సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సా చేయడమే వారి ధ్యేయం. దానికోసం అధిక మొత్తంలో సొమ్ము ఉన్న వారిపై రెక్కి నిర్వహించి చోరీలకు స్కెచ్ వేస్తుంటారు. ఒక చోరీ యత్నం విఫలం కాగా మరొకటి అమలులో భగ్నమైంది. ఆ నేపథ్యంలో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
అమలాపురం టౌన్: ఆ ఆరుగురూ 25 ఏళ్ల లోపువారే. సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటు పడ్డ ఆ ఆరుగురు ఓ దొంగల ముఠా ఏర్పడ్డారు. వారిలో ఇద్దరికి జైల్లో స్నేహం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక మిగిలిన నలుగురితో జట్టు కట్టారు. వారు.. గాది నాగబాబు, కుంచనపల్లి విజయకుమార్, అప్పారి సురేష్‌బాబు, గొవ్వాల రాజు (అమలాపురం), గుబ్బల దుర్గా నగేష్ (అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం), జగతా మూర్తి కిషోర్ (ముమ్మిడివరం). పెద్ద వ్యాపారాలు చేసే వారు రాత్రి సమయాల్లో బ్యాగ్‌ల్లో సొమ్ములు తీసుకు వెళ్లడం.. ఆస్తులు అమ్ముకుని పెద్ద మొత్తాలను ఇంట్లో దాచుకున్నవారు.. ఏవైనా ఆస్తులు కొని రూ.లక్షల్లో డబ్బులు చెల్లించేందుకు సొమ్ము సేకరించుకున్నవారి సమాచారాన్ని సేకరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
ఆ విధంగా రెక్కీ నిర్వహించి ఈనెల ఏడో తేదీ రాత్రి అమలాపురం కల్వకొలను వీధికి చెందిన సలాది వెంకటరాజు వ్యాపారం ముగించుకుని డబ్బు బ్యాగ్‌తో వస్తుండగా ఆ డబ్బు కాజేసేందుకు పథకం పన్నారు. అనుకున్నట్టుగానే వెంకటరాజును వెంబడించారు. ఆయన చేతిలోని క్యాష్ బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో వెంకటరాజు బిగ్గరగా అరవడంతో స్థానికులు చుట్టుముట్టారు. దాంతో దొంగలు పరారయ్యారు. వెంకటరాజు ఫిర్యాదుతో పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ రాజాపు రమణ ఆదేశాలతో సీఐ శ్రీరామ కోటేశ్వరరావు ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్ బృందం ఈ ముఠా కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో ఆ ఆరుగురు దొంగలు పట్టుపడ్డారు. వారిని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
విఫలమైన రెండు భారీ చోరీలు
ఈ ముఠా సభ్యులు గత డిసెంబర్ నెలలో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఓ రొయ్యల వ్యాపారి వద్ద రూ.45 లక్షల నగదు ఉండడాన్ని రెక్కీ ద్వారా గుర్తించారు. దారి కాచి ఆ వ్యాపారి నుంచి డబ్బు దోచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని సీఐ చెప్పారు. అలాగే గత నెలలో అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్టు రెక్కీల ద్వారా గమనించారు. అక్కడ కూడా చోరీ యత్నంలో ఉండగా ఎవరో తచ్చాడుతుండడంతో చోరీ చేయకుండా తిరుగు ముఖం పట్టారని సీఐ తెలిపారు. ఈ ఆరుగురికీ చోరీలపరంగా కొత్తే. ఆరుగురిలో గాదె నాగబాబు భార్యాభర్తల కేసులో నిందితుడు. అలాగే జగతా మూర్తి కిషోర్ రౌడీ షీటర్. వీరు భారీ చోరీలకు రెక్కీలు నిర్వహించి, స్కెచ్‌లు వేసినప్పటికీ కొన్ని అవాంతరాలు, భయాలతో విఫలయ్యారని సీఐ చెప్పారు. ఈ ముఠాను చాకచక్యంగా అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్‌లను డీఎస్పీ రమణ ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment