bike theft
-
రూ.4 లక్షల ఖరీదైన బైక్ చోరీ
పెద్దాపురం: స్థానిక బ్యాంక్ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్ కింగ్ ఓపెరా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆర్అండ్బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్ యథావిధిగానే పార్క్ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పూజారిని మాటల్లో పెట్టి బండి కొట్టేసిన బుడ్డోడు
-
Bullet Bikes: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చాకచక్కంగా తప్పించుకుంటున్నారు. కొండాపూర్, మాదాపూర్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న చోరీలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన కొన్ని కేసులు దొంగల తెలివితేటలకు అద్దం పడుతున్నాయి. మణిప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం కొండాపూర్‌లో స్టైయిల్ హెయిర్ సెలూన్‌కు వెళ్లాడు. తరువాత బయటకు వచ్చి చూస్తే తన బుల్లెట్ బైక్ కనిపించలేదు. సీసీ పుటేజీ పనిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని రెండు సార్లు రెక్కీ నిర్వహించి ఓ అపార్ట్మెంట్ వద్ద తన ప్యాషన్ బైక్ పెట్టి నడుచుకుంటూ సెలూన్ దగ్గరకు వచ్చాడు. హ్యాండిల్ లాక్ చేయకపోవడంతో కొద్ది దూరం తోసుకుంటూ వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో హెడ్‌లైట్ తీసి వైర్ల సహయయంతో స్టార్ట్ చేసి బుల్లెతో ఉడాయించాడు. 30 నిమిషాల తరువాత వచ్చి అపార్ట్మమెంట్ వద్ద ఉన్న తన ప్యాషన్ బైక్‌ను తీసుకొని పరారయ్యాడు. బుల్లెట్ దొంగ కోసం గచ్చిబౌలి పోలీసులు రెండు బృందులుగా దర్యాప్తు చేపట్టారు. చదవండి👉వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే! బుల్లెట్‌ని తోసుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన బుల్లెట్లు మాయం... మాదాపూర్ పీఎస్ పరిధిలోని పర్వత్‌నగర్‌లో నివాసముండే అఖిల్ రెడ్డి మే 26న అర్థరాత్రి ఇంటి ముందు బుల్లెట్ పార్క్ చేశాడు. తెల్లవారు జామున చూడగా బుల్లెట్ కనిపించలేదు. బాధి తుడు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాల గూడలో ఓ ఇంటి ముందు పార్క్చేసిన బుల్లెట్‌ను నాలుగు రోజుల క్రితం చోరీ చేశారు. బాధితుడు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వరుసగా బుల్లెట్లు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. చదవండి👉వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు -
సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా
కేపీహెచ్‌బీకాలనీ: బైక్‌లు నడపాలనే సరదా చోరీలు చేసేలా తయారు చేసింది. మూడు బైక్‌లను దొంగిలించి కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కాడు. వాహనాలను స్వాదీనం చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆ యువకుడిని రిమాండ్‌కు తరలించారు. డీఐ నాగిరెడ్డి తెలిపిన మేరకు.. హైటెక్ సిటీ ప్రాంతంలోని చందానాయక్ తండాలో నివాసముండే ఇత్తడి అరుణ్(19) కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆఫీస్‌బాయ్. ఇతడి తల్లిదండ్రులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అరుణ్‌కు బైక్‌ల మీద దూసుకువెళ్లాలనే సరదా ఉండేది. దీంతో బైక్‌లను దొంగిలించి తన సరదా తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్, మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో బైక్‌ను దొంగిలించాడు. ఈ రెండు బైక్‌లు నచ్చకపోవటంతో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో బైక్‌ను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం జేఎన్టీయూ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న కేపీహెచ్‌బీ పోలీసులకు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ అటువైపుగా వచ్చిన అరుణ్ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోగా బైక్‌కు సంబంధించిన పత్రాలు అతడి వద్ద లేవు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. చదవండి: తల్లీ-కొడుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం -
లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు!
ఘజియాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో నేరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోలిస్తే చోరీలు, హత్యలు, ఇతర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ అక్కడక్కడ చోరశిఖామణులు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది చోరులు మాత్రం తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. (ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోరీ చేస్తూ ఓ దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానిక గిరి మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు కొనేందుకు ఓ పెద్దాయన స్కూటర్ మీద దుకాణానికి వచ్చాడు. బండిని దుకాణం ఎదుటే పార్కింగ్ చేసి సరుకులు కొనడానికి వెళ్లాడు. ఆయన వెనుకే తాపీగా వచ్చిన చోరుడు అదును చూసి బండితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగ తన పని తాను చేసినట్టుగానే సీసీ టీవీ కూడా చేసిందని ఈ వీడియో చూసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి: డీసీపీ -
అతను కన్నేస్తే.. టీవీఎస్ ఎక్సెల్ మాయం..!
ప్రొద్దుటూరు క్రైం : అతను టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను మాత్రమే నడపగలడు.. గేర్ బైక్‌లను నడపడం చేతకాదు.. ఈ తరహా బైక్‌లను చోరీ చేసినా తీసుకెళ్లడం కష్టమనుకున్న అతను టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బుధవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం, వెదురూరు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్‌బాషా సైకిల్లో పండ్లు పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు. మద్యం తాగనిదే అతనికి నిద్ర వచ్చేది కాదు. పండ్ల వ్యాపారంతో వచ్చే ఆదాయం తాగుడుకు, కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో అతను గ్రామంలోని పలువురి వద్ద అప్పు చేశాడు. అతనికి వి.రాజుపాళెం గ్రామానికి చెందిన గాలం శ్రీనివాసులుతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అతను వ్యవసాయం చేస్తాడు. షుగర్ వ్యాధి ఉన్నందున వ్యయసాయ పనులకు వెళ్లడం మానేశాడు. గూడ్స్ ఆటో తీసుకొని ఇద్దరు కలసి కూరగాయల వ్యాపారాన్ని చేసుకునేవారు. సంసారం విషయంలో మనస్పర్థలు రావడంతో హుస్సేన్‌బాషా కొన్ని రోజుల నుంచి భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. దీంతో ఇటీవల తాగుడుకు బానిస అయ్యాడు. తాగడానికి డబ్బు లేకపోతే శ్రీనివాసులు వద్ద అప్పు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను దొంగిలించి సులభంగా డబ్బు సంపాదించాలని అతను భావించాడు. టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిళ్లను చోరీ చేయాలని.. పెద్ద మోటార్ బైక్ అయితే పోలీసులకు రికార్డులు చూపించాల్సి వస్తుందని, చిన్న వాహనం అయితే పోలీసులు రికార్డు అడగరని అతను ఈ నిర్ణయానికి వచ్చాడు. అదీగాక అతనికి టీవీఎస్ ఎక్సెల్ మాత్రమే నడపడం వస్తుంది, పెద్ద బైక్ నడపలేడు. టీవీఎస్ ఎక్సెల్‌లను మాత్రమే చోరీ చేయడానికి అది కూడా కారణమని డీఎస్పీ తెలిపారు. రికార్డులు లేకున్నా చిన్న వాహనాలను పల్లెల్లో సులభంగా అమ్ముకోవచ్చనుకున్న అతను ఈ విషయాన్ని శ్రీనివాసులుకు చెప్పాడు. అందుకు శ్రీనివాసులు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. సైడ్ లాక్ వేయని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిళ్లను మాత్రమే ఎంచుకోవాలని అతను హుస్సేన్‌బాషాకు సూచించాడు. అంతేగాక వైర్లను కట్ చేసి ఎలా స్టార్ట్ చేసుకొని వెళ్లాలో కూడా అతను నేర్పించాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బాషా శ్రీనివాసులుతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. పలు స్టేషన్ల పరిధిలో చోరీలు జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో ఇద్దరు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్లో మూడు, వన్‌టౌన్‌లో రెండు, త్రీ టౌన్లో నాలుగు, జమ్మలమడుగులో రెండు, ఎర్రగుంట్లలో రెండు, పోరుమామిళ్లలో మూడు,బద్వేల్లో రెండు వాహనాలను చోరీ చేశారు. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బుధవారం మోడంపల్లె బైపాస్‌రోడ్డులో డీఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో మైదుకూరు వైపు నుంచి హుస్సేన్‌బాషా, శ్రీనివాసులు వేర్వేరు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలపై వచ్చారు. రికార్డులు చూపించమని పోలీసులు అడుగగా తడబడుతూ లేవని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ ఓబులేసు పాల్గొన్నారు. ఈ కేసులో మంచి ప్రతిభ చూపించిన ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
బైక్ దొంగ అరెస్ట్
సాలూరు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న యువకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ ఇలియాస్ మహ్మద్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలం నెలిపర్తి గ్రామానికి చెందిన సేనాపతి శంకరరావు అలియాస్ రామకృష్ణ సాలూరు పట్టణంలో మూడు బైక్‌లు.. మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్‌ను దొంగిలించాడన్నారు. క్రైమ్ పోలీసులు విచారణ జరిపి దొంగతనాలకు పాల్పడుతున్న శంకరరావును పట్టుకుని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనుమానితుల సమాచారం ఇవ్వండి.. పట్టణ ఎస్సై ఫకృద్దీన్ మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్ల వదిలి వేరే ఊర్లకు వెళ్లేవారు కూడా సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని చెప్పారు. -
పట్టపగలే నిమిషంలో బైక్ చోరీ
-
పోలీస్ స్టేషన్ ముందే బైక్ చోరీ
హైదరాబాద్ : సాధారణంగా మన వాహనాలు చోరీ అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి బైక్ చోరీ అయితే ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడేంటి పరిస్థితి. సరిగ్గా అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... ఎల్ బీ నగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కేతావత్ రాజు బుధవారం ఉదయం ఓ కేసు విషయంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తన ద్విచక్ర వాహనాన్ని (ఏపీ29 బీయూ 9016) పోలీస్‌స్టేషన్ ముందు పార్క్ చేసి వెళ్లాడు. గంట తరువాత తిరిగి వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. కొద్దిసేపు పరిసరాలు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దాంతో రాజు అయోమయానికి గురై అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో వీడియోఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి ఎరుపు కలర్ టీషర్ట్ వేసుకొని స్టేషన్ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల తాళాలు తీయడం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రయత్నంలో ఏ బైక్ రాకపోవడంతో రాజు బైక్ తాళం వెళ్లడంతో క్షణం ఆలస్యం చేయకుండా బైక్ స్టార్ట్ చేసుకుని దర్జాగా పారిపోయాడు. పోలీస్ స్టేషన్ ముందే బైక్ పార్క్ చేస్తే చోరీకి గురవ్వడంతో ఇక ఇతర ప్రాంతాల్లో బైక్‌లు పెడితే అవి ఉంటాయని నమ్మకం పోయిందని పలువురు పేర్కొన్నారు. ఇదే పోలీస్‌స్టేషన్ పార్కింగ్‌లో గతంలో కూడా ఏకంగా ఓ కానిస్టేబుల్ బైక్ పోవడం విశేషం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు
మార్కాపురం : గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బైకు దొంగతనాలు, గృహాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను మార్కాపురం శివారు ఎస్టేట్ వద్ద వై.జంక్షన్ సమీపంలో పట్టణ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కనిగిరి మండలం చింతలపాలేనికి చెందిన చింతల సిసింద్రీ అలియాస్ సూర్య శనివారం స్థానిక వై.జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సిసింద్రీ నెల్లూరు జిల్లా ముంజమూరులో మోటార్ సైకిల్‌ను, కావలి టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో అపాచీ మోటార్ సైకిల్‌ను, గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంజమూరులో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల విలువ చేసే వెండి వస్తువులను దొంగిలించినట్లు తేలింది. ఇటీవల మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్ పరిధి భగత్‌సింగ్ కాలనీలో దొంగతనం చేసి రెండు వెండి గిన్నెలు దొంగిలించాడు. వెండి ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సైడ్ లాక్ లేని వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సిసింద్రీ దొంగతనాలు చేస్తాడని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ బత్తుల శ్రీనివాస్, ఎస్ఐ బూదాల శ్రీకాంత్, ఏఎస్ఐ అల్లూరిరెడ్డి, రైటర్ మాల్యాద్రిరెడ్డి, కానిస్టేబుల్ వెంకట్, హోంగార్డు రమణలను డీఎస్పీ అభినందించారు. -
జల్సాలకు అలవాటుపడి బైకుల చోరీ
సిద్దిపేట: వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు వ్యసనాల కోసం డబ్బుల సమకూర్చు కోవడానికి బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. సిద్దిపేట పట్టణం, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్‌ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల స్వామి(23), దున్నపోతుల సంతోష్(21) జల్సాలకు అలవాటుపడి కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కమిషనరేట్ పరిధిల్లో 22 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. గతంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించి నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లితే కోర్టులో డిపాజిట్ చేసి వాహన యజమానులకు అప్పగించామన్నారు. నిందితుల నుంచి బజాజ్ పల్సర్-4, హీరో హోండా ఫ్యాషన్ ప్రో-3, హీరో హోండా ఫ్యాషన్ ప్లస్-4, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్-8, హోండాషైన్-1 చొప్పున బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. -
నవ్వు తెప్పించే బైక్ దొంగతనం
-
వీడు సామాన్యుడు కాదు..
గజదొంగ అరెస్టు , 31 బైక్‌ల స్వాధీనం జీడిమెట్ల: బైక్‌లు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ గజ దొంగతో పాటు అతనికి సహకరించిన మరో దొంగను బాలానగర్ సీసీఎస్ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షలు విలువచేసే 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ ఇన్చార్జ్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డినగర్ డివిజన్ గురుమూర్తినగర్‌కు చెందిన మహ్మద్ ఫారూఖ్ ఖాన్(25) పాత నేరస్తుడు. 2006లో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ధాన్యం దొంగిలించిన కేసులో తొలిసారి ఇతను జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఫారూఖ్ 2011లో మహారాష్ట్ర ఉద్గిర్లో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ హోటల్లో పని చేస్తూనే 10 బైక్‌లు దొంగిలించాడు. అప్పట్లో మహారాష్ట్ర పోలీసులు ఫారూఖ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2013లో జైలు నుంచి బయటకు వచ్చిన ఫారూఖ్ బెంగళూరుకు చెందిన అషా బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు బెంగళూరులో ఉన్న ఫారూఖ్ 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చి రంగారెడ్డి నగర్ డివిజన్లోని గురుమూర్తి నగర్లో ఉంటున్నాడు. పెళ్లి అయ్యాక కూడా తన పంథా మార్చుకోకుండా సోదరుడు జాఫర్(22) అలియాస్ జప్పితో కలిసి ద్విచక్రవాహనాలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. బండి వదిలి పారిపోతూ... మార్చి 24న యూసుఫ్‌గూడకు చెందిన యూ.శైలేష్ చింతల్ లోని షా థియేటర్ ముందు తన పల్సర్ బైక్ నిలిపి హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం జీడిమెట్ల పోలీసులు, బాలానగర్ సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పల్సర్‌పై వేగంగా వెళ్తున్న ఫారూఖ్‌ను ఆపడానికి యత్నించగా.. బండి కింద పడేసి పరుగులు తీశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంబడించి ఫారూఖ్‌ను పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా తన తమ్ముడు జాఫర్‌తో కలిసి 31 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. వీటిలో ఐదు వాహనాలను సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన ఇర్ల గంగాధర్‌కు విక్రయించినట్టు తెలిపాడు. దీంతో పోలీసులు ఫారూఖ్ ఖాన్, జాఫర్ ఖాన్‌తో పాటు చోరీ సొత్తుకొన్న ఇర్లా గంగాధర్‌పై కేసు నమోదు చేశారు. జాఫర్ పరారీలో ఉండగా.. ఫారూఖ్, గంగాధర్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 31 ద్విచక్రవాహనాలు స్వాధీనంచేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, జీడిమెట్ల డీఐ మహమూద్ ఖాన్, సీఐ చంద్రశేఖర్, సీసీఎస్ ఎసై ్స ధన్సింగ్, జీడిమెట్ల డీఐ రామకృష్ణ, సిబ్బంది హరితరాజు, సతీష్, జైరాజేష్, నర్సింహలను డీపీపీ, ఏసీపీలు అభినందించారు. ఆటో దొంగ రిమాండ్.. ఆటో చోరీ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ మండలం సారగూడెం గ్రామానికి చెందిన డి.నరేష్(28) జీడిమెట్ల ఠాణా పరిధిలో ఆటో దొంగిలించి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు ఇతడిని పట్టుకొని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించారు. -
దోచేయ్.. జల్సా చెయ్!
విజయవాడ సిటీ : బైక్ చోరీలు చేస్తూ జల్సా చేస్తున్న దంపతుల గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. కొట్టేసిన బైకులను ఆన్లైన్లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వీరిని అరెస్టు చేసి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఎల్.కాళిదాస్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చిట్టినగర్‌లోని సాయిరామ్ థియేటర్ ప్రాంతానికి చెందిన చెన్నా సాగర్ (25) ఇటీవల స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి తరచూ స్టార్ హోటళ్లకు వెళ్లి జల్సా చేసేవారు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం స్వర్ణలత భర్తను బైక్ దొంగతనాలకు పురిగొల్పింది. ఆపై తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ పత్రాలు తయారు చేసి ఆన్లైన్లో బైక్‌లు అమ్మేవారు. తాళం వేయని బైక్‌లు, బైక్‌లోనే వాహనం అసలు పత్రాలు ఉన్నవాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతూ చోరీ చేయాల్సిన బైక్‌ను ఎంచుకునేవాళ్లు. ఆపై ఆ బైక్‌ను చోరీ చేసి భర్త వస్తుంటే, అక్కడికి తాము వెళ్లిన బైక్‌ను స్వర్ణలత నడుపుకుంటూ వచ్చేది. ఇప్పటివరకు విజయవాడలో 12, గుంటూరులో 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున మోటార్ సైకిళ్లు చోరీ చేశారు. అమ్మకం ఇలా... చోరీ చేసిన మోటారు సైకిళ్లకు కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఆపై కొత్త సిమ్ కార్డును తీసుకుని ఉపయోగిస్తారు. ఆ సిమ్ ద్వారా ఓఎల్ఎక్స్ లాంటి ఆన్లైన్ షాపింగ్‌లో అమ్మకానికి పెడతారు. అందులోనే మోటారు సైకిల్ కండిషన్, రేటును కూడా పేర్కొంటారు. ఎవరైనా వీటిని కొనుగోలు చేసిన తర్వాత మరుసటి రోజు వాహనం రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయానికి వస్తానని చెబుతారు. అంతే ఆపై ఆ మొబైల్ ఫోన్ పనిచేయదు. చేసేది లేక కొనుగోలు చేసిన వాహనాలను వినియోగదారులు అలాగే వినియోగిస్తుంటారు. ఇలా చిక్కారు.. తాను మోటారు సైకిల్ కొనుగోలు చేసిన మరుసటి రోజునే రిజిస్ట్రేషన్‌కు వస్తానని చెప్పిన వ్యక్తి సిమ్ కార్డు పని చేయడం లేదని గుర్తించిన ఓ బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి సిమ్ కార్డు ఆధారంగా కూపీ లాగితే దంపతుల బండారం బయటపడింది. అరెస్టు చేసిన నిందితుల నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
పార్క్ చేసిన బైక్ చోరీ.. .
చైనా బజార్ ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం అదశ్యమైన సంఘటన బుధవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన హోంగార్డు హరిబాబు బుధవారం షాపింగ్ నిమిత్తం తన హిరో హోండా ద్విచక్ర వాహ నం (ఏపీ 29బీసీ1952)పై పిసల్‌బండ చౌరస్తాకు వచ్చాడు. కాగా పిసల్‌బండ చౌరస్తాలోని చైనా బజార్ షాపు ముందు తన వాహనాన్ని పార్కు లోనికి వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి పార్కు చేసిన తన ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో హరిబాబు స్థానిక ప్రాంతాల్లో వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీనిపై బాధితుడు హరిబాబు సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్పుల నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్...?
అరవపల్లి : నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో పోలీసులపై కాల్పులు జరిగి మూడు రోజులు కాకముందే.. జిల్లాలోని అరవపల్లిలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ఘటన నిందితులే, అరవపల్లి కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు కాల్పుల జరిపిన తీరును గమనిస్తే వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు ఓ వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను తీసుకుని పారిపోయారని సమాచారం. నిందితులు వరంగల్ జిల్లా జనగాం వైపు పారిపోయారని తెలుస్తోంది. సూర్యాపేట ఘటనతో పోలీసులు నిందితుల గాలింపు కోసం సుమారు 15 టీం లను జిల్లాకు పంపించారు. దాంతో దుండగులు జిల్లా దాటి వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికీ నిందితుల ఊహాచిత్రాలు కూడా గీయించలేక పోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ కి చెందిన ముఠా సభ్యులపనేనని పోలీసులు భావిస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం
నల్లగొండ : ఆయుధాలతో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం సీతారాంపేటలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంబడించారు. దీంతో నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సూర్యాపేట ఘటన మరవకముందే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నిందితులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బైక్ పై పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. -
లిఫ్ట్ ఇస్తే.. బైక్ ఎత్తుకెళ్లాడు..!
చేవెళ్ల: పాపమని లిఫ్టిస్తే.. బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన పూలపల్లి యాదయ్య రాయల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 12న విధులు ముగించుకొని బైక్‌పై కళాశాల నుంచి ఆలూరుకు యాదయ్య బయలుదేరాడు. అయితే మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లికి చెందిన వడ్డె యాదగిరి మార్గంమధ్యలో యాదయ్యను లిఫ్ట్ అడిగాడు. దీంతో యాదయ్య అతణ్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో దామరగిద్ద బస్‌స్టేజీ సమీపంలో మూత్ర విసర్జనకు బైక్ ఆపాలని యాదగిరి కోరాడు. అక్కడ బైక్ ఆపగానే యాదయ్యను బెదిరించి సెల్‌ఫోన్, బైక్ లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. చోరీకి గురైన బైక్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని పోలీసులు నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు భాస్కర్, శంకరయ్య, అనంతయ్యలను సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్‌లు అభినందించారు.