సాక్షి, నెల్లూరు : వ్యసనాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన అతను చిన్నతనంలోనే దొంగగా మారాడు. గడియారంతో మొదలు పెట్టి ఆటోలను చోరీ చేసే స్థాయికి ఎదిగాడు. గత కొంతకాలంగా ఆటోల దొంగతనానికి పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ ఘరానా దొంగను సీసీఎస్, నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి నిందితుడి వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని జీవకోన అరుణోదయకాలనీకి చెందిన కొండల ఆదినారాయణ అలియాస్ ఆది చిన్నతనం నుంచే వ్యవసనాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో దొంగగా మారాడు. గడియారం చోరీతో నేరప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆటో టైర్లు, బ్యాటరీలు దొంగలించి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. అక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ఘరానా దొంగతో పరిచయమైంది. అతనితో కలిసి కావలిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం ఆటో దొంగగా అవతారమెత్తాడు.
ఆటో నంబర్లను టాంపరింగ్ చేసి..
నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన ఆటోలను ఆది దొంగలించి తిరుపతికి తరలించేవాడు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఆటోల సీబుక్‌ల జెరాక్స్‌లను దొంగలించి అందులోని నంబర్ల ఆధారంగా అపహరించిన ఆటోనంబర్లను టాంపరింగ్ చేసేవాడు. ఆటో రూపురేఖలను మార్చివేసేవాడు. అనంతరం వాటిని రోజువారీ అద్దె ప్రాతిపదికన తిరుపతికి చెందిన ఆటోడ్రైవర్లకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో జల్సాగా జీవించసాగాడు. ఆటోలను జీవకోన, లీలామహాల్‌సెంటర్, కరకంబాడి, ఆర్టీసీ బస్టాండు వద్దనే తిప్పేలా జాగ్రత్తపడేవాడు. ఈ ప్రాంతాల్లో ఆటోలు అధికసంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో వీటి గురించి పెద్దగా పోలీసులు పట్టించుకోరని ఆది అభిప్రాయం. ఒక వేళ పోలీసులు రికార్డులను తనిఖీ చేసినా నంబరుప్లేట్లు సరిగా ఉండటంతో పోలీసులు వాటిని వదిలివేసేవారు.
జిల్లాలో 15 ఆటోలు అపహరణ
గత కొంతకాలంగా ఆది జిల్లాలోని డక్కిలి, కోవూరు, నెల్లూరులోని చిన్నబజారు, నవాబుపేట, సంతపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ ప్రాంతాల్లో ఆటోలను అపహరించి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. వరుస చోరీలతో నెల్లూరు సీసీఎస్, నవాబుపేట పోలీసులు సంయుక్తంగా ఆటో దొంగలపై నిఘా ఉంచారు. శనివారం నెల్లూరు సీసీఎస్, నవాబుపేట ఇన్‌స్పెక్టర్లు ఎస్‌కే బాజీజాన్‌సైదా, కే వేమారెడ్డి తమ సిబ్బందితో కలిసి నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ఆటోలో అనుమానాస్పదంగా ఉన్న ఆదినారాయణను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నెల్లూరు నవాబుపేట పోలీసుస్టేషన్ పరిధిలో 4, చిన్నబజారు పోలీసుస్టేషన్ పరిధిలో 3, సంతపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌ల పరిధిలో మూడు, నెల్లూరు రూరల్‌లో 2, కోవూరులో 2, డక్కిలిలో ఒక ఆటోను దొంగలించినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.25లక్షల విలువ చేసే 15ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment