నెల్లూరు జిల్లా కప్పగుంట చెక్‌డ్యామ్ వద్ద స్వర్ణముఖి నది వరద ఉధృతి
సాక్షి, తిరుపతి/కడప/నెల్లూరు, సాక్షి నెట్‌వర్క్: చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు మొదలవ్వడం ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా తొణికిసలాడుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తాజాగా తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ ప్రకటించింది. వర్షం ఆగిన సమయంలో నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసి వేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కూలిన వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.
తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యాంల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఆ నీరు తిరుపతిలోని కపిలతీర్థం నుంచి తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది. శేషాచలం కొండల్లో నుంచి వచ్చే వరద నీరు కళ్యాణీ డ్యాంకు చేరుతుండడంతో నీటి విడుదల యథాతదంగా కొనసాగుతోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న అరణియార్, కాళంగి రిజర్వాయర్, కల్యాణి డ్యాం, రాయలచెరువును పరిశీలించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. అవసరమైతే దిగువ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి.. ప్రజలకు, పంటలకు ఇబ్బంది లేకుండా దిగువకు వదలాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సమయంలో నెల్లూరు జిల్లా వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కొంత మంది భయంతో ముందస్తుగా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు తరలిపోతున్నారు. చిత్తూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నవంబర్‌లో 142.6 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా, రెండు పర్యాయాలు వచ్చిన తుపాను కారణంగా 438.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
చిట్వేలి–రాపూరు మధ్య రాకపోకలు నిలిపివేత
- తుపాను ప్రభావంతో వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీటితో నిండి ఉండగా, మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టులు, చెరువులు, రహదారుల్లో బ్రిడ్జిల వద్ద, నీటి ప్రవాహం ఉన్న చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- వైఎస్సార్ జిల్లా–నెల్లూరు జిల్లాల మధ్య రాకపోకలు ఆదివారం నిలిచిపోయాయి.
- రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి–రాపూరు మధ్య ఘాట్ రోడ్డులో రాళ్లు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహనాలను నిలిపివేశారు.
- కడప–తిరుపతి మధ్య చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. బాలుపల్లె వద్ద శేషాచలం అడవుల నుంచి వర్షపు నీరు రోడ్డుపై పారుతోంది.
- గండికోట ప్రాజెక్టు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు మైలవరం ప్రాజెక్టుకు వస్తోంది. ఇక్కడి నుంచి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. పార్నపల్లె వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రాయచోటి పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
- కడప నగర సమీపంలోని ఊటుకూరు చెరువును డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష, నగర మేయర్ సురేష్‌బాబులు వర్షంలోనే పరిశీలించారు.
- యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. సోమవారం పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
- రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్టున ఉన్న నరశరాంపేట వద్ద భూమి కోతకు గురై రెండు భవనాలు ఆదివారం ఉదయం కూలిపోయాయి. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాలతో వంద మందిని పునరావాస కేంద్రానికి తరలించారు.
- ప్రకాశం జిల్లా గుడ్లూరు, ఉలవపాడు, చీరాల మండలాల్లో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి మండలాల్లో ఒక మోస్తరు వాన పడింది. గుడ్లూరు మండలంలో ఉప్పుటేరు ఉధృతంగా పారుతోంది. రాళ్లపాడు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 7,700 క్యూసెక్కుల వరద నీటిని మన్నేటికి విడుదల చేశారు. చీరాలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
సోమశిలకు గంట గంటకూ పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- సోమశిలకు ఆదివారం ఉదయం 48 వేల క్యూసెక్కులు ఉన్న వరద రాత్రి 8 గంటలకు 96,107 క్యూసెక్కులకు చేరింది. జలాశయం నుంచి 88 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
- నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదితో పాటు మామిడి కాలువలకు నీటి ప్రవాహం పెరుగుతోంది. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల మధ్య వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలను నిలిపివేశారు. పెళ్లకూరు మండలంలో 9 గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. అనంతసాగరం మండలం పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
- కలువాయి ముస్లింపేటలో రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతసాగరం మండలం బీవడ్డిపాళెంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది.
- ఆదివారం గుంటూరు నగరంలో 7.6 సెంటీ మీటరు, నెల్లూరు జిల్లా చిల్లకూరులో 12.18 సెంటీమీటర్ల వర్షం పడింది. కృష్ణా, అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో వర్షం కురిసింది.
పెన్నాపై అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
అనంతపురం జిల్లాలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యామ్ నుంచి నెల్లూరు బ్యారేజీ వరకు పెన్నా నది ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో జల వనరుల శాఖ అధికారులు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. పెన్నా నది చరిత్రలో ఇలా ఇదే తొలిసారి. రెండు దశాబ్దాల తర్వాత అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు నిండటం గమనార్హం. రానున్న రెండు రోజుల్లో వర్షాల కారణంగా పెన్నా నది ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పును తప్పించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టుల్లో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచడానికి గేట్లు ఎత్తేశారు.
పెన్నా నదిపై ప్రాజెక్టుల్లో నీటి నిల్వ వివరాలు
ప్రాజెక్టు పేరు నీటి నిల్వ సామర్థ్యం (టీఎంసీలు) ప్రస్తుత నిల్వ (టీఎంసీలు) ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) అవుట్‌ఫ్లో (క్యూసెక్కులు)
అప్పర్ పెన్నార్ 1.81 1.68 1,388 1,000
పెన్న అహోబిలం 11.1 5.94 880 600
మిడ్ పెన్నార్ 5.17 4.73 1,995 3,963
చాగల్లు 1.8 0.87 1,500 4,500
గండికోట 26.85 23.77 15,500 20,000
మైలవరం 6.65 0.74 20,000 20,000
సోమశిల 78.0 68.67 70,552 88,052
సంగం బ్యారేజ 0.45 0.26 64,825 64,825
నెల్లూరు బ్యారేజీ 0.26 0.18 65,000 65,000
నేడు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం
కోమరిన్ ప్రాంతం, శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మన రాష్ట్రంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment