UPPSC
-
ఒకే షిఫ్టులో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష
ప్రయాగ్‌రాజ్: ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్(పీసీఎస్) ప్రిలిమినరీ పరీక్ష–2024 వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ పరీక్షను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీపీఎస్సీ) నిర్ణయించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరీక్షను పాత విధానంలోనే ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలంటూ యూపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీంతో యూపీపీఎస్సీ వెనక్కి తగ్గింది. పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ), అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఏఆర్ఓ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. -
బంగారం లాంటి కల..అందమైన జీవితం: ఓ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
జీవితంలో పైకి రావాలని, ఉన్నతోద్యోగాలు సాధించాలని అందరూ కలలు కంటారు. కానీ ఆ కలలను సాధించుకోవడంలో చాలాకొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎదిగి పలువురి ప్రశంసలు పొందడం మాత్రమేకాదు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో సృష్టి దేశ్‌ముఖ్ ఒకరు.సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించిన సృష్టి సక్సెస్ స్టోరీ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో విజయం అంటే మామూలు సంగతి కాదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. అయితే కొన్ని వందల మంది మాత్రమే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS అధికారిగా మారతారు. కానీ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాకు సాధించిడం చాలా అరుదు. సృష్టి UPSC పరీక్షలో ఆలిండియా స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. అంతేకాదు UPSC 2018 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో టాపర్ కూడా. అప్పటికి ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సృష్టి దేశ్‌ముఖ్ గౌడ 1995లో పుట్టింది. చిన్ననాటి నుండి తెలివైన విద్యార్థి. భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్‌లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో 12వ బోర్డు పరీక్షలో 93.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశపడింది. కానీ సీటురాలేదు. చివరికి భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తరువాత తన డ్రీమ్‌ను పూర్తి చేసుకోవడం కోసం సివిల్స్ పరీక్ష రాసి, విజయం సాధించింది. సృష్టి తండ్రి జయంత్ దేశ్‌ముఖ్ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి సునీతా దేశ్‌ముఖ్ టీచర్. సృష్టికి సంగీతం అన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. రోజూ యోగా కూడా చేస్తుంది. మరో ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి గౌడను సృష్టి వివాహం చేసుకుంది. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి , నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగా ఉంటూ సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తున్నారు. -
యూపీఎస్సి అభ్యర్ధులకు ఉచిత కోర్సులు..
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపధ్యంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్సి) పరీక్షల కోసం ప్రిపేరవుతున్న విద్యార్ధులకు ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ యుఫేబర్ చేయూతని అందిస్తోంది. దీనిలో భాగంగా దాదాపు 5 వేల మందికి ఉచితంగా కోర్సులను అందించనుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌తో పాటు నిపుణులతో కౌన్సిలింగ్, దఫాల వారీ టెస్టులు.. వీటన్నింటితో మేళవించిన తమ యుపీఎస్సీ ప్రిలిమ్స్ కోర్సులకు సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా వీరికి శిక్షణ అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలచినవారు యూపీఎస్సీ పాఠశాల డాట్‌కామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. -
సివిల్స్ ప్రిలిమినరీ యథాతథం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, వరదల నేపథ్యంలో ఈ పరీక్షను రెండు మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఎం కన్వీల్కర్, బీఆర్ గావై, జస్టిస్ కృష్ణ మురళితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అలాగే కరోనా, వరదల వల్ల ఈ పరీక్షకు హాజరు కాలేని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్సీకి సూచించింది. అయితే, ఆఖరి అవకాశం(లాస్ట్ అటెంప్ట్) కింద పరీక్షకు హాజరయ్యే వారికే ఈ వెసులుబాటును వర్తింపజేయాలని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమినరీ టెస్టు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న∙యథాతథంగా జరగనుంది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. కరోనా బాధిత అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడంపై ధర్మాసనం స్పందించింది. నిబంధనల ప్రకారం వారు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది. దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారికి పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూపీఎస్సీని కోరింది. -
వన్‌టూత్రీ విజేతలు అమ్మాయిలు..
సెల్‌ఫోన్‌కి పది నెంబర్లు. ఆధార్‌కు పన్నెండు. డెబిట్ కార్డుకు పదహారు. ఏటీఎం పిన్‌కి నాలుగు. విజేతలకు మూడే మూడు. అవి కూడా వన్‌టూత్రీ ఆ విజేతలు కూడా అమ్మాయిలు. ఫిక్స్ అయినట్లున్నారు. తొలి మూడూ తమవేనని! స్టేజ్ మీద నుంచి కనుకైతే ఈ విషయాన్ని ఇలా చెప్పాలి. పైగా ఇది కేవలం విషయం కాదు. విజయ దరహాసం. ‘..అండ్ ది ఫస్ట్ ర్యాంక్ గోస్ టు.. అనూజ్ నెహ్రా. పానిపట్ అమ్మాయి. సెకండ్ ర్యాంక్ సంగీతా రాఘవ్, గుర్గావ్. ఇక మూడో ర్యాంకు జ్యోతీ శర్మ ఫ్రమ్ మథుర. ఏంటి! అబ్బాయిల్లేరా! ఉన్నారు బాబూ.. ఉన్నారు. నాలుగో ర్యాంకు నుంచి మాత్రమే వారు ఉన్నారు. గ్రూప్ వన్ ఉద్యోగాలకు జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసు (యు.పి.పి.ఎస్.సి.) పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులు ఈ ముగ్గురు అమ్మాయిలు. వీళ్లు, ఆ తర్వాతి ర్యాంకుల్లోని మిగతా అమ్మాయిలు కొద్దిరోజుల్లోనే డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ ఎస్పీలు కాబోతున్నారు. యు.పి.పి.ఎస్.సి మొత్తం 988 పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్ నిర్వహించింది. వాటిల్లో 119 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు. 94 డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు. మరో నలభై రకాలైన కేటగిరీలలో మిగతా పోస్టులు. 2018 అక్టోబర్‌లో పరీక్ష జరిగింది. 2019 మార్చిలో ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్‌కి 16,738 మంది ఎంపికయ్యారు. వారికి గత ఏడాది అక్టోబర్‌లో పరీక్షలు జరిగాయి. వారిలో 2669 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలు ఈ ఏడాది జూలై–ఆగస్టు మధ్య జరిగాయి. వారిలో జాబ్‌కి ఎంపికైన వారిలో మొదటి మూడు స్థానాల్లో అనూజ్, సంగీత, జ్యోతి ఉన్నారు! ఈ మధ్యే.. నెలక్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌లో మొదటి పది లోపు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు స్థానం సంపాదించారు. అవి ఒక రాష్ట్రం పరీక్షలు కావు. దేశవ్యాప్తంగా జరిగేవి. ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించింది. అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్. విశాఖ యాదవ్ ఆరో ర్యాంకు, సంజితా మహాపాత్ర పదో ర్యాంకు సంపాదించి అమ్మాయిల్లో ప్రతిభా వర్మ తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఐ.ఎ.ఎస్., ఐ.ఎఫ్.ఎస్. ఐ.పి.ఎస్., సెంట్రల్ సర్వీసులు, గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టులలో 829 ఉద్యోగాలకు జరిగిన పరీక్షలకు అవి. వాటిల్లో 150 పోస్ట్‌లను మహిళలే అది కూడా మంచి ర్యాంకులతో సాధించారు. ప్రతి రంగంలోనూ మహిళలే ముందుండటం, అసమాన ప్రతిభా పాటవాలు కనబరచడం క్రమంగా సాధారణ విషయం అయిపోతోంది. అయితే ఆ సాధారణత వెనుక ఎప్పటికీ ఉండేది మాత్రం అసాధారణ కృషే. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు చదువుల్లో, ఉద్యోగాల్లో, వాటి కన్నా ముందు కుటుంబ పరిస్థితుల్లో అననుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వాటిని దాటుకుని పైకి వస్తున్నారు. ‘స్మాష్ పేట్రియార్కీ’అని కొత్తగా ఒక మహిళా ఉద్యమం ప్రారంభం అయింది. పురుషస్వామ్య పెత్తనాలపై సౌమ్యమైన తిరుగుబాటు అది. ఎక్కడైనా ఒక అమ్మాయి మంచి ర్యాంకుతో ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో ఉన్నతస్థాయికి ఎదగడం.. ఇవి కూడా పిడికిలి బిగించని తిరుగుబాట్లే. మగవాళ్ల కన్నా ఒకడుగు ముందున్నారంటేనే.. అక్కడ పేట్రియార్కీ స్మాష్ అవడం మొదలైనట్లు. -
యూపీఎస్సీ ద్వారా యథావిధిగా నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. కొత్త పోస్టుల బ్యాన్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటి సర్క్యులర్‌లో ‘మంత్రిత్వ శాఖలు / విభాగాలు, అటాచ్డ్ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, చట్టబద్దమైన సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో ఖర్చుల శాఖ ఆమోదంతో మినహా కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం’ అని పేర్కొన్నది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) CLARIFICATION: There is no restriction or ban on filling up of posts in Govt of India . Normal recruitments through govt agencies like Staff Selection Commission, UPSC, Rlwy Recruitment Board, etc will continue as usual without any curbs. (1/2) pic.twitter.com/paQfrNzVo5 — Ministry of Finance (@FinMinIndia) September 5, 2020 దానిలో ‘భారత ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి పరిమితి, నిషేధం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామకాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ‘సెప్టెంబర్ 04 నాటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సర్క్యులర్ పోస్టుల సృష్టి కోసం అంతర్గత విధానంతో వ్యవహరిస్తుందని, నియామకాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు.. తగ్గించదు’ అని పేర్కొన్నది. దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోయాయని, యువతరానికి ఉపాధి కల్పనలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలను అమ్మి, కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారనీ, అయితే పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఫలితాలను ప్రకటించడం లేదని రాహుల్ ఆరోపించారు. -
సివిల్స్‌రిజర్వ్ జాబితాలోని 53 మందికి సర్వీస్
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్ ఫలితాల్లోని రిజర్వ్ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. సివిల్స్–2018 పరీక్షా ఫలితాలను యూïపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. అందులో 759 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బీ పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్ సర్వీస్ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్ లిస్ట్ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు. -
ఆక్సిజన్ సిలిండర్‌తో సివిల్స్ పరీక్ష
తిరువనంతపురం: ఓ సివిల్స్ అభ్యర్థి తపనను అనారోగ్యం కూడా అడ్డుకోలేకపోయింది. ఎముకల వ్యాధితో బాధ పడుతున్నా, ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(24) పుట్టినప్పటి నుంచి టైప్ –2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. అలాగే పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినప్పటికీ సివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఆమె ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరయింది. పరీక్ష అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ సుధీర్‌బాబుకు అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. లతీషా ఎం.కాం. వరకు చదువుకుందని అన్సారీ వెల్లడించారు. -
సివిల్స్ టాపర్ కటారియా
న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, జైపూర్‌కు చెందిన కనిషక్ కటారియా సివిల్స్–2018 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జైపూర్‌కే చెందిన అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించారు. భోపాల్‌కు చెందిన సృష్టి జయంత్ దేశ్‌ముఖ్ మహిళల్లో తొలి స్థానం, మొత్తంమీద ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డికి 7వ ర్యాంకు దక్కింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు మొత్తం 759 మంది అర్హత సాధించారని, అందులో 182 మంది మహిళలు, 36 మంది దివ్యాంగులు ఉన్నారు. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 361 మందికి, ఓబీసీ వర్గంలో 209 మందికి, ఎస్సీల్లో 128 మందికి, ఎస్టీల్లో 61 మందికి ర్యాంకులు వచ్చాయి. గత జూన్‌లో ప్రాథమిక పరీక్షకు 5 లక్షల మంది హాజరవగా, 10,468 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. 1994 మంది మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కాగా, వారికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖాముఖి నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లదే హవా.. ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్‌గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్‌ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. రెండో ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ ఐఐటీ గువాహటిలో ఇంజనీరింగ్ చదివారు. అక్షత్ తండ్రి ఐపీఎస్ అధికారి కాగా, తల్లి ఐఆర్ఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు. సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోనే ఐఏఎస్‌గా సేవలందించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టాప్–25లో నిలిచిన అభ్యర్థులంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ, ఎన్ఎల్యూ, డీయూ, ముంబై యూనివర్సిటీ, అన్నా వర్సిటీ లాంటి విద్యా సంస్థల్లో అభ్యసించారు. -
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్‌లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
ఇక అప్లికేషన్ విత్‌డ్రా చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అనంతరం, పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు తమ దరఖాస్తును ముందు గానే ఉపసంహరించుకునే వెసులుబాటును మొదటిసారిగా యూపీఎస్సీ కల్పించనుంది. వచ్చే ఏడాది జరిగే ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి మెల్లగా అన్ని పరీక్షల్లోనూ అమలు చేస్తామని యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా సోమవారం వెల్లడించారు. యూపీఎస్సీ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సివిల్స్ ప్రాథమిక పరీక్షలకు ప్రతి ఏటా పది లక్షల మంది దరఖాస్తు చేస్తే ఐదు లక్షల మందే పరీక్షకు హాజరవుతున్నారు. కానీ యూపీఎస్సీకి మాత్రం గైర్హాజరవుతున్న ఐదు లక్షల మందికి కూడా ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇన్విజిలేటర్లను నియమించడం ద్వారా చాలా డబ్బు వృథా అవుతోంది. అందుకే దరఖాస్తు చేసినప్పటికీ పరీక్ష రాయలేని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు తమ దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నాం’ అని చెప్పారు. -
ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. అంతిమంగా 110 మంది అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలిపారు. ఇందులో 48 మంది జనరల్ కేటగిరీ, 37 మంది ఓబీసీ, 17 మంది ఎస్సీ, 8మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వారని యూపీఎస్సీ వివరించింది. గత ఏడాది నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫైనల్ ఇంటర్వ్యూలు చేపట్టింది. అంతిమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. -
23 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 23 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ మేరకు శనివారం హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కళాశాలల ప్రతినిధులు, పోస్టల్, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ వరంగల్ కేంద్రంగా మొదటిసారి ఆగస్టు 7న జరుగనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాకు పరీక్షల నిర్వహణ అవకాశం రావడం అందరం గౌరవంగా భావించాలన్నారు. పరీక్షలకు 11 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పోస్టల్, పోలీస్, విద్యుత్, కళాశాలల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు, వివిధ శాఖల సమన్వయం కోసం ఒక అధికారిని కన్వీనర్‌గా నియమించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల వివరాలు ఎక్కువ చోట్ల ఏర్పాటు చేసి వారి హాల్æటికెట్ నంబర్లు, గదుల వివరాలను త్వరగా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఢిల్లీ నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారులు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమీక్షలో డీఆర్వో శోభ, వివిధ శాఖల అధికారులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రిలిమినరీకి పగడ్బందీ ఏర్పాట్లు
నగరంలో 28 పరీక్షా కేంద్రాలు ఇక నుంచి విజయవాడలోనే మెయిన్స్ పరీక్ష సమీక్షించిన కలెక్టర్ విజయవాడ : యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు విజయవాడలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ చెప్పారు. శనివారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 7న జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు నియమితులైన సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వరాదని చెప్పారు. ఏవిధమైన సందేహాలున్నా, వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరీక్షను పర్యవేక్షించటానికి ఐదుగురు ఐఏఎస్‌లతో తనిఖీ ఆఫీసర్స్‌ను నియమించినట్లు చెప్పారు. విజయవాడలో 28 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 1400 మంది ఇన్విజలేటర్స్‌తోపాటు, 94 మంది అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా సెంటర్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులను ఆదేశించామన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి విజయవాడలో మెయిన్ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ సబ్‌సెంటర్ల సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లు అభ్యర్థులతో ఫ్రెండ్లీ నేచర్‌తో మెలగాలన్నారు. చూపులేని అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పటమట కృష్ణవేణి ఇంగ్లీషు మీడియం స్కూలులో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వీరికి సహాయకులుగా ఉండే సబ్‌స్రై్కబర్స్‌తో జెసీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో యూపీఎస్సీ రాష్ట్ర కన్వినర్ నరేష్ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, డీఆర్వో సీహెచ్ రంగయ్య, డీఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.