
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల పరీక్షకు హాజరు కాలేకపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ వారు చేస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అదనపు అవకాశం కోసం యూపీఎస్పీని ఆశ్రయించాలని పిటిషన ర్లకు సూచించింది. సివిల్స్ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. నిర్దేశిత తేదీన ఏ కారణం వల్లనైనా ఒకసారి పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి ఆ అవకాశం కల్పించే వెసులుబాటు లేదని యూపీఎస్పీ చెబుతోంది.