సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి.
కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది.
అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రధానాంశాలు:
► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు.
► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు.
► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి.
► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి.
► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి.
► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి.
► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి.
Comments
Please login to add a commentAdd a comment