
వీడు సామాన్యుడు కాదు..
గజదొంగ అరెస్టు , 31 బైక్‌ల స్వాధీనం
జీడిమెట్ల: బైక్‌లు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ గజ దొంగతో పాటు అతనికి సహకరించిన మరో దొంగను బాలానగర్ సీసీఎస్ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షలు విలువచేసే 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ ఇన్‌చార్జ్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డినగర్ డివిజన్ గురుమూర్తినగర్‌కు చెందిన మహ్మద్ ఫారూఖ్ ఖాన్(25) పాత నేరస్తుడు.
2006లో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ధాన్యం దొంగిలించిన కేసులో తొలిసారి ఇతను జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఫారూఖ్ 2011లో మహారాష్ట్ర ఉద్గిర్‌లో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ హోటల్‌లో పని చేస్తూనే 10 బైక్‌లు దొంగిలించాడు. అప్పట్లో మహారాష్ట్ర పోలీసులు ఫారూఖ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2013లో జైలు నుంచి బయటకు వచ్చిన ఫారూఖ్ బెంగళూరుకు చెందిన అషా బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు బెంగళూరులో ఉన్న ఫారూఖ్ 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చి రంగారెడ్డి నగర్ డివిజన్‌లోని గురుమూర్తి నగర్‌లో ఉంటున్నాడు. పెళ్లి అయ్యాక కూడా తన పంథా మార్చుకోకుండా సోదరుడు జాఫర్(22) అలియాస్ జప్పితో కలిసి ద్విచక్రవాహనాలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.
బండి వదిలి పారిపోతూ...
మార్చి 24న యూసుఫ్‌గూడకు చెందిన యూ.శైలేష్ చింతల్ లోని షా థియేటర్ ముందు తన పల్సర్ బైక్ నిలిపి హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం జీడిమెట్ల పోలీసులు, బాలానగర్ సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పల్సర్‌పై వేగంగా వెళ్తున్న ఫారూఖ్‌ను ఆపడానికి యత్నించగా.. బండి కింద పడేసి పరుగులు తీశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంబడించి ఫారూఖ్‌ను పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా తన తమ్ముడు జాఫర్‌తో కలిసి 31 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు.
వీటిలో ఐదు వాహనాలను సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన ఇర్ల గంగాధర్‌కు విక్రయించినట్టు తెలిపాడు. దీంతో పోలీసులు ఫారూఖ్ ఖాన్, జాఫర్ ఖాన్‌తో పాటు చోరీ సొత్తుకొన్న ఇర్లా గంగాధర్‌పై కేసు నమోదు చేశారు. జాఫర్ పరారీలో ఉండగా.. ఫారూఖ్, గంగాధర్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 31 ద్విచక్రవాహనాలు స్వాధీనంచేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, జీడిమెట్ల డీఐ మహమూద్ ఖాన్, సీఐ చంద్రశేఖర్, సీసీఎస్ ఎసై ్స ధన్‌సింగ్, జీడిమెట్ల డీఐ రామకృష్ణ, సిబ్బంది హరితరాజు, సతీష్, జైరాజేష్, నర్సింహలను డీపీపీ, ఏసీపీలు అభినందించారు.
ఆటో దొంగ రిమాండ్..
ఆటో చోరీ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ మండలం సారగూడెం గ్రామానికి చెందిన డి.నరేష్(28) జీడిమెట్ల ఠాణా పరిధిలో ఆటో దొంగిలించి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు ఇతడిని పట్టుకొని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.