నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో పోలీసులపై కాల్పులు జరిగి మూడు రోజులు కాకముందే..
అరవపల్లి : నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో పోలీసులపై కాల్పులు జరిగి మూడు రోజులు కాకముందే.. జిల్లాలోని అరవపల్లిలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ఘటన నిందితులే, అరవపల్లి కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు కాల్పుల జరిపిన తీరును గమనిస్తే వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు.
శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు ఓ వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను తీసుకుని పారిపోయారని సమాచారం. నిందితులు వరంగల్ జిల్లా జనగాం వైపు పారిపోయారని తెలుస్తోంది. సూర్యాపేట ఘటనతో పోలీసులు నిందితుల గాలింపు కోసం సుమారు 15 టీం లను జిల్లాకు పంపించారు. దాంతో దుండగులు జిల్లా దాటి వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికీ నిందితుల ఊహాచిత్రాలు కూడా గీయించలేక పోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ కి చెందిన ముఠా సభ్యులపనేనని పోలీసులు భావిస్తున్నారు.