న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మద్యం అమ్మకాలను ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టి.. ఇళ్లకే సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. దేశవ్యాప్తంగా 70 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని, ఐదుకోట్ల కంటే ఎక్కువ మంది కొనుగోళ్లు చేశారని పిటిషనర్ గురుస్వామి నటరాజ్ పేర్కొన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం అస్సలు పాటించడం లేదని, ఫలితంగా కోవిడ్–19 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దుకాణాల్లో మద్యం నేరుగా అమ్మడాన్ని నిషేధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ..ఆన్‌లైన్‌లో అమ్మకాలు, హోం డెలివరీ అంశాలను పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించింది.
మద్యం దుకాణాలు మూసేయండి
చెన్నై: తమిళనాడులో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. అడ్వొకేట్ జి.రాజేష్ దాఖలు చేసిన వ్యాజ్యంతోపాటు కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచిన మరుసటి రోజే న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం డోర్ డెలివరీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఆన్‌లైన్‌లో మద్యం విక్రయంపై ఆలోచించండి
Published Sat, May 9 2020 3:35 AM | Last Updated on Sat, May 9 2020 3:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment