సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు.
వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది.
ఎప్పటికప్పుడు సూచనలు
కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి.
2020 మార్చిలో మొదలు
కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు.
కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్‌ఎక్స్‌ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు.
లాయర్లకు దిశానిర్దేశం
వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు.
రెండేళ్లలో రికార్డు
2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి!
Comments
Please login to add a commentAdd a comment