![Godavari flood flow has increased at Dowleswaram Barrage - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/dowleswaram.jpg.webp?itok=Uquap_Mu)
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 13,74,840 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది.
గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 13,66,040 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. వరదను పోలవరం వద్ద ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు.. 48 గేట్ల ద్వారా 11,62,898 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 33.930 మీటర్లకు చేరుకుంది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు కడలిలోకి
పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 3,51,446 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే పదిగేట్లను పదడుగులు ఎత్తి 2,79,830, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,374.. కలిపి 3,42,204 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లోకి 2,80,397 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం 16 గేట్లను పదడుగులు ఎత్తి 2,36,400, క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,480.. కలిపి 2,68,880 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,181 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 11,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment