న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్‌మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్‌కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్‌టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment