మితిమీరితే రౌడీషీట్ తెరుస్తాం
- తహసీల్దార్‌పై దాడి చేసిన వారికి ఎస్పీ హెచ్చరిక
- చాగలమర్రి మండల రెవెన్యూ కార్యాలయంలో విచారణ
చాగలమర్రి: అధికారులపై భౌతిక దాడులు చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. సోమవారం చాగలమర్రి తహసీల్దార్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మంగళవారం ఎస్పీ రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని బాధిత తహసీల్దార్ ఆంజనేయులుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని నిందితులను విచారించారు. చక్రవర్తులపల్లెకు చెందిన నరసింహారెడ్డి, గొడిగెనూరుకు చెందిన నాగశేషు, ఓబులేసు, ప్రమోద్‌ను ముత్యాలపాడు బస్టాండ్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ భూముల ఆన్‌లైన్ నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నాడంటూ తహసీల్దార్‌తో గొడవపడి దాడి చేశారని తెలిపారు. బాధిత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఆళ్లగడ్డ కోర్టుకు హాజరుపరిచామన్నారు. అధికారుల పై దాడులు చేస్తే రౌడిషీట్ తెరుస్తామని హెచ్చరించారు.
ఇబ్బందులను ఏకరువు పెట్టిన రైతులు..
తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్నఇబ్బందులను ఈ సందర్భంగా పలువురు రైతులు ఎస్పీ ఎదుట ఏకరువు పెట్టారు. కార్యాలయంలో ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్ల హవా నడుస్తోందని, వారి వద్దే తహసీల్దార్ డిజిటల్ కీ ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఈశ్వరరెడ్డి, ఎస్‌ఐలు మోహన్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఏఎస్‌ఐ నాయుడు, హెడ్‌కానిస్టేబుల్ రాజాహుసేన్ ఉన్నారు.