thief arrested
-
‘రాయల్’ దొంగ అరెస్టు
మోతీనగర్: జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్‌లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ ఎన్ఫీల్డ్ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్చెరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు రాయల్æఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్ సాహిల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
Peddapalli: శ్మశానంలో ఎముకల దొంగలు!
సుల్తానాబాద్(పెద్దపల్లి): శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ.. కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల్లో నలుగురి పట్టివేత.. సుల్తానాబాద్‌లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా.. కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది రాజకుమార్, వినోద్ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించారు. విచారణ జరుపుతున్న పోలీసులు.. రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు. -
చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు
యశవంతపుర: బెంగళూరు నగరంలోని 51 పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు సంవత్సరాలుగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన సంతోష్ అనే చైన్స్నాచర్ను, అతనికి సహకరించిన రవి అనే నిందితుడిని పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సంతోష్ చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. సూర్యోదయం కాకముందే ఇంటినుంచి పల్స్ర్పై రోడ్డెక్కే సంతోష్ ఒక చైన్స్నాచింగ్నైనా చేయకుంటే రాత్రికి నిద్ర పట్టేదికాదు. బైక్‌కు రోజుకొక నంబర్ ప్లేట్ మార్చేవాడు.ఆర్టీఓ అఫీసుకెళ్లి బైకు నంబర్లను సెర్చ్ చేసేవాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్ తీసేవాడు కాదు. పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు జేపీనగర, పుట్టేనహళ్లి, హొసకోట, జయనగర, బన్నేరఘట్ట, యలహంక, కొడిగేహళ్లి, అమృతహళ్లి ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల మేర అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. చోరీ సొత్తును సిటీ పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. (చదవండి: అవమాన భారంతో ఉపాధ్యాయుని ఆత్మహత్య) -
లగ్జరీ కార్లు అతని టార్గెట్! ఎవరీ ‘కారు కింగ్’
లగ్జరీ కార్లను చోరీ చేయడామే వృత్తిగా ఎంచుకున్న ఓ దొంగను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద మూడు కార్లు, కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నంబర్ ప్లేట్లు, కార్ల తాళాలు, విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కునాల్ అనే 42 ఏళ్ల వ్యక్తికి 2003 నుంచి లగ్జరీ కార్లను దొంగిలించడం ఓ అలవాటుగా మారింది. డబ్బు కోసం చోరీ చేసిన కార్లను ఉత్తప్రదేశ్, కశ్మీర్లో అమ్మకం పెట్టేవాడు. అయితే ఇటీవల సివిల్ లైన్స్‌కు చెందిన శ్రేతాంక్ అగర్వాల్.. తన ఇంటి వద్ద పార్క్ చేసిన టయోటా ఫార్చ్యూనర్ కారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కశ్మీరీ గేట్ వద్ద ఫార్చ్యూనర్ కారుతో కునాల్‌ను పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన విచారణలో అతని వద్ద పట్టుకున్న కారు రిజిస్ట్రేషన్, నంబర్ సంబంధం లేకపోవడంతో అరెస్ట్ చేశారు. అయితే కునాల్‌కు 100 కార్లు దొంగతనం చేసి ‘కారు కింగ్’ అని పిలిపించుకోవాలని ఉందని పోలీసు విచారణలో పేర్కొన్నాడు. నిందితుడిపై ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కునాల్ విలాసవంతమైన జీవితం గడపడం కోసం తరచు లగ్జరీ కార్ల చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
Hyderabad: బిర్యానీ పాషా అరెస్టు
చందానగర్: ఏ దొంగతనానికి వెళ్లినా సెంటిమెంట్‌గా ఒకే కారు వాడడం ఆ దొంగ ప్రత్యేకత. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. బంగారు దుకాణాలు, ఫర్టిలైజర్ దుకాణాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ వేంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా రాంనగర్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషా (39) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అదే జిల్లాలోని సత్తాపూర్ గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. చోరీ చేయాలనుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఓయో రూమ్ బుక్ చేసుకొని చోరీ చేసేవాడు. గడ్డపారలతో తాళం బద్దలు కొట్టి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసేవాడు. వచ్చిన డబ్బులతో కార్లు కొనుగోలు చేసి జల్సాగా తిరుగుతుండేవారు. ఈ క్రమంలో పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా.. పీడీ యాక్ట్ నమోదైనా మారలేదు. ఈనెల 9న ఉదయం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్ తుల్జా భవానీ మందిర్ వద్ద ఉన్న తన జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగినట్లు సయ్యద్ పర్వీనా రెహన్ గుర్తించారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుకాణంలో రూ.3.50 లక్షల నగదు, 15 తులాల బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు పోయాయని ఫిర్యాదు చేసింది. మంగళవారం లింగంపల్లి గుల్ మొహర్ పార్కు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా సయ్యద్ మహబూబ్ పాషా కారులో వస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతనిని రిమాండ్‌కు తరలించి అతనివద్ద 3.5 తులాల బంగారం, 10 కిలోల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు, నాలుగు కార్లు, సిగరెట్ ప్యాకెట్లుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 2007లో కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావు -
ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే..
పలమనేరు(చిత్తూరు జిల్లా): రాత్రిపూట దొంగతనాలు చేసే దొంగల గురించి విని ఉంటాం. కానీ ఈ దొంగ మాత్రం కేవలం ఉదయం మాత్రమే అది కూడా గ్రామాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. గత ఏడేళ్లుగా ఆంధ్రా, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ ఉదయపు దొంగను గంగవరం ఐడీ పార్టీ బుధవారం అరెస్టు చేసింది. తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్ కుమారుడు శక్తివేల్(33) అక్కడ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చోరీలు చేయడం ఇతని ప్రవృత్తి. జనసంచారం తక్కువగా ఉండే గ్రామాలను ఎంచుకుంటాడు. ఉదయం పూట ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లే వారి ఇళ్లను గుర్తిస్తాడు. తరువాత బైక్ లేదా కారుపై వచ్చి ఆ ఇంటి తలుపుపై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి వెళ్లి బంగారు నగలను చోరీ చేయడం ఇతని ప్రత్యేకత. ఇలా ఇప్పటిదాకా గత ఏడేళ్లలో పలు చోరీలకు పాల్పడ్డాడు. కానీ ఇరు రాష్ట్రాల్లో పోలీసు స్టేషన్‌కు చేరిన కేసులు మాత్రం 15 వరకు ఉంటాయి. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దొంగ 250 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ప్రాంతంలో ఉదయం పూట మాత్రమే జరుగుతున్న చోరీలపై స్థానిక ఐడీ పార్టీ ఆరునెలలుగా నిఘా పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోనూ ఇలాగే చోరీలు సాగుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లోతైన విచారణ ద్వారా ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్‌గా గుర్తించారు. ఎట్టకేలకు బైరెడ్డిపల్లి వద్ద నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు. చదవండి: ఏపీకి కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్! నాడు అవమానం.. నేడు అందలం -
ఒక్క మెసేజ్‌తో రూ. 41.98 లక్షలు కొట్టేశాడు
సాక్షి, నాగోలు: ఆన్లైన్లో నకిలీ యాప్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కి చెందిన ఆదిత్య నారాయణ్ గాడ్బోలే (37)ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేశాడు. పెట్టుబడులు పెడితే అంతకు మించి ఆదాయం చూపిస్తామని ఓ యువతి ఫోన్లో చెప్పడంతో గత డిసెంబర్ 1వ తేదీ నుంచి 17వరకు 17 రోజుల్లోనే రూ. 41.98 లక్షల నగదును అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్ గోడ్బోలేగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఆన్లైన్లో ఫారెక్స్ ట్రేడింగ్ యాప్‌ను చైనాకు చెందిన మౌజిబిన్ అనే వ్యక్తి తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆదిత్య నారాయణ్ గతంలో చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. -
ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఓడే గ్రామం అది... ఆ ఊరి చివర సువిశాలమైన బంగ్లా... దాని పోర్టుకోలో నాలుగు హైఎండ్ కార్లు... ఇంటి లోపల 30 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు... విల్లా చుట్టూ నైట్ విజన్, మోషన్ సెన్సర్, 360 డిగ్రీస్ రివాల్వేటింగ్ పరిజ్ఞానాలతో కూడిన నిఘా కెమెరాలు... ఈ సెటప్ మొత్తం చూస్తే ఆ ఇల్లు ఏ పారిశ్రామిక వేత్తదో, బడా వ్యాపారితో, పెద్ద రాజవంశీయుడిదో అనుకుంటారు. అయితే అది దేశ వ్యాప్తంగా 100కు పైగా భారీ నేరాలు చేసిన ఘరానా దొంగ నవ్‌ఘన్ తల్పడకు చెందినది. ఇతగాడిని రెండు రోజుల క్రితం ఆనంద్ జిల్లాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పట్టుకుంది. ప్రాథమిక విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. ⇔ తొమ్మిదో తరగతి వరకే చదివిన నవ్‌ఘన్ తల్పడకు తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు ఓడే గ్రామంలో ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అవసరమైన డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. ⇔ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఇప్పటి వరకు 100కు పైగా నేరాలు చేసిన నవ్‌ఘన్‌ను అతడి భార్య శోభ సైతం సహకరిస్తుంటుంది. ఆమె తమ విలాసవంతమైన బంగ్లాకు మామగారి పేరే పెట్టుకుంది. నవ్‌ఘన్ తన భార్యతో పాటు కొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకునీ నేరాలు చేస్తుంటాడు. ప్రధానంగా విల్లాలు, బంగ్లాలనే ఎంచుకుని చోరీ చేస్తాడు. ⇔ ఒకప్పుడు భార్యతో కలిసి రంగంలోకి దిగి ఇతడు తొలుత ఆయా విల్లాల్లోని మహిళల్ని ఆకట్టుకునేవాడు. వారి ద్వారా పని వాళ్ళుగా, సహాయకులుగా చేరి... అదును చూసుకుని ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బు తీసుకుని ఉడాయించేవారు. ఆపై తాళం వేసున్న విల్లాలు, బంగ్లాలను ఎంపిక చేసుకుని అనుచరులతో కలిసి దోచేయడం మొదలెట్టాడు. ⇔ చోరీ సొత్తును తమ గ్రామంలో ఉన్న బంగారం వ్యాపారి మహేష్‌కు మాత్రమే విక్రయిస్తుంటాడు. అయితే మహేష్ ప్రతి సందర్భంలోనూ నగల నాణ్యత బాగోలేదనో, తరుగు పేరుతోనే చౌకగా వాటిని కొనేవాడు. ⇔ దీంతో నవ్‌ఘన్ తన విల్లాలోనే బంగారం కరిగించడానికి కార్ఖానా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే నగల్ని బిస్కెట్లుగా మార్చి విక్రయించడం మొదలెట్టాడు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన నవ్‌ఘన్ ఇప్పటి వరకు అక్కడ ఒక్క నేరం కూడా చేయలేదు. ఆ చుట్టుపక్కల జిల్లాలతో పాటు జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, బరోడా నేరాలు చేశాడు. ⇔ ఓ నగరాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అనుచరులతో కలిసి విమానంలో అక్కడకు చేరుకుంటాడు. ఖరీదైన హోటల్లో బస చేసి ఖరీదైన ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇంటిని గుర్తించిన పట్టపగలే చోరీ చేస్తాడు. ఈ సొత్తుతో ఒకటి రెండు రోజులు అదే హోటల్లో ఉండి... ఆపై రోడ్డు మార్గంలో స్వస్థలానికి వెళ్ళిపోతాడు. ⇔ నవ్‌ఘన్ ఇటీవల గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న సీఎం స్మిత్ అండ్ సన్స్ సంస్థకు చెందిన యజమాని ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అందులోకి ప్రవేశించి రూ.45.95 లక్షలు సొత్తు చోరీ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆనంద్ ఎస్ఓజీ పోలీసులు రెండు రోజుల క్రితం నవ్‌ఘన్ సహా ముగ్గురిని పట్టుకున్నారు. హైదరాబాద్‌లో నేరాలు అంగీకరించాడు తాజా కేసు ఖేడా జిల్లాలో జరిగింది. అయితే నవ్‌ఘన్ వ్యవహారంపై సమాచారం అందడంతో మేము పట్టుకున్నాం. తండ్రికి గుడి కట్టిన ఇతడిని ఓడే గ్రామస్తులు చాలా గౌరవంగా చూస్తారు. గతంలోనూ వివిధ నగరాల పోలీసులు నవ్‌ఘన్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను ఖేడా పోలీసులకు అప్పగించాం. వాళ్ళు వీళ్ళని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాతే హైదరాబాద్‌లో ఏ పోలీసుస్టేషన్ పరిధిలో? ఎప్పుడు? ఆ నేరాలు చేశాడు అనేది తెలుస్తుంది. దీనిపై అక్కడి పోలీసులకు అధికారిక సమాచారం అందిస్తాం. -ఆనంది జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ -
చోరీలు చేసి.. జల్సాగా జీవిస్తూ..
కోవూరు: వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న కట్టా రాము అనే వ్యక్తిని కోవూరు ఎస్సై చింతం కృష్ణారెడ్డి శుక్రవారం అరెస్ట్ చేశారని సీఐ జీఎల్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 సంవత్సరం జూలై 23వ తేదీన కోవూరు పట్టణంలో నాలుగు గృహాల్లోకి చొరబడి బంగారు వస్తువులు, నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నిందితుడు మండలంలోని స్టౌ బీడీ కాలనీచెందిన కట్టా రాము అని నిర్ధారించారు. అతనిపై నిఘా ఉంచారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రాము తెలంగాణలోని కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఫినాయిల్ విక్రయిస్తూ చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. ఈ నేపథ్యంలో అతను చోరీలకు పాల్పడుతూ జల్సాగా జీవించసాగాడు. ఓ కేసులో జగిత్యాలలోని కోరట్ల పోలీసులు రామును అరెస్ట్ చేశారు. అక్కడినుంచి విడుదలై కోవూరు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి రూ.2.70 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. రామును పట్టుకునేందుకు కృషిచేసిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, జబీవుల్లా, వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్కే అయాజ్‌లను సీఐ అభినందించారు. వారికి ఎస్పీ ద్వారా రివార్డులు అందజేయనున్నట్లుగా వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేశామని సీఐ తెలిపారు. -
దొంగను పట్టించిన 'చెప్పు'
కోల్‌కతా : సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో చొరబడి విలువైన రెండు సెల్ఫోన్లు, నగదును తస్కరించి పారిపోయిన దొంగను కేవలం 40 నిమిషాల వ్యవధిలో పట్టుకున్న ఘటన బుధవారం కోల్‌కతాలోని న్యూ ఎలిపోర్‌లో చోటుచేసుకుంది. కాగా, అతను వేసుకునే 'చెప్పే' అతన్ని పట్టించడం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..19 ఏళ్ల షేక్ రాజేష్ అలియాస్ రాజు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అరిందామ్ చటర్జీ ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో మెలుకువగా ఉన్న చటర్జీ పారిపోతున్న దొంగను చూసి మాకు సమాచారమందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైనేజ్ పైప్ ద్వారా మొదటి అంతస్తుకు చేరుకున్న రాజేష్ , కిటికి గ్రిల్‌ను ఊడదీసి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. అయితే గోడ దూకి పారిపోతున్న సమయంలో అతని కాలికున్న చెప్పు అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులకు, అటుగా వెళుతున్న యువకుడు ఒకే చెప్పుతో నడవడం అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులు అతను వేసుకున్న చెప్పును పరిశీలించగా, చటర్జీ ఇంట్లో వదిలేసిన చెప్పు, ఇది ఒకటిగా తేలినట్లు స్పష్టం చేశారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దొంగ దొరికాడు..
సాక్షి, పశ్చిమ గోదావరి(ఉండ్రాజవరం): దొంగతనాల్లో ఆరితేరిన పాత నేరస్తుడిని తణుకు, ఉండ్రాజవరం ఎస్సైలు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఉండ్రాజవరం ఎస్సై అవినాష్, తణుకు రూరల్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన పులవర్తి లీలాసాయి గుప్త ఇటీవల తణుకు మండలం వెంకట్రాయపురంలో రామేశ్వరపు సురేష్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీనిపై తణుకు సీఐ చైతన్యకృష్ణ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్సైలు కలిసి కేసు విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాలంగిలో ఉన్నాడని సమాచారం తెలియటంతో వీరిద్దరూ కలిసి దాడిచేసి ముద్దాయిని గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు. దీంతో అదుపులోకి తీసుకున్న లీలాగుప్తాని విచారించగా ఇటీవల ఉండ్రాజవరం మండలం సావరం, పాలంగి గ్రామాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని చెప్పారు. ఆ దొంగతనాల్లో 10 కాసులతో పాటు రెండు కాసుల బంగారం, రెండు వెండిగిన్నెలు, వెండి పట్టీలు, ఒక ఫొన్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముద్దాయి గతంలో పలు నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదని అందుకే తరచూ దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉండ్రాజవరం, తణుక రూరల్ ఎస్సైలను, కేసులో సహకరించిన క్రైమ్ పార్టీ శ్రీధర్, పోలయ్యకాపు, సత్యనారాయణ, అక్బర్, మహేష్, వెలగేష్లను తణుకు సీఐ చైతన్య కృష్ణ అభినందించారు. -
గడియారంతో మొదలు పెట్టిన ప్రస్థానం..
సాక్షి, నెల్లూరు : వ్యసనాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన అతను చిన్నతనంలోనే దొంగగా మారాడు. గడియారంతో మొదలు పెట్టి ఆటోలను చోరీ చేసే స్థాయికి ఎదిగాడు. గత కొంతకాలంగా ఆటోల దొంగతనానికి పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ ఘరానా దొంగను సీసీఎస్, నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి నిందితుడి వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని జీవకోన అరుణోదయకాలనీకి చెందిన కొండల ఆదినారాయణ అలియాస్ ఆది చిన్నతనం నుంచే వ్యవసనాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో దొంగగా మారాడు. గడియారం చోరీతో నేరప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆటో టైర్లు, బ్యాటరీలు దొంగలించి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. అక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ఘరానా దొంగతో పరిచయమైంది. అతనితో కలిసి కావలిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం ఆటో దొంగగా అవతారమెత్తాడు. ఆటో నంబర్లను టాంపరింగ్ చేసి.. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన ఆటోలను ఆది దొంగలించి తిరుపతికి తరలించేవాడు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఆటోల సీబుక్‌ల జెరాక్స్‌లను దొంగలించి అందులోని నంబర్ల ఆధారంగా అపహరించిన ఆటోనంబర్లను టాంపరింగ్ చేసేవాడు. ఆటో రూపురేఖలను మార్చివేసేవాడు. అనంతరం వాటిని రోజువారీ అద్దె ప్రాతిపదికన తిరుపతికి చెందిన ఆటోడ్రైవర్లకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో జల్సాగా జీవించసాగాడు. ఆటోలను జీవకోన, లీలామహాల్సెంటర్, కరకంబాడి, ఆర్టీసీ బస్టాండు వద్దనే తిప్పేలా జాగ్రత్తపడేవాడు. ఈ ప్రాంతాల్లో ఆటోలు అధికసంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో వీటి గురించి పెద్దగా పోలీసులు పట్టించుకోరని ఆది అభిప్రాయం. ఒక వేళ పోలీసులు రికార్డులను తనిఖీ చేసినా నంబరుప్లేట్లు సరిగా ఉండటంతో పోలీసులు వాటిని వదిలివేసేవారు. జిల్లాలో 15 ఆటోలు అపహరణ గత కొంతకాలంగా ఆది జిల్లాలోని డక్కిలి, కోవూరు, నెల్లూరులోని చిన్నబజారు, నవాబుపేట, సంతపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ ప్రాంతాల్లో ఆటోలను అపహరించి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. వరుస చోరీలతో నెల్లూరు సీసీఎస్, నవాబుపేట పోలీసులు సంయుక్తంగా ఆటో దొంగలపై నిఘా ఉంచారు. శనివారం నెల్లూరు సీసీఎస్, నవాబుపేట ఇన్స్పెక్టర్లు ఎస్కే బాజీజాన్‌సైదా, కే వేమారెడ్డి తమ సిబ్బందితో కలిసి నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ఆటోలో అనుమానాస్పదంగా ఉన్న ఆదినారాయణను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నెల్లూరు నవాబుపేట పోలీసుస్టేషన్ పరిధిలో 4, చిన్నబజారు పోలీసుస్టేషన్ పరిధిలో 3, సంతపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో మూడు, నెల్లూరు రూరల్‌లో 2, కోవూరులో 2, డక్కిలిలో ఒక ఆటోను దొంగలించినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.25లక్షల విలువ చేసే 15ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. -
దొంగలు.. బాబోయ్ దొంగలు...
దొంగలు.. బాబోయ్ దొంగలు...ఖమ్మంఅర్బన్: నగరంలోని ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్ కూత వేటు దూరంలో శనివారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. 10వ డివిజన్లోని 5 నంబర్ వీధిలో మిర్యాలగూడెం కోర్టులో విధులు నిర్వహించే జ్యోతి ఇంటి వెనుక తలుపులు తొలగించి ఇంట్లోకి జొరబడి బీరువాలోని బంగారపు ఆభరణాలు, ఒక టీవీని చోరీ చేశారు. జ్యోతి శనివారం ఉదయం తాళం వేసి ఊరికి వెళ్లి రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చేసరికి చోరీ జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 20 తులాలకు పైగానే బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు బాధితులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు ఇంట్లో కూడా తాళం పగలు గొట్టి చోరీకి ప్రయత్నించారు. విలువైన వస్తువులు ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు తమవెంట తీసుకెళ్లడంతో దొంగలకు ఏమీ దొరకలేదు. అదే కాలనీలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి బావమర్ది బాపిరెడ్డి ఇంట్లో కూడా చోరీ జరిగింది. బాపిరెడ్డి ఇంటికి తాళం వేసి శనివారం హైదరాబాద్ వెళ్లారు. ఇంటి ఎదుట తలుపును తెరిచి ఇంట్లో ఉన్న టీవీ, వరండాలో ఉన్న కొత్త స్కూటీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంట్లో సెల్ప్లోని బట్టలన్నీ చిందరవందరంగా పడేశారు. వాటిలో ఏమైనా విలువైన బంగారం, నగదు చోరీ అయిందా అనేది బాపిరెడ్డి వస్తే గాని తెలియదు. ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ సందర్శించి విచారణ చేశారు. ఆయన వెంట అర్బన్ సీఐ సాయిరమణ, సిబ్బంది ఉన్నారు. ఒకే తరహాలో చోరీలు జరగడం, దాంతో టీవీలను చోరీ చేయడం, కొన్ని రోజులు క్రితం ఇదే స్టేషన్ పరిధిలో కూడా టీవీ చోరీ కావడంతో ఇవన్నీ ఒకే బ్యాచ్ పని అయి ఉంటుందని భావిస్తున్నారు. చోరీల ఘటనపై అర్బన్ పోలీసులతో పాటు, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆరా తీస్తున్నారు. పాత నేరస్తుల జాబితాలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మూడు ఇళ్లలో చోరీలపై వేలి ముద్రల సేకరణకు క్లూస్ టీం బృందం ఆధారాలను సేకరించింది. అదే ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్లకు అమర్చిన సీసీ కెమెరాల్లో ఏమైనా సమాచారం లభిస్తుందా అని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలో ఒకే రోజు రాత్రి మూడు గృహాల్లో చోరీలు జరగడంతో పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. శనివారం రోజే సీపీ తఫ్సీల్ ఇక్బాల్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసి చోరీలపై సమీక్షించి పాత కేసులన్నీ పరిష్కరించాలని, చోరీల నియంత్రణలో గస్తీ పెంచాలని చెప్పిన రాత్రే చోరీలు జరగడం విశేషం. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. తాళం వేసిన ఇళ్లను కొన్ని మాసాలుగా దొంగల ముటా టార్గెట్ చేసింది. తాళం వేసినట్లు గుర్తించి ఇంటి ముందు, ఇంటి వెనుక నుంచి తలుపులు తొలగించి చోరీలకు పాల్పడుతున్నారు. పట్టపగలు కూడా చోరీలు జరుగుతుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. -
ఘరానా దొంగ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో టూవీలర్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాలు.. నేనావత్ చందర్ నాయక్ అనే వ్యక్తి బీఈడీ చదివాడు. ప్రస్తుతం అతడు స్విగ్గీలో ఫుడ్ డెలివరీబాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ చందర్‌కు చాలినంత జీతం రాకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ముగ్గురు దొంగల అరెస్ట్
సత్తుపల్లిటౌన్: ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం’ అనేది, ఓ సామెత. ఇక్కడ సరిగ్గా ఇదే జరిగింది. ముగ్గురు దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరు ఏం చేశారంటే... అతడి పేరు బోనగిరి రాములు. సత్తుపల్లి పట్టణంలోని మసీద్ రోడ్డులో ఉంటున్నాడు. రాష్ట్రీయ రహదారి పక్కనున్న శ్రీ మహారాజ ఫ్యాన్సీ షాపులో తొమ్మిదేళ్లపాటు గుమస్తాగా పనిచేశాడు. ఏడు నెలల క్రితమే అక్కడ పని మానేశాడు. అతడికి దుర్బుద్ధి పుట్టింది. స్థానిక ద్వారకాపురి కాలనీకి చెందిన పెయింటర్ కొలికపోగు కృష్ణ, జొన్నలగడ్డ శివతో కలిసి ఆ షాపులో దొంగతనం చేయాలనుకున్నాడు. జనవరి 23వ తేదీ అర్ధరాత్రి వేళ ఈ ముగ్గురూ కలిసి ఆటో(ఏపీ 07 టీఈ 5309)ను కిరాయికి తీసుకొచ్చి షాపు ముందు పెట్టారు. ఫ్యాన్సీ షాప్ వెంటిలేటర్‌ను పగులగొట్టారు. బక్కగా ఉన్న జొన్నలగడ్డ శివ, ఆ వెంటిలేటర్ నుంచి లోపలికి వెళ్లాడు. షాపు వెనుక తలుపులను తీశాడు. మిగతా ఇద్దరు కూడా ఇద్దరూ లోనికి వెళ్లారు. షాపులోగల మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు, రాగి, స్టీల్ సామాన్లను ఆటోలో వేసుకుని రెండు ట్రిప్పుల్లో స్థానిక వెంగళరావునగర్‌లోని అద్దె గదిలో దాచారు. పని పూర్తయిన తరువాత, ఆ ఇద్ద్దరూ బయటికొచ్చారు. జొన్నలగడ్డ శివ, లోపలే ఉన్నాడు. వెనుక తలుపులను లోపలి నుంచి వేశాడు. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు. మరుసటి రోజున షాపునకు వచ్చిన యజమాని, దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా దొరికారు... పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. వారు బుధవారం వెంగళరావునగర్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఒక ప్లాస్టిక్ మూటతో ఆటోలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. జనవరి 23వ తేదీన శ్రీ మహారాజ ఫ్యాన్సీ షాపులో తాము దొంగతనం చేసినట్టు చెప్పారు. అక్కడ దొంగిలించిన లక్ష రూపాయల విలువైన వస్తువుల్లో కొన్నింటిని అశ్వారావుపేట సంతలో విక్రయించేందుకు తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనపర్చుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, టౌన్ సీఐ టి.సురేష్ వెల్లడించారు. ఈ కేసును చేధించటంలో కృషి చేసిన సీఐ టి.సురేష్‌ను ఏసీపీ బి.ఆంజనేయులు అభినందించారు. సీఐకి సహకరించిన హెడ్ కానిస్టబుల్ ఐ.చెన్నారావు, కానిస్టేబుళ్లు బి.భరత్, ఎన్.లక్ష్మయ్యకు రివార్డును ఏసీపీ ప్రకటించారు. చోరీ నిందితులను కోర్టుకు అప్పగించారు. -
యువ దొంగల ముఠా అరెస్టు
సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సా చేయడమే వారి ధ్యేయం. దానికోసం అధిక మొత్తంలో సొమ్ము ఉన్న వారిపై రెక్కి నిర్వహించి చోరీలకు స్కెచ్ వేస్తుంటారు. ఒక చోరీ యత్నం విఫలం కాగా మరొకటి అమలులో భగ్నమైంది. ఆ నేపథ్యంలో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం టౌన్: ఆ ఆరుగురూ 25 ఏళ్ల లోపువారే. సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటు పడ్డ ఆ ఆరుగురు ఓ దొంగల ముఠా ఏర్పడ్డారు. వారిలో ఇద్దరికి జైల్లో స్నేహం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక మిగిలిన నలుగురితో జట్టు కట్టారు. వారు.. గాది నాగబాబు, కుంచనపల్లి విజయకుమార్, అప్పారి సురేష్‌బాబు, గొవ్వాల రాజు (అమలాపురం), గుబ్బల దుర్గా నగేష్ (అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం), జగతా మూర్తి కిషోర్ (ముమ్మిడివరం). పెద్ద వ్యాపారాలు చేసే వారు రాత్రి సమయాల్లో బ్యాగ్‌ల్లో సొమ్ములు తీసుకు వెళ్లడం.. ఆస్తులు అమ్ముకుని పెద్ద మొత్తాలను ఇంట్లో దాచుకున్నవారు.. ఏవైనా ఆస్తులు కొని రూ.లక్షల్లో డబ్బులు చెల్లించేందుకు సొమ్ము సేకరించుకున్నవారి సమాచారాన్ని సేకరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా రెక్కీ నిర్వహించి ఈనెల ఏడో తేదీ రాత్రి అమలాపురం కల్వకొలను వీధికి చెందిన సలాది వెంకటరాజు వ్యాపారం ముగించుకుని డబ్బు బ్యాగ్‌తో వస్తుండగా ఆ డబ్బు కాజేసేందుకు పథకం పన్నారు. అనుకున్నట్టుగానే వెంకటరాజును వెంబడించారు. ఆయన చేతిలోని క్యాష్ బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో వెంకటరాజు బిగ్గరగా అరవడంతో స్థానికులు చుట్టుముట్టారు. దాంతో దొంగలు పరారయ్యారు. వెంకటరాజు ఫిర్యాదుతో పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ రాజాపు రమణ ఆదేశాలతో సీఐ శ్రీరామ కోటేశ్వరరావు ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్ బృందం ఈ ముఠా కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో ఆ ఆరుగురు దొంగలు పట్టుపడ్డారు. వారిని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విఫలమైన రెండు భారీ చోరీలు ఈ ముఠా సభ్యులు గత డిసెంబర్ నెలలో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఓ రొయ్యల వ్యాపారి వద్ద రూ.45 లక్షల నగదు ఉండడాన్ని రెక్కీ ద్వారా గుర్తించారు. దారి కాచి ఆ వ్యాపారి నుంచి డబ్బు దోచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని సీఐ చెప్పారు. అలాగే గత నెలలో అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్టు రెక్కీల ద్వారా గమనించారు. అక్కడ కూడా చోరీ యత్నంలో ఉండగా ఎవరో తచ్చాడుతుండడంతో చోరీ చేయకుండా తిరుగు ముఖం పట్టారని సీఐ తెలిపారు. ఈ ఆరుగురికీ చోరీలపరంగా కొత్తే. ఆరుగురిలో గాదె నాగబాబు భార్యాభర్తల కేసులో నిందితుడు. అలాగే జగతా మూర్తి కిషోర్ రౌడీ షీటర్. వీరు భారీ చోరీలకు రెక్కీలు నిర్వహించి, స్కెచ్‌లు వేసినప్పటికీ కొన్ని అవాంతరాలు, భయాలతో విఫలయ్యారని సీఐ చెప్పారు. ఈ ముఠాను చాకచక్యంగా అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్‌లను డీఎస్పీ రమణ ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు రివార్డులు అందజేశారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
గోదావరిఖని(రామగుండం): వారిది రాష్ట్రం కాని రాష్ట్రం... ఏళ్లక్రితం మంచిర్యాలకు వచ్చి స్థిరపడ్డారు. తన బావ దొంగతనాలకు పాల్పడితే.. తన భార్య సాయం అందించేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తనభార్యను ఎలాగైనా విడిపించాలని దొంగసొమ్మును విక్రయించడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి వద్ద రూ.5.12 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్కమిషనరేట్లో అడి షనల్ డీసీపీ(అడ్మిన్) అశోక్‌కుమార్ శుక్రవారం నిందితుడి అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని ధర్మఘడ్ జిల్లా కుర్రు గ్రామానికి చెందిన మంగరాజు దూల(48), అతడి భార్య దాలు ముప్పై ఏళ్లుగా మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్‌లోని తన బావ శెట్టి విజయ్ వద్ద ఉంటున్నారు. విజయ్ గతంలో చోరీలు చేసేవాడు. ఆ సొత్తును దూల దంపతుల వద్ద ఉంచేవాడు. రెండుమూడు సార్లు చోరీ చేసిన సొత్తును పోలీసులకు చిక్కకూడదని దూలకు ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో శెట్టి విజయ్ మంచిర్యాల పోలీసులకు చిక్కా డు. అతడికి సాయం చేస్తోందని దూల భార్య దాలును కూడా అరెస్ట్ చేశారు. తనను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం, సొత్తును మార్పిడి చేసి తన భార్యను విడిపించుకోవాలని పథకం పన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సొత్తును గోదావరిఖనిలో విక్రయించడానికి వస్తున్నాడన్న పక్కా సమాచారంతో బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.5.12 లక్షలు విలువచేసే 18 తులాల బంగారం, 21తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, ఏసీపీ (సీఎస్బీ)పోలు రమేష్‌బాబు, టాస్క్‌ఫోర్స్ సీఐ బుద్ద స్వామి, సీఐలు నరేష్, శ్రీనివాసరావు, ఎస్సైలు రమేష్, సమ్మయ్య ఉన్నారు. -
దోపిడీ దొంగ అరెస్ట్
బరంపురం ఒరిస్సా : నగరం సమీప కొత్త కమలాపూర్ గ్రామంలో జరిగిన దోపిడీ సంఘటనలో గోపాల్పూర్ పోలీసులు ఓ దోపిడీ దొంగను అరెస్ట్ చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, రూ.25 వేల దోపిడీ సొత్తుని స్వాధీనం చేసుకున్నా రు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. గత నెల 16వ తేదీన గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కొత్త కమలాపురం గ్రామంలో ఒక ఇంటిలో దుండగుడు చొరబడి రూ.35 వేల నగదు, ఒక లాప్టాప్, ఒక సెల్‌ఫోన్ దోచుకుని పరారైన సంఘటనపై గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు మాయారాయ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గోపాల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి గొళాబందలో నివాసం ఉంటున్న దోపిడీకి పాల్పడిన ప్రమోద్ కుమార్ మెహరాని గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిని నిందితుడిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి బరంపురం సర్కిల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. -
ట్రాక్టర్ల దొంగ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : అతని కన్ను పడితే ట్రాక్టర్లు మాయం కావాల్సిందే.. ఎంతో చాకచక్యంగా ట్రాక్టర్లను దొంగిలించడంలో అతను సిద్ధహస్తుడు. వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లను దొంగలించిన కర్నాటి కృష్ణారెడ్డి అనే నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ట్రాక్టర్ ట్రాయిలర్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం వన్‌టౌన్ పోలీస్ష్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన కర్నాటి కృష్ణారెడ్డి వ్యవసాయం, ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు అధికం కావడంతో మూడేళ్ల క్రితం నుంచి వ్యసనాలకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా చేసుకుంటుండగా రాజుపాళెం తహసీల్దార్ అతని ట్రాక్టర్‌ను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ప్రొద్దుటూరు వదిలి వెళ్లాడు. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణారెడ్డి ఏడాదిన్నర క్రితం ప్రొద్దుటూరులోని ఆటోనగర్‌లో ఒక ట్రాక్టర్, అద్దంకిలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లిపోయి కాంట్రాక్టర్ వద్ద పని చేసుకుంటూ ఉండేవాడు. అప్పడప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోయేవాడు. ఈ క్రమంలో 2017 నవంబర్ 17న పెన్నానగర్‌కు చెందిన బత్తల గంగాప్రసాద్‌కు చెందిన ఓ ట్రాక్టర్, అదే నెల 22న సుబ్బిరెడ్డి కొట్టాలలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించుకొని పోయాడు. ట్రాక్టర్ యజమానుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డికి నిందితుడు జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో ఉన్నాడని సమాచారం రావడంతో ఆదివారం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన రెండు ట్రాక్టర్లను ఎవరికైనా విక్రయించాలనే ఉద్దేశంతో జమ్మలమడుగు మండలం, కన్నెతీర్థం శివాలయం వద్ద పెట్టినట్లు అతను పోలీసు అధికారులకు తెలిపాడు. దీంతో రెండు ట్రాక్టర్లను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కృష్ణారెడ్డిపై ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్లో కేసులున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు రూ.6 లక్షలు విలువైన ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు నారాయణయాదవ్, ఎంఏఖాన్, హెడ్‌కానిస్టేబుల్ రహంతుల్లా, కానిస్టేబుళ్లు శివనాగిరెడ్డి, ఇస్రాయిల్, మధుసూదనరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
తలపై అండర్వేర్.. ఒళ్లంతా నలుపురంగు!
నెయ్యట్టింకర: ‘‘ఒంటిపై నూలుపోగు ఉండదు. ఒళ్లంతా నల్లరంగు పూసుకుంటాడు. అప్పుడప్పుడూ తలపై అండర్వేర్ ధరిస్తాడు..’’ ఇంతకుమించి ఆ నగ్నదొంగకు సంబంధించిన ఆధారాలేవీ ఉండేవికావు. రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లే చోరుడికోసం ఊళ్లకు ఊళ్లు కాపలా కాసినా ఫలితం లభించలేదు. కొద్ది నెలలపాటు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండాచేసిన ఆ ‘నగ్నదొంగ’ను పోలీసులు ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నారు. ఓ ఇంటి సీసీటీవీ కెమెరాకు చిక్కిన వాడి ముఖాన్ని క్షుణ్నంగా పరిశీలించి, వలపన్నిమరీ బంధించారు. సదరు దొంగ తమిళనాడుకు చెందిన న్యాయశాస్త్ర విద్యార్థి ఎడ్విన్ జోస్(28) అని పోలీసులు తెలిపారు. బైక్‌లను చోరీచేసి వాటిపై రెక్కీ నిర్వహించి, రాత్రికి దొంగతనాలు చేయడం నగ్నదొంగ స్టైల్. కట్టర్‌తో.. నిద్రించే మహిళల మెడలోని ఆభరణాలను కత్తిరిస్తాడు. ఆసమయంలో వాళ్లుగానీ మేల్కొంటే.. దాడిచేసి చీకట్లో కలిసిపోతాడు. ఇలా కేరళ-తమిళనాడు సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో 30కిపైగా దొంగతనాలు చేశాడు. కేసు నమోదు అనంతరం నిందితుణ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
పగటి నేరగాడు అరెస్ట్
పెంటపాడు : తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దొంగతనాలకు పాల్పడే నేరగాడిని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ అరెస్ట్ చేశారు. పెంటపాడు పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం సీఐ రాజశేఖర్ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. జంగారెడ్డిగూడేనికి చెందిన కంబాపు వెంకటరమణ 2009 నుంచి పలు ప్రదేశాల్లో నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడిపై ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం తదితర స్టేషన్లలో కేసులు ఉన్నాయి. గతేడాది నల్లజర్లలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో పట్టపగలే తాళాలు పగులకొట్టి బీరువాలోని బంగారు, వెండి వస్తువులను అపహరించాడు. 2014లో ద్వారకాతిరుమలలో దొరసానిపాడులో కూడా అదే తరహాలో చోరీ చేశాడు. ఈ రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటరమణను నిందితుడిగా గుర్తించారు. అతడి వేలిముద్రల ఆధారంగా బుధవారం నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ సహకారంతో అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారు గొలుసు, చెవి దుద్దులు, చెవి లోలాకులు, బంగారు చైను, బ్రాస్లెట్లు సుమారు 6 కాసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సహకరించిన సిబ్బంది శంకర్, మురళీలను సీఐ అభినందించారు. సీఐ మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో ప్రజలు ఇంటికి తాళాలు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
వ్యాపారి ఇంట్లో చోరుల హల్చల్
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం దుండుగులు హల్చల్ చేశారు. ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన వారు భారీ ఎత్తున సొత్తు ఎత్తుకెళ్లారు. పారిపోతున్న దుండగులను కాలనీవాసు లు వెంబడించారు. కిలోమీటర్ దాటి మరో కాలనీ మీదుగా పారిపోతున్న దుండగులను అక్కడి ప్రజలు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జిల్లా పోలీసు కా ర్యాలయానికి కూతవేటు దూరంలో దుండగులు అలజడి సృష్టించ డం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో ఉన్న భవానీనగర్ కాలనీకి చెం దిన వ్యాపారి కుంబా ల నర్సింలు, ఆయన భా ర్య విజయ ఇంటికి తాళం వేసి వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక భాగం నుంచి చొరబడిన దుండగులు ఇంట్లోని కప్ బో ర్డులు, లాకర్లను పగులగొట్టి ఇంట్లో దాచిన రూ.6.30 లక్షల నగదు, 34 తులాల బంగారు నగలను అపహరించుకుపోయారు. అదే సమయంలో ఎదురింటికి చెందిన మహిళలు గమ నించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశా రు. అక్కడికి ఇద్దరు యువకులు చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేయగా దుండగులు పారిపోయారు. వారిని కొంతదూరం వరకు వెంబడించారు. రైలు పట్టాలు దాటిన దుండగులు స్నేహపురికాలనీ వైపు పారిపోగా, ఆ కాలనీ వాసులు అప్రమత్తమై వారిని వెంబడించగా ఒకరు చిక్కారు. మరొకరు పారిపోయారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల అదుపులో దుండగుడు.. చోరీకి పాల్పడి పారిపోతున్న ఓ దుండగుడిని స్నేహపురి కాలనీవాసులు పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకు ని విచారిస్తున్నారు. వీరు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
► 181 గ్రాముల బంగారం, 687 గ్రాములు వెండి స్వాధీనం ► వివరాలు వెల్లడించిన మహదేవపూర్ డీఎస్పీ కాటారం (మంథని): పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ముద్దబోయిన రాజేశ్ తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్నప్పటి నుంచి చోరీలకు అలవాటు పడి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2015లో మహదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడగా పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం 2016లో ఇదే జిల్లాలోని కాటారం, అడవి ముత్తారం మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో రెండు చోరీలకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 2016 ఆగస్టులో విచారణ నిమిత్తం రాజేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని చత్తీస్‌గఢ్‌కు పారిపోయాడు. అనంతరం కొంత కాలం పాటు చత్తీస్‌గఢ్‌లో ఉన్న రాజేశ్ భూపాలపట్నంలో దొంగతనానికి పాల్పడి ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేశాడు. అక్కడ సైతం పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి నుంచి తిరిగి తెలంగాణకు చేరుకున్నాడు. చోరీ చేసిన సొమ్మును భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటలోని తన బావ ఇంటి వద్ద దాచుకున్న రాజేశ్ ద్విచక్రవాహనంపై భూపాలపల్లిలో విక్రయించడానికి తీసుకెళ్తుండగా మండలంలోని చింతకాని క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై టి.కిరణ్ గుర్తించి అరెస్ట్ చేశారు. రాజేశ్‌ను విచారించి అతని వద్ద గల 181 గ్రాము ల బంగారం, 687 గ్రామాలు వెండి ఆభరణాలను స్వాధీనపర్చుకున్నారు. రాజేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కాటారం, మహదేవపూర్ సీఐలు గడ్డం సదన్‌కుమార్, చంద్రబాను, ఎస్సైలు టి.కిరణ్, ఉదయ్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగ అరెస్ట్
పెద్దమండ్యం: చుట్టం చూపుగా వచ్చి రూ.50 వేల నగదు, 19 తులాల బంగారం చోరీ చేసిన దొంగను పోలీసులు పది రోజుల్లోనే పట్టుకున్నారు. ములకలచెరువు సీఐ రుషీకేశవ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దమండ్యం మండలంలోని వెలిగల్లుకు చెందిన నాగూరు హుసేన్‌బీ గొర్?రలు మేపుకొని జీవనం సాగిస్తోంది. ఈమె కుమారునికి మండలంలోని పాపేపల్లెకు చెందిన దస్తగిరి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో దస్తగిరి కుమారుడు సాధిక్‌పీరా (23) వెలిగల్లులో ఉన్న అక్క దగ్గరికి ఆటోలో వెళ్లాడు. ఇంట్లో ఉన్న 19 తులాలు బంగారం, రూ.50 వేలు నగదు చోరీ చేశాడు. తాను దాచి ఉంచిన బంగారం, నగదు చోరీ అరుునట్లు పది రోజుల క్రితం హుసేన్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రుషీకేశవ, ఎస్ఐ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి వేసి న తాళం అలాగే ఉండి నగలు, నగదు చోరీకి గురికావడంతో బంధువులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బంధువైన సాధిక్‌పీరాను విచారించడంతో దొంగతనం బయటపడింది. అతన్ని పాపేపల్లె బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి 19 తులాల బంగారం, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపా రు. నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లోనే చోరీని ఛేదించిన ఎస్ఐ శంకరమల్లయ్య, క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. వారికి రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి నివేదిస్తామని పేర్కొన్నారు. -
చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం : దొంగ అరెస్ట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్‌కు యత్నించిన ఓ దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్లితే...శంషాబాద్ జెండా చౌరస్తాలో సోమవారం ఉదయం అయేషా ఖానం(9), జయానా ఖానం(5), హన్నా(3) అనే ముగ్గురు చిన్నారులు కిరాణా షాపునకు వెళ్తుండగా ఓ వ్యక్తి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో భయపడిన సదరు వ్యక్తి పిల్లల్ని వదిలి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నిందితుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణాచారిగా గుర్తించారు. చిన్నారుల తండ్రి మహ్మద్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.