ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం గోదారమ్మ శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు, సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో భద్రాచలం వద్ద రాత్రి 7 గంటలకు 8,28,701 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 40.60 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడం.. శబరి కూడా శాంతించడంతో పోలవరం ప్రాజెక్టులోకి 6,63,660 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.39 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.62 మీటర్లకు తగ్గింది. పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండవాగుల నీరు నదిలోకి వెళ్లే పరిస్థితి లేదు.
ప్రాజెక్టు దిగువన వరద నీటి ప్రవాహంతో కడెమ్మ స్లూయిజ్ నుంచి కొండవాగు నీరు నదిలోకి చేరే పరిస్థితి లేదు. కాగా, ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రవాహం 9,70,218 క్యూసెక్కులకు, వరద మట్టం 11.70 అడుగులకు తగ్గింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రంలోకి 9,65,018 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment