ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు
Published Mon, Feb 17 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
సాక్షి, ఒంగోలు :బస్సుల్లో ప్రయాణిస్తూ పక్కవారు ఆదమరిచి ఉన్న సమయంలో ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు, ఐఫోన్లు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను బైపాస్ వద్ద ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. విశాఖ జిల్లా తుని గ్రామానికి చెందిన ఇసంపల్లి లక్ష్మణకుమార్ అలియాస్ కుమార్ నుంచి 16 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్, ఐఫోన్, రెండు సవర్ల బంగారు నగలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ల్యాప్‌టాప్‌ల రిపేరు, వాటి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న కుమార్ దొంగిలించిన ల్యాప్‌టాప్‌లకు నకిలీ బిల్లులు సృష్టించి అమ్ముకుంటూ జల్సాలు చేసేవాడు. 2006లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు కూడా పంపారు. ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం వారెంటు కూడా పెండింగ్‌లో ఉంది.
కావేరి, కేశినేని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఒంగోలు వెళ్లే వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లను దొంగిలిస్తుంటాడు. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో పది, నెల్లూరుకు సంబంధించి రెండు, చిలకలూరిపేటకు సంబంధించి రెండు, తిరుపతిలో ఒకటి, తునిలో రెండు కేసులతో పాటు రైల్వే పోలీసులకు సంబంధించి మరో మూడు కేసుల్లో కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ఎంతోకాలం నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని అరెస్టు చేయడంలో ఒంగోలు నగర డీఎస్పీ పి.జాషువా, తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్‌తో పాటు ఎస్‌ఐలు పాండురంగరావు, విజయచందర్, రంగనాథ్, సమీవుల్లా, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ రాము, దయానందరావు, జేసుదాసు, కె.సురేశ్, కానిస్టేబుళ్లు బి.అచ్చయ్య, సురేశ్‌రెడ్డి, జె.మాలకొండయ్య, వి.వాసు, జి.బాబుల కృషి ఉందని ఎస్పీ ప్రమోద్‌కుమార్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement