rowdisheet
-
చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు
సాక్షి, బనశంకరి: చికెన్ రోల్ ఇవ్వలేదని హోటల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన బెంగళూరు హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి హనుమంతనగర కుమార్ హోటల్‌కు రౌడీషీటర్ దేవరాజ్, ఇద్దరు అనుచరులు వెళ్లారు. తినడానికి చికెన్‌రోల్ కావాలని సిబ్బందిని అడిగారు. సమయం ముగిసింది, హోటల్ మూసేస్తున్నాం, ఈ రోజు మెనులో చికెన్‌రోల్ లేదని వారు చెప్పారు. దీంతో దేవరాజ్, అతని అనుచరులు సిబ్బందితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్ సిబ్బంది చితకబాది బయటికి గెంటేసి హోటల్ తలుపులు వేశారు. పెట్రోలు పోసి నిప్పు దేవరాజ్ అనుచరులు సమీప పెట్రోల్‌బంక్‌కు వెళ్లి రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ సిబ్బంది గది మీద పోసి నిప్పుపెట్టారు. మంటలు వ్యాపించగానే సిబ్బంది బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. తలుపు, కిటికీ కాలిపోయింది. హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవరాజ్, గణేశ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (చదవండి: జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్) -
యువ దొంగల ముఠా అరెస్టు
సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సా చేయడమే వారి ధ్యేయం. దానికోసం అధిక మొత్తంలో సొమ్ము ఉన్న వారిపై రెక్కి నిర్వహించి చోరీలకు స్కెచ్ వేస్తుంటారు. ఒక చోరీ యత్నం విఫలం కాగా మరొకటి అమలులో భగ్నమైంది. ఆ నేపథ్యంలో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం టౌన్: ఆ ఆరుగురూ 25 ఏళ్ల లోపువారే. సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటు పడ్డ ఆ ఆరుగురు ఓ దొంగల ముఠా ఏర్పడ్డారు. వారిలో ఇద్దరికి జైల్లో స్నేహం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక మిగిలిన నలుగురితో జట్టు కట్టారు. వారు.. గాది నాగబాబు, కుంచనపల్లి విజయకుమార్, అప్పారి సురేష్‌బాబు, గొవ్వాల రాజు (అమలాపురం), గుబ్బల దుర్గా నగేష్ (అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం), జగతా మూర్తి కిషోర్ (ముమ్మిడివరం). పెద్ద వ్యాపారాలు చేసే వారు రాత్రి సమయాల్లో బ్యాగ్‌ల్లో సొమ్ములు తీసుకు వెళ్లడం.. ఆస్తులు అమ్ముకుని పెద్ద మొత్తాలను ఇంట్లో దాచుకున్నవారు.. ఏవైనా ఆస్తులు కొని రూ.లక్షల్లో డబ్బులు చెల్లించేందుకు సొమ్ము సేకరించుకున్నవారి సమాచారాన్ని సేకరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా రెక్కీ నిర్వహించి ఈనెల ఏడో తేదీ రాత్రి అమలాపురం కల్వకొలను వీధికి చెందిన సలాది వెంకటరాజు వ్యాపారం ముగించుకుని డబ్బు బ్యాగ్‌తో వస్తుండగా ఆ డబ్బు కాజేసేందుకు పథకం పన్నారు. అనుకున్నట్టుగానే వెంకటరాజును వెంబడించారు. ఆయన చేతిలోని క్యాష్ బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో వెంకటరాజు బిగ్గరగా అరవడంతో స్థానికులు చుట్టుముట్టారు. దాంతో దొంగలు పరారయ్యారు. వెంకటరాజు ఫిర్యాదుతో పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ రాజాపు రమణ ఆదేశాలతో సీఐ శ్రీరామ కోటేశ్వరరావు ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్ బృందం ఈ ముఠా కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో ఆ ఆరుగురు దొంగలు పట్టుపడ్డారు. వారిని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విఫలమైన రెండు భారీ చోరీలు ఈ ముఠా సభ్యులు గత డిసెంబర్ నెలలో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఓ రొయ్యల వ్యాపారి వద్ద రూ.45 లక్షల నగదు ఉండడాన్ని రెక్కీ ద్వారా గుర్తించారు. దారి కాచి ఆ వ్యాపారి నుంచి డబ్బు దోచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని సీఐ చెప్పారు. అలాగే గత నెలలో అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్టు రెక్కీల ద్వారా గమనించారు. అక్కడ కూడా చోరీ యత్నంలో ఉండగా ఎవరో తచ్చాడుతుండడంతో చోరీ చేయకుండా తిరుగు ముఖం పట్టారని సీఐ తెలిపారు. ఈ ఆరుగురికీ చోరీలపరంగా కొత్తే. ఆరుగురిలో గాదె నాగబాబు భార్యాభర్తల కేసులో నిందితుడు. అలాగే జగతా మూర్తి కిషోర్ రౌడీ షీటర్. వీరు భారీ చోరీలకు రెక్కీలు నిర్వహించి, స్కెచ్‌లు వేసినప్పటికీ కొన్ని అవాంతరాలు, భయాలతో విఫలయ్యారని సీఐ చెప్పారు. ఈ ముఠాను చాకచక్యంగా అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుల్ చిట్నీడి రమేష్‌లను డీఎస్పీ రమణ ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు రివార్డులు అందజేశారు. -
మితిమీరితే రౌడీషీట్ తెరుస్తాం
- తహసీల్దార్‌పై దాడి చేసిన వారికి ఎస్పీ హెచ్చరిక - చాగలమర్రి మండల రెవెన్యూ కార్యాలయంలో విచారణ చాగలమర్రి: అధికారులపై భౌతిక దాడులు చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. సోమవారం చాగలమర్రి తహసీల్దార్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మంగళవారం ఎస్పీ రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని బాధిత తహసీల్దార్ ఆంజనేయులుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని నిందితులను విచారించారు. చక్రవర్తులపల్లెకు చెందిన నరసింహారెడ్డి, గొడిగెనూరుకు చెందిన నాగశేషు, ఓబులేసు, ప్రమోద్ను ముత్యాలపాడు బస్టాండ్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ భూముల ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నాడంటూ తహసీల్దార్‌తో గొడవపడి దాడి చేశారని తెలిపారు. బాధిత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఆళ్లగడ్డ కోర్టుకు హాజరుపరిచామన్నారు. అధికారుల పై దాడులు చేస్తే రౌడిషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఇబ్బందులను ఏకరువు పెట్టిన రైతులు.. తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్నఇబ్బందులను ఈ సందర్భంగా పలువురు రైతులు ఎస్పీ ఎదుట ఏకరువు పెట్టారు. కార్యాలయంలో ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్ల హవా నడుస్తోందని, వారి వద్దే తహసీల్దార్ డిజిటల్ కీ ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఈశ్వరరెడ్డి, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఏఎస్ఐ నాయుడు, హెడ్‌కానిస్టేబుల్ రాజాహుసేన్ ఉన్నారు.