న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు 8 లక్షలకు చేరి రికార్డు సృష్టించగా.. 24 గంటల్లో 27 వేల కేసులు నమోదవడం మరో రికార్డు. తాజాగా నమోదైన 27,114 కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,20,916 కు చేరింది. వైరస్ బాధితుల్లో 519 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22,213 కు చేరింది. ఇక 2,38,461 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 1,30,261 కేసులతో తమిళనాడు, 1,09,140 కేసులతో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.
రికవరీ రేటు 62.78 శాతంగా ఉండటం శుభపరిణామం. మరణాల రేటు 2.72 శాతంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,83,407 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు కోటి 13 లక్షల నమూనాలు పరీక్షించామని జాతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజే 2,82,511 టెస్టులు చేశామని వెల్లడించింది. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా 32,91,786 కేసులతో మొదటి స్థానంలో, బ్రెజిల్ 18,04,338 కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి.
(కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు)
Comments
Please login to add a commentAdd a comment