
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్‌గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని రసిసార్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్‌సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్‌గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.
గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్‌గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు.
మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment