పోలీస్ స్టేషన్ ముందే బైక్ చోరీ
హైదరాబాద్ :
సాధారణంగా మన వాహనాలు చోరీ అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి బైక్ చోరీ అయితే ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడేంటి పరిస్థితి. సరిగ్గా అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... ఎల్ బీ నగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కేతావత్ రాజు బుధవారం ఉదయం ఓ కేసు విషయంలో ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తన ద్విచక్ర వాహనాన్ని (ఏపీ29 బీయూ 9016) పోలీస్‌స్టేషన్ ముందు పార్క్ చేసి వెళ్లాడు.
గంట తరువాత తిరిగి వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. కొద్దిసేపు పరిసరాలు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దాంతో రాజు అయోమయానికి గురై అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో వీడియోఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి ఎరుపు కలర్ టీషర్ట్ వేసుకొని స్టేషన్ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల తాళాలు తీయడం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రయత్నంలో ఏ బైక్ రాకపోవడంతో రాజు బైక్ తాళం వెళ్లడంతో క్షణం ఆలస్యం చేయకుండా బైక్ స్టార్ట్ చేసుకుని దర్జాగా పారిపోయాడు.
పోలీస్ స్టేషన్ ముందే బైక్ పార్క్ చేస్తే చోరీకి గురవ్వడంతో ఇక ఇతర ప్రాంతాల్లో బైక్‌లు పెడితే అవి ఉంటాయని నమ్మకం పోయిందని పలువురు పేర్కొన్నారు. ఇదే పోలీస్‌స్టేషన్ పార్కింగ్‌లో గతంలో కూడా ఏకంగా ఓ కానిస్టేబుల్ బైక్ పోవడం విశేషం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.