పిడుగుపాటుకు మృతిచెందిన సత్యాల చిన్నయ్య
నెల్లూరు(పొగతోట): జిల్లాలో శనివారం గంటల వ్యవధిలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఆత్మకూరు, మర్రిపాడు, వింజమూరు, వెంకటగిరి, ఎస్‌ఆర్‌పురం, వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, జలదంకి, కొండాపురం, దుత్తలూరు, వింజమూరు, కలువాయి, ఏఎస్‌పేట, ఆత్మకూరు, పొదలకూరు, రాపూరు, చేజర్ల, ముత్తుకూరు, అల్లూరు, కొడవలూరు, మనుబోలు, సంఘం, కలిగిరి, అనంతసాగం, డక్కిలి, వెంకటగిరి, ఓజిలి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం కురిసింది.
మెట్టప్రాంతంలోని కొన్నిచోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. అకాల వర్షాలతో మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, ఈదురుగాలులుతో వర్షాలు పడడంతో మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు రాలిపోయాయి. ఈ వర్షాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. నెల్లూరు నగరంలో చిరుజల్లులు కురిశాయి. వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలకు ఉపశమనం లభించింది. నాయుడుపేటలో రాత్రి 9 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
మర్రిపాడు: మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగుపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పొంగూరు గ్రామానికి చెందిన సత్యాల చిన్నయ్య(46) పొలానికి వెళ్లి ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పిడుగులు, గాలివాన వచ్చింది. ఈ సమయంలో గ్రామంలోని పొలంలో పిడుగుపడడంతో సమీపంలో ఉన్న చిన్నయ్య షాక్‌కు గురై పడిపోయాడు. స్థానికులు ఆయనను హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో పొంగూరు గ్రామ ఎస్సీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే తిక్కవరం గ్రామానికి చెందిన ఉప్పల మస్తాన్‌కు చెందిన 10 గొర్రెలు పిడుగుపాటుకు మృతిచెందాయి. ఖాదర్‌పూర్ గ్రామంలో చెట్టు కూలి ఒక ట్రాక్టర్ దెబ్బతింది.
దుత్తలూరులో వర్ష బీభత్సం
దుత్తలూరు: దుత్తలూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు బంకులు, ఇళ్లు, రోడ్లపై విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందిపాడులో పొలాల్లో భారీగా వర్షపునీరు చేరింది.
ధాన్యం రైతుల ఆందోళన
ఆత్మకూరు: అకాల వర్షంతో పొలాలు, రోడ్లపై ధాన్యం ఉంచిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓ వైపు గిట్టుబాటు ధర లేక, దళారులకు అమ్ముకోలేక ఎప్పటికైనా ధర పెరగకపోతుందా అన్న ఆశతో అందుబాటులో ఉన్న స్థలాల్లో, రోడ్లపైన రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. అకాల వర్షంతో రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం ఎక్కడ దెబ్బతింటుందోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ఓ చోట రాసులుగా పోసుకుని తడవకుండా పట్టలు కప్పుకోవడంలో తలమునకలవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసి మొలకలు ఎత్తితే తమ కష్టం వర్షార్పణం అవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment