న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, వరదల నేపథ్యంలో ఈ పరీక్షను రెండు మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఎం కన్వీల్కర్, బీఆర్ గావై, జస్టిస్ కృష్ణ మురళితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అలాగే కరోనా, వరదల వల్ల ఈ పరీక్షకు హాజరు కాలేని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్సీకి సూచించింది.
అయితే, ఆఖరి అవకాశం(లాస్ట్ అటెంప్ట్) కింద పరీక్షకు హాజరయ్యే వారికే ఈ వెసులుబాటును వర్తింపజేయాలని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమినరీ టెస్టు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న∙యథాతథంగా జరగనుంది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. కరోనా బాధిత అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడంపై ధర్మాసనం స్పందించింది. నిబంధనల ప్రకారం వారు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది. దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారికి పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూపీఎస్సీని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment