
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. లాయర్లు వేసుకొనే పొడవైన గౌన్ల ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఈ గౌన్లు ధరించడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ‘వైద్యల సూచనలు, సలహాల మేరకు, కరోనాను కట్టడి చేయడానికి లాయర్లు, తెల్ల రంగు షర్టు, తెల్ల సల్వార్ కమీజ్, తెల్ల చీర, మెడచుట్టూ తెల్ల రంగు బ్యాండ్ ధరించాలి’ అని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వర్చువల్ సిస్టమ్ ద్వారా జరిగే విచారణకు హాజరయ్యే లాయర్లు తెల్ల రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందే వరకు కొత్త డ్రెస్ కోడ్‌ని అనుసరించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్‌గోవాంకర్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment