్సాపురం వద్ద పొన్నపల్లి, మాధవాయిపాలెం, కొండాలమ్మగుడి ప్రాంతాల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరింది. వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పోశమ్మగండిలో నీటమునిగిన ఇళ్లు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం ► విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. పోలవరం, గోదావరి డెల్టా సీఈలతో సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ► మొత్తం ఆరు రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. దేవీపట్నం మండలంలో 5,800 కుటుంబాలను, వేలేరుపాడు మండలంలో 1,346 కుటుంబాలను, కుక్కునూరు మండలంలో 687 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► పోలవరం గ్రామంలో నెక్లెస్‌బండ్ బలహీనంగా ఉండటంతో పటిష్టపరిచే పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ► రంపచోడవరం మన్యంలో నిర్వాసితులకు రేషన్, ఇతర నిత్యావసరాలు ముందుగానే పంపిణీ చేశారు. ► కోనసీమ ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్, ఎంపీ అనూరాధ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. -
'మహోగ్ర' గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, కాకినాడ/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, బళ్లారి/హొసపేటె/ఆదోని: నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,28,632 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కులను వదిలి, మిగులుగా ఉన్న 15,23,132 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. నిండుకుండలా మారిన రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ► భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 54 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ► 1986లో భద్రాచలం వద్ద గరిష్టంగా వరద నీటిమట్టం 55.66 అడుగులుగా నమోదైంది. మళ్లీ ఆదివారం రాత్రి 9 గంటలకు అక్కడ వరద నీటిమట్టం మరింత ప్రమాదకరంగా మారొచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30 అడుగులకు చేరుకుంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెన మునిగిపోయింది. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోష్పాద క్షేత్రం నీటమునిగింది. ► తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో శబరి ఉధృతి కారణంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఆగాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర, జాతీయ విపత్తు దళ బృందాలను రంగంలోకి దించి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. ► టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం మధ్య ఎర్రకాలువ దాటుతూ ములకాల దుర్గారావు మృతి చెందాడు. ► శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 83.471 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 431.021 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. కృష్ణా నదిలో మళ్లీ పెరిగిన వరద ► కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 42,378 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 144.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 249.80 టీఎంసీలకు చేరుకుంది. ► పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.56 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో 70 గేట్లు ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి బ్యారేజీలోకి వరద మరింత పెరగనుంది. తుంగభద్ర డ్యామ్ నుంచి మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. -
గోదారోళ్ల గుండెల్లో కొలువై..
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలం అవుతున్న గోదావరి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మార్చాడు.. లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదారోళ్ల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించారు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు.. అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్ ఆర్థర్ కాటన్.. నేడు కాటన్ దొర 120 వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి వారి మదిలో ఆరాధ్య దైవంగా నిలిచారు సర్ ఆర్థర్ కాటన్. అఖండ గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదారోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కరువు కోరల్లో ఉండే ప్రాంతాన్ని పచ్చటి తివాచీ పరిచినట్టుగా మా ర్చారు. ఆనకట్ట నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చిన అపర భగీరధుడి పేర్గాంచారు. ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లు అయినా ఆ మహా నీయుడు చేసిన మేలు చిరస్థాయిగా గుర్తుండాలని గ్రామాగ్రామానా ఆయన శిలావిగ్రహాలు నెలకొల్పి స్మరించుకుంటున్నారు గోదారోళ్లు. 1803 మే 15న జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ 1899 జూలై 24న కన్నుమూశారు. దశ.. దిశను మార్చిన దొర ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసమని కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయాలపై 1847 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి 1.65 లక్షల డాలర్లు (రూ.5 లక్షలు) ఖర్చు చేశారు. నిర్మాణానికి రోజుకు 1300 మంది కార్మికులు పని చేసేవారు. ఆరంభంలో తక్కువ ఎత్తుగల గేట్లు ఏర్పాటు చేయడంతో కాటన్ 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జలరవాణాను వినియోగంలోకి తెచ్చారు. తర్వాత 1887లో ఆయకట్టును 7,94,824 ఎకరాలకు విస్తరించారు. తర్వాత ఆ యకట్టుని 9,99,132 ఎకరాలకు విస్తరించారు. అనంతరం దీనిని ఉభయగోదావరి జిల్లాల్లో 10,09,009 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా విస్తరించారు. 1961 ఈ ఆనకట్ట భద్రతను ఎస్సీ మిత్ర కమిషన్ పరిశీలించింది. దీని స్థానంలో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అందుకు రూ.26.59 కోట్లు అంచనా వేశారు. 1970లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీకి సమాంతరంగా 40 మీటర్లపై భాగంలో ప్రస్తుత ఆనకట్ట నిర్మించారు. దీనిని 1982 అక్టోబర్ 29న జాతికి అంకితం చేశారు. తూర్పుగోదావరిలో.. గోదావరి డెల్టా ఆయకట్టు (చేపల చెరువులు, తోటలు కలిపి) - 10,09,009 ఎకరాలు పశ్చిమగోదావరి జిల్లాలో.. పశ్చిమ డెల్టా ఆయకట్టు - 5,29,273 ఎకరాలు (సుమారు 2 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువుల విస్తరించాయి) పశ్చిమ డెల్టా ఆయకట్టులో ప్రధాన కాలువలు - 11 (గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ, కాకరపర్రు, గోస్తనీ, వేల్పూరు, నరసాపురం, ఏలూరు, అత్తిలి, జంక్షన్, వెంకయ్య వయ్యేరు, ఓల్డ్ వయ్యేరు, ఉండికాలువలు) (357 కిలోమీటర్లు) పంపిణీ కాలువలు పొడవు 2,020 కిలోమీటర్లు తూర్పు గోదావరిలో.. తూర్పు డెల్టా ఆయకట్టు - 2,45,333 ఎకరాలు సెంట్రల్ డెల్టా ఆయకట్టు - 2.01,898 ఎకరాలు పిఠాపురం బ్రెంచ్ కెనాల్ - 32,507 ఎకరాలు 65 మండలాలు.. 10 లక్షల ఎకరాలు కాటన్ దొర గోదావరి ప్రాంతంలో గుర్రంపై తిరుగుతూ చేతి కర్రతో గీసిన గీతలే నేడు డెల్టా ఆయకట్టు కాలువలుగా మారాయి. ఇప్పుడు రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న ప్రాజెక్టు ఇదే కావడం గమనర్హం. రెండు జిల్లాలో సాగు నీరు, తాగునీరు, పరిశ్రమలకు అవరసరమైన జలాలు ఈ ఆనకట్ట ద్వారానే సమకూర్చుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపల చెరువులతో కలిపి 10,09,009 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలో తూర్పుడెల్టా, సెంట్రల్ డెల్టా, పిఠాపురం బ్రెంచ్ కెనాల్ ద్వారా 4,79,736 ఎకరాలు, జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ద్వారా 5,29,273 ఎకరాల ఆయకట్టు సాగువుతుంది. ఈ ఆనకట్టలో 2.931 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. గోదావరి డెల్టాలో తూర్పుగోదావరిలో 36 మండలాలు, పశ్చిమ గోదావరిలో 29 మండలాలు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. 1862 నుంచి ఆనకట్ట పూర్తిస్థాయిలో ఆపరేషన్లోకి వచ్చింది. ధవళేశ్వరం ఆర్మ్‌కి 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్‌కి 43, మద్దూరు ఆర్మ్‌కి 23, విజ్జేశ్వరం ఆర్మ్‌కి 39 గేట్లు చొప్పున ఏర్పాటుచేశారు. ఒక్కోగేటు ఏకంగా 27 టన్నుల బరువు ఉంటుంది. ఆయకట్టుని తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే మూడు డెల్టాలుగా విభజించారు. -
డెల్టా ఆధునికీకరణతో.. మళ్లీ అరకొరేనా!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ పంటకు నీటి విడుదల గడువు ఆదివారంతో ముగుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు మార్చి 31తో నీటిని నిలిపివేయాల్సి ఉన్నా పలు ప్రాంతాల్లో పంట పొట్టదశలో ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ముందు పది రోజులు, ఆ తర్వాత మరో ఐదు రోజులు వెరసి ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 15న సాయంత్రం 6 గంటలకు మూడు డెల్టా కాలువలను మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నిర్ణయం తీసుకోనున్నారు. 16 నుంచి మే 30 వరకు 45 రోజుల పాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. 2,020 పనులు.. రూ.308 కోట్లు.. రబీ ఆరంభానికి ముందు గత ఏడాది నవంబర్‌లో కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చే యాలని నిర్ణయించారు. మార్చి 31న కాలువలు మూసి వేసి మే 30 వరకు 60 రోజులపాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా 15 రోజులు నీరు విడుదల చేయడంతో డెల్టా ఆధునికీకరణ పనులకు 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రూ. 308 కోట్లతో 2,020 పనులు చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెల్టా ఆధునికీకరణ కింద రూ. 173 కోట్లతో 370 పనులు చేయనున్నారు. నీరు– చెట్టు పథకంలో రూ.135 కోట్లతో 1650 పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పునరావృతం కాకూడదంటున్న రైతులు గత ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆధునికీకరణలో భాగంగానే రూ. 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్రధాన కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రైన్లలో పూడిక తీత, రిటైనింగ్ వాల్స్, హెడ్ స్లూయిజ్, స్లూయిజ్ పనులు చేపట్టారు. నెల రోజులు ఆలస్యంగా మే నుంచి పనులు చేయడం ప్రారంభించారు. మరికొన్ని పనులు హడావుడిగా మే నెలాఖరున ప్రారంభించారు. జూన్ 1నే నీరు విడుదల చేయాలన్న రైతుల పోరాటం ఫలించినా పనులు పూర్తి కాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. జూన్ ఒకటిన అధికారులు కాలువలకు నీరు విడుదల చేసినా ఆధునికీకరణ పనులు మధ్యలో ఉండడంతో ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ కాలువలకు అడ్డుకట్టలు వేసి పనులు చేయడంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు 15 రోజులు ఆలస్యంగా అందింది. గత ఏడాది అదృష్టవశాత్తూ అక్టోబర్‌లో తుపాన్లు రాకపోవడం వల్ల పంట కోత ఆలస్యమైనా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాదైనా డెల్టా ఆధునికీకరణ పనులు సకాలంలో మొదలు పెట్టి నిర్ణీత గడువు మే 30 నాటికి పూర్తి చేసి జూన్ ఒకటిన నిరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గోదావరి భారీగా వరద
రాజమండ్రి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో 2 లక్షల 63 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. అలాగే డెల్టాకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. -
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 10.90 అడుగులకు చేరింది. దీంతో 4,47,138 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదిలారు. వరద ఉధృతి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి అంత్య పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద ఉధృతి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోని పాత స్నానఘట్టంతోపాటు వీఐపీ, కొత్త గౌతమి ఘాట్లను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం గోష్పాద క్షేత్రంలోని నూతనంగా నిర్మించిన ఘాట్లలోనే స్నానాలు చేయాలని భక్తులకు అధికారులు సూచించారు. -
గోదారి పరవళ్లు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
రాజమండ్రి/కొవ్వూరు: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరదనీరు వస్తుండడంతో మంగళవారం ఉదయం 8 గంటలకు 12.30 అడుగులకు నీటి మట్టం చేరింది. ఉదయం 4.45 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గేట్లు ఎత్తివేసి 10,99,359 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిపారుదల అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి వరదనీటి ప్రవాహాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
ధవళేశ్వరం వద్ద 10.20 అడుగులకు చేరిన నీటి మట్టం
తూర్పుగోదావరి(రాజమండ్రి): ధవళేశ్వరం బ్యారేజీలో ఆదివారానికి నీటిమట్టం 10.20 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదిలారు. -
ముట్టడి వీడింది
జల‘జాలం’ తొలగిపోతోంది. ఉప్పొంగి, ముంచెత్తి, ముప్పుగా మారిన గోదావరి.. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంది. నీటి పిడికిట్లో నాలుగురోజులు ఉక్కిరి బిక్కిరైన లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దారీతెన్నూ లేకుండా పోయిన దుస్థితి నుంచి తేరుకుంటున్నాయి. పలుచోట్ల వరద చిన్నెలు ఇంకా కొనసాగుతున్నా.. మొత్తం మీద బెడద తప్పినట్టే! అమలాపురం : గోదావరి వరద ఉధృతి వేగంగా తగ్గిపోతోంది. ఒక్కరోజులో నది ఉరవడి సగానికి తగ్గిపోయింది. లంకలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. నాలుగు రోజుల పాటు ముంపులో కొట్టుమిట్టాడిన లంకగ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కాజ్‌వేలు, రోడ్లపై ఇంకా ముంపునీరు పారుతుండడంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. అయితే మురుగు కాలువల వల్ల ముంపు బారిన పడ్డ గ్రామాలు ఇంకా తెరిపిన పడలేదు. గోదావరి వరద ఎంత వేగంగా ముంచెత్తిందో.. అంతే వేగంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 14.70 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 14.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 9.90 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 7.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక, గురువారం ఉదయం పది గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. వరద తగ్గడంతో బ్యారేజి ఎగువన ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాలు, రాజమండ్రి వద్ద బ్రిడ్జిలంక ముంపు నుంచి బయటపడ్డాయి. ఆయా లంకలకు రాకపోకలు ఆరంభమయ్యాయి. కాగా బ్రిడ్జిలంక వాసుల్లో చాలా మంది శుక్రవారం కానీ వారి ఇళ్ల వద్దకు వెళ్లే అవకాశం లేదు. దిగువ న ఉన్న కోనసీమలంకల్లో సైతం ముంపు వేగంగా తగ్గుతోంది. అయితే పాశర్లపూడిలంక దిగువన, వీరవల్లిపాలెం, చాకలిపాలెం కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, ఠానేలంకలు ముంపు నుంచి బయటపడ్డా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, తోటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, మామిడికుదురుల్లో బి.దొడ్డవరం, అప్పనపల్లి, పాశర్లపూడిలంక, జి.పెదపూడి, ఊడిముడిలంక, కె.ఏనుగుపల్లి, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోడేరులంక, కనకాయలంక ముంపు నుంచి ఇంకా బయటపడలేదు. తగ్గని డ్రైన్ల ముంపు మంగళవారం వరదకు కొట్టుకుపోయిన పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి మృతదేహం సమీపలంక గ్రామమైన వై.కొత్తపల్లిలంకలో దొరికింది. అయితే బుధవారం రాత్రి కొట్టుకుపోయిన అప్పనపల్లి దేవస్థానం ఉద్యోగి కాండ్రేగుల శ్రీనివాసశాస్త్రి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు అయినాపురం, బండార్లంక అప్పర్ కౌశిక డ్రైన్ల ముంపు తీవ్రత అలాగే ఉంది. అయినాపురం డ్రైన్ నుంచి ముంపునీరు ముమ్మిడివరం మండలాల్లోని గ్రామాల్లోనే కాక ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాల వరిచేలను ముంచెత్తుతోంది. డ్రైన్ నుంచి ముంపునీరు గోదావరిలోకి దిగే వరకూ ఈ దుస్థితి తప్పదని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి దూరంగా నష్టం అంచనాలు వరద నష్టంపై ఉద్యానశాఖ అధికారులు తయారు చేస్తున్న ప్రాథమిక అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. కేవలం 1984 ఎకరాల్లో మాత్రమే కూరగాయ పంటలు, బొప్పాయి, తమలపాకు, పూల సాగు దెబ్బ తిన్నట్టు చెపుతున్న అధికారులు ముంపుబారిన పడిన కొబ్బరి, అరటి, కోకో వంటి వాణిజ్య పంటలకు నష్టం ఉండదని తేల్చేశారు. వాస్తవంగా నష్టం ఇంతకన్నా బాగా ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. సీతానగరం, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో కూరగాయల పంటలకు అపారనష్టం జరిగింది. ఈ ప్రాంతాల్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో పంట దెబ్బ తిందని రైతులు చెబుతున్నారు. అరటిలో నర్సరీ స్థాయి మొక్కలు నాలుగురోజులపాటు ముంపులో ఉండడం వల్ల తెగులు సోకే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పశువుల పాకలు ఎక్కువగా ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి లంక గ్రామాల్లోని గ్రావెల్ రోడ్లు దెబ్బ తిన్నాయి. ముంపు నీట నానిన పూరి గుడిసెలు సైతం కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాస్తవంగా జరిగిన నష్టం తేలాలంటే ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సాధ్యం.