rains in andhra pradesh
-
వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశం చేపట్టారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతోపాటు, భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా ముఖ్యమంత్రి ఆరాతీశారు. 42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. సహాయచర్యల్లో 3 NDRF, 4 SDRF బృందాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని అధికారులు తెలియ జేశారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు. చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని అధికారులు సీఎంకు వివరించారు. కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామన్న అధికారులు.. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని అన్నారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆ మేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు -
చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బిహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సోమవారం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బలపడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం.. ప్రభావం ఎంతంటే?
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఆ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం తెలిపింది. దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగానే ఉండనుంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. -
స్థిరంగా.. అల్పపీడనం! రాష్ట్రంపై ప్రభావం ఏ మేరకు ఉంటుందంటే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మధ్య దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్యరేఖ ప్రాంతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో నెమ్మదిగా కదులుతూ శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. -
కొనసాగుతున్న తూర్పు, ఈశాన్య గాలులు.. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షం కురిసింది. -
IMD Alert: నెలాఖరులోగా మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది గురువారం పూర్తిగా బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీనిఫలితంగా రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
కొనసాగుతున్న వాయుగుండం.. ఉరుములు, మెరుపులతో వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి త ర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదు చ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. -
వాయుగుండం: కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం రానున్న రెండు రోజులు అదే దిశలో తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు మొదలవుతాయని తెలిపింది. 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురు వానలకు అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ వరకు తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. -
ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. -
16న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (అర్బన్): కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం నాటికి కుంభవృష్టిగా మారింది. నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో బారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధానంగా కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలం రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందల గ్రామం వద్ద చప్టాపై నీరు పొంగి ప్రవహిస్తోంది. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. బ్రాహ్మణక్రాక– కృష్ణాపాడు రోడ్డుపై వర్షపు నీరు చేరింది. కొండాపురం మార్గంలో మిడతలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడ్లూరు–బసిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరు బ్రిడ్జిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గుడ్లూరు–తెట్టు ప్రధాన రహదారిలో చెమిడిదిపాడు వద్ద ఉన్న రాళ్లవాగు కూడా ఉధృతంగా పారుతుండడంతో మధ్యాహ్నం వరకు కావలి–కందుకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉలవపాడు మండలంలో బద్దిపూడి–మాచవరం మధ్య ఉన్న ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మన్నేటికోట–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో చుట్టుగుంటకు రాకపోకలు నిలిచిపోయాయి. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే, అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, కేరళ మీదుగా ప్రయాణించి ఆదివారం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో విలీనమవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడులో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పొదిలి, కావలి, చీమకుర్తి, లింగసముద్రం, ఉలవపాడు, నగరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. -
దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2.6, చిత్తూరు జిల్లా గుడిపాలలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
22 తర్వాత తుపాను!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22వ తేదీ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం స్పష్టతనిచ్చింది. ఐఎండీ తాజా నివేదిక ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ ఈనెల 22 వ తేదీ ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆనంతరం ఈ వాయుగుండం మరింత బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ తెలిపింది. అయితే ఇది మరింతగా బలపడి అతి తీవ్ర/సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర–దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై అధిక ప్రభావం తుపాను ప్రభావం మన రాష్ట్రంపై అధికంగా ఉండనుంది.ఫలితంగా ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
ఆగని వానలు.. అనంతపురం జిల్లాలో కుండపోత
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఇంకా ఆగలేదు. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తెరపినిచ్చినా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అనంతపురం, అన్నమయ్య, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి, పల్నాడు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. అనంతపురం నగరం వర్షాలతో వణుకుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కసిపాడులో బుధవారం అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏర్పడితే మరింత బలపడి రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురుస్తాయని భావిస్తున్నారు. రెండు, మూడురోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పుంగనూరులో 6.9 సెంటీమీటర్లు, రాప్తాడు, కూడేరుల్లో 6.4, కె.కోటపాడులో 6.3, అనంతపురంలో 6.2, తంబళ్లపల్లెలో 5.7, కుట్టగుళ్లలో 5.4, నగరంలో 5.3, రాజాంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనంతపురాన్ని చుట్టుముట్టిన వరద అనంతపురం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి వరకు వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలావరకు చెరువులు నిండిపోయాయి. అనంతపురం నగరాన్ని వరద చుట్టుముట్టింది. వందలాది ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో లోతట్టు ప్రాంతాల జనం విలవిల్లాడుతున్నారు. నగరంలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి బాధితులను వాటిలోకి తరలిస్తున్నారు. అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ నాగలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు అనంతపురంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధితులకు రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు భోజనం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది రబ్బర్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,57,051 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం రెండు గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,120 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు çహెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,333 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 600 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టంఓ 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
శ్రీశైలానికి మళ్లీ పెరిగిన వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోంది. శనివారం సాయంత్రం జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,85,809 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 13.382 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 10.682 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. వీటి ద్వారా 50,307 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 8,666 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,033 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 196.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 881.60 అడుగులకు చేరుకుంది. సాగర్ ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు విజయపురి సౌత్: నాగార్జున సాగర్‌కు ఎగువ నుండి వచ్చే వరద పెరగడంతో శనివారం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి వచ్చే నీటితోపాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. మొత్తం 88,997 క్యూసెక్కులు జలాశయానికి వస్తోంది. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం మరోసారి గరిష్ట స్థాయి 590.00 అడుగులకు చేరింది. ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 26,552 క్యూసెక్కులతో కలిపి మొత్తం 75,152 క్యూసెక్కులు సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, వరద కాలువ, ఎస్ఎల్బీసీలకు 13,845 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
'హర్ష'పాతం
సాక్షి, విశాఖపట్నం: కరువు ఛాయల్లేకుండా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపించాయి. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవి ప్రభావం చూపుతాయి. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవనాలే కీలకం. అందుకే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఇటు రైతులు, అటు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తి చూపుతాయి. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు ఇప్పటివరకు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తరచూ తేలికపాటి నుంచి మోస్తరుగాను, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిశాయి. ఇలా వరుసగా నాలుగేళ్ల నుంచి ఖరీఫ్ సీజనులో వరుణుడు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఎంతో దోహదపడ్డాయి. రుతుపవనాల సీజను మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏడు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల్లో ‘నైరుతి’ సీజన్ ముగింపు ఇక మరికొద్ది రోజుల్లోనే నైరుతి రుతుపవనాల సీజను ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో సాధారణం, ఐదు జిల్లాల్లో అధిక, ఒక జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం, కాకినాడ, బాపట్ల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అధిక వర్షపాతం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అరకొర వర్షాలతో కరువు పరిస్థితులేర్పడే అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణానికి మించి అధిక వర్షం కురవడం విశేషం. సాధారణం కంటే అధికం.. మరోవైపు.. నైరుతి రుతుపవనాల సీజనులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 514.7 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 544.3 మి.మీలు కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 6.0 శాతం అధికమన్నమాట. ఒక్క సెప్టెంబర్‌లోనే 95 మి.మీలకు గాను 115.9 మి.మీలు (22 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. నిజానికి.. సాధారణంకంటే 20 శాతానికి పైగా తక్కువ వర్షం కురిస్తే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇలా ఈ నైరుతి రుతుపవనాల సీజనులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు ఏర్పడకుండా ఖరీఫ్ సీజను ముగుస్తుండడం, అవసరమైనప్పుడల్లా వర్షాలు కురుస్తూ పంటలకు ఢోకా లేకపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/సాక్షి, రాజమహేంద్రవరం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఇది కొనసాగుతోంది. ఇది మంగళవారం నాటికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత ఒడిశా మీదుగా మధ్యప్రదేశ్ వైపు ప్రయాణించి క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంతోపాటు దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం దాదాపు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో రహదారులు ఏరులను తలపించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు ఆయా మండలాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది.. ఏలూరు 113.6, వేలేరుపాడు 46.2, దెందులూరు 26.4, టి.నర్సాపురం 26, కుక్కునూరు 24.6, భీమడోలు 24, లింగపాలెం 22.8, చాట్రాయి 21.2, కొయ్యలగూడెం 20, పెదవేగి 18.6, ముసునూరు 18.4, కైకలూరు 18.4, కలిదిండి 17.2, నూజివీడు 16.8, ముదినేపల్లి 16.4, ద్వారకా తిరుమల 15.4, నిడమర్రు 15.2, మండవల్లి 14.6, గణపవరం 13.4, చింతలపూడి 13.2, పోలవరం 13.2, బుట్టాయగూడెం 12.6, కామవరపుకోట 12.4, పెదపాడు 10.6, ఉంగుటూరు 10.4, జంగారెడ్డిగూడెం 10.2, జీలుగుమిల్లి 7.8, ఆగిరిపల్లి 5.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి. తూర్పుగోదావరిలో సగటు వర్షపాతం 9.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. కాకినాడ జిల్లా తీర మండలాల్లోనూ భారీ వర్షం పడింది. ఏలూరు ముంపు ప్రాంతాల సమస్యకు ప్రభుత్వం చెక్ గతంలో వర్షాకాలం వస్తోందంటే ఏలూరు నగర ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి వారిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం బయటపడేసింది. ఏలూరు నగరాన్ని దాదాపు చుట్టి ఉన్న తమ్మిలేరుకు ఏటా వర్షాకాలంలో వరదలు వచ్చేవి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల సమస్యను నాటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వైఎస్సార్ దృష్టికి తెచ్చారు. దీనిపై వైఎస్సార్ తక్షణమే స్పందించి తమ్మిలేరు ఏటిగట్టును పటిష్టపరచడానికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే నిధులను కూడా విడుదల చేశారు. రూ.78 కోట్ల అంచనా వ్యయంతో తమ్మిలేరు ఏటిగట్టుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. కొంతమేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరిగాయి. అనంతరం వైఎస్సార్ ఆకస్మిక మరణం, అనంతరం వచ్చిన ప్రభుత్వాలతోపాటు గత టీడీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని నిలిపివేశాయి. దీంతో నగర ప్రజల కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆళ్ల నానిని ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమించారు. దీంతో తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వడివడిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏలూరు అశోక్‌నగర్ నుంచి వైఎస్సార్ కాలనీ వరకు 4.3 కిలోమీటర్ల మేర తమ్మిలేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మరో 700 మీటర్ల మేర పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో నగర ప్రజలకు తమ్మిలేరు వరద ప్రమాదం తొలగిపోయింది. అదేవిధంగా కృష్ణా వరదలతో విజయవాడ నగరంలోని కృష్ణలంక, రామలింగేశ్వర నగర ప్రాంతాలకు కూడా గతంలో వరద ముప్పు పొంచి ఉండేది. ఈ సమస్యకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. కృష్ణాలో ఆ ప్రాంతాలకు వరదల నుంచి రక్షణకు గోడ నిర్మించింది. -
AP: వరద గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 13,74,840 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 13,66,040 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. వరదను పోలవరం వద్ద ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు.. 48 గేట్ల ద్వారా 11,62,898 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 33.930 మీటర్లకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 3,51,446 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే పదిగేట్లను పదడుగులు ఎత్తి 2,79,830, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,374.. కలిపి 3,42,204 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,80,397 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం 16 గేట్లను పదడుగులు ఎత్తి 2,36,400, క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,480.. కలిపి 2,68,880 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,181 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 11,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నదుల్లో వరద ఉద్ధృతి.. శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. పెన్నానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3,00,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేలు, హంద్రీ–నీవాకు 1,013, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. 884.7 అడుగుల్లో 213.38 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్ వే తొమ్మిదిగేట్లను 10 అడుగులు ఎత్తి 2,51,433, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,537 కలిపి 3,13,970 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి వదులుతున్నారు. పులిచింతలకు చేరుతున్న వరదను చేరుతున్నట్లుగా స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,99,478 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,728 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 2,96,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం/కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటలకు 11,58,927 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటిమట్టం 13 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 3,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 11,55,027 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు మంగళవారం రాత్రి 7 గంటలకు 13,55,586 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 51.7 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 9,89,625 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండగా దుమ్ముగూడెం సమీపంలోని సీతమ్మసాగర్ వద్దకు 13,11,731 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. సీతమ్మసాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. వాటికి వాగులు, వంకల వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్దకు బుధవారం 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్ద 33.380 మీటర్లకు నీటిమట్టం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 33.380 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రోడ్డుమార్గంలోని కడెమ్మ వంతెనకు ఇరువైపులా వరదనీరు చేరింది. కాగా, గోదావరి ఉద్ధృతికి శబరి నది తోడవడంతో విలీన మండలాలు ముంపునకు గురయ్యాయి. కూనవరంలో ఉదయ్‌భాస్కర్ కాలనీ, గిన్నెలబజారు మంగళవారం ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం సోమవారం అర్ధరాత్రే ఇళ్లను ఖాళీ చేయించి బాధితులను కోతులగుట్ట పునరావాస కాలనీకి తరలించింది. కూనవరం వద్ద గోదావరి మట్టం 48 అడుగులకు చేరింది. చరిత్రలో ఏడో అతి పెద్ద వరద ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,734 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గరిష్టంగా 1990లో 7,092.285 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవగా.. ఆ తర్వాత 1994లో 5,959.228 టీఎంసీలు, 2013లో 5,921.9 టీఎంసీలు, 1984లో 4,879.693 టీఎంసీలు, 2006లో 4,841.84 టీఎంసీలు, 1988లో 4,800.839 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఏడాదిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,213.371 టీఎంసీలే సముద్రంలో కలవడం గమనార్హం. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్ మీదుగా వాయవ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. అదే సమయంలో రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. మంగళవారం తీరం వెంబడి గంటకు 45–55.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. చింతూరులో 4 సెంటీమీటర్లు, వీరఘట్టంలో 3.3, జియ్యమ్మవలసలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య కేంద్రీకృతమైంది. ఇది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది సగం సముద్రం, సగం భూమిపై కొనసాగుతుండటంతో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రంవైపు ఉన్న తేమ అంతా మేఘాల ద్వారా భూమిపైకి విస్తరించి భారీ వర్షాలకు కారణమవుతున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ దిశగా దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన కేంద్రం గుండా వెళుతోంది. అరేబియా సముద్రంలో ఉన్న మరో అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉంది. మరో 2 రెండు రోజులు వర్షాలు అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అది వాయుగుండంగా మారేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 11వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోవిందపురంలో 9 సెంటీమీటర్ల వర్షం శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో 9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దళపతిగుడలో 8.7, శ్రీకాకుళంలో 8.5, పల్నాడు జిల్లా చాగల్లులో 8.3, అల్లూరి జిల్లా శరభన్నపాలెంలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో 6 సెంటీమీటర్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా శివకోడులో 5.6, అనకాపల్లి జిల్లా కోరుప్రోలులో 5.2, పశ్చిమగోదావరి జిల్లా వేగివాడలో 5.1, మొగల్తూరులో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడ, పరిసరాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మహేంద్ర తనయ గెడ్డ పొంగడంతో శనివారం హొన్నాళి గ్రామానికి చెందిన విశ్వనాథ్ లెంకా (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. విశాఖ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తగరపువలస, ఆనందపురం, కొమ్మాది, పద్మనాభం, మధురవాడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అనకాపల్లి జిల్లాలో జోరు వాన కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజుల్లో జిల్లావ్యాప్తంగా 76.28 సెండీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలోకి తగ్గిన వరద
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 1,55,213 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా ద్వారా 527, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. స్పిల్ వే రెండు గేట్లను పదడుగులు ఎత్తి 55,692, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,285.. మొత్తం 1,18,977 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 68,847 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే గేట్లను మూసేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ 33,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 18,674 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.2 అడుగుల్లో 305.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలోకి 12,912 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 29,382 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 170.17 అడుగుల్లో 38.59 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,78,749 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,199 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 2,63,550 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో, కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దాంతో కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,88,090 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 15,833, హంద్రీ–నీవా ద్వారా 914, కల్వకుర్తి ద్వారా 1,167 క్యూసెక్కులు తరలిస్తున్నారు. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులను, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,112 క్యూసెక్కులు.. వెరసి 4,37,792 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.2 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,02,366 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 20,589 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ స్పిల్ వే 26 గేట్లు, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 4,63,888 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.6 అడుగుల్లో 307.87 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,289 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 3,99,834 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.19 అడుగుల్లో 37.23 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,10,692 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,962 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 1,95,090 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికవర్గాలు తెలిపాయి. కృష్ణా బేసిన్లో మంగళవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు కృష్ణాలో వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది.