సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్ మరణాల లెక్కల్లో కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన మృతుల సంఖ్యకు, కోవిడ్ పరిహారం పొందేందుకు వచ్చిన వినతులకు మధ్య భారీ తేడా ఉన్నట్టు తేలింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఎన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించారో వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు మరోసారి ఆదేశాలివ్వగా రాష్ట్రాలు ఆ మేరకు వివరాలు సమర్పించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,13,890 కుటుంబాలు పరిహారం కోరాయి. వారిలో 92,275 మందికి పరిహారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,41,737 మరణాలు సంభవించాయి.
(చదవండి: 2.2కు తగ్గిన ఆర్–వ్యాల్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?)
గుజరాత్‌లో 9, తెలంగాణలో 7 రెట్లు తేడా
అదే సమయంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ తేడా కనిపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ 10,094 మంది కోవిడ్‌తో మృతి చెందారు. 89,633 మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 58,843 కుటుంబాలకు చెల్లింపులు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ కేవలం 3,993 కోవిడ్ మరణాలు నమోదవగా.. పరిహారం కోసం 28,969 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12,148 కుటుంబాలకు సాయం అందించారు.
అంటే గుజరాత్‌లో నమోదైన మృతుల సంఖ్యకు 9 రెట్లు అదనంగా.. తెలంగాణలో నమోదైన మృతుల సంఖ్యకు 7 రెట్లు అదనంగా పరిహారం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక మరణాల సంఖ్య తక్కువ, పరిహారాలు కోరుతున్నవారి సంఖ్య ఎక్కువ ఉండటంపట్ల సుప్రీం కోర్టు స్పందించింది. మృతుల సంఖ్యలో వ్యత్యాసంపై తాము దృష్టి పెట్టడం లేదని, పరిహారం కోరినవారికి సాయం అందిస్తే చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా.. కరోనా సోకిన 30 రోజుల్లో అనారోగ్య కారణాలతో ఆ వ్యక్తులు మరణించినా, ఆత్మహత్యకు పాల్పడినా వాటిని కోవిడ్ మరణాలుగా పరిగణించాలని సుప్రీం కోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాధిత కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్పింది.
(చదవండి: ముంచుకొస్తున్న ముప్పు.. 248 రోజుల తర్వాత అత్యధిక కేసులు)
Comments
Please login to add a commentAdd a comment