Neet admissions
-
నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఆలస్యమైన నీట్–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్‌లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ నీట్–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి. కన్వినర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్‌లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో 2,886 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్మెంట్ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి. స్టేట్ రౌండ్ 1ను ప్రకటించాలి: టీ–జుడా అఖిలభారత కోటా మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్ న్యూటన్, చైర్పర్సన్ డి. శ్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్ రిజిగ్నేషన్ డెడ్‌లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్ కుమార్ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. -
నీట్ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు.అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.కాగా, నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్, నీట్-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. -
నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ యూజీ- 2023 తేదీలు ఖరారయ్యాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ). మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నీట్ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ nta.ac.in, neet.nta.nic.inలలో లభిస్తాయి. ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్ యూజీ ఎగ్జామ్ విధానం, సిలబస్, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలను విడుదల చేయనుంది ఎన్టీఏ. ఈ పరీక్ష రాసేందుకు 17 ఏళ్లు ఆపైబడిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియెట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు నీట్ పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయూష్, 47 బీవీఎస్సీ, ఏహెచ్ కళాశాలలు నీట్ స్కోర్‌ను అనుమతిస్తున్నాయి. మరోవైపు.. ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్-2023 తేదీలను సైతం ఎన్టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్ పరీక్షలకు సంబంధించి రిజర్వ్ తేదీ జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది ఎన్టీఏ. ఇదీ చదవండి: కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు -
కారణాలేంటో తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2022కు హాజరైన విద్యార్థి జోత్స్నకు తొలుత ఓ మార్కులు(482), తర్వాత మరో మార్కుల(294)ను వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల కారణాలను తెలిపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు కారణాల నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. కారణం చూపించకుండా ఎన్టీఏ తన మార్కులను 482 నుంచి 294కు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ జీఎస్ జోత్స్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్ సుమలతతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.ఎస్.అర్జున్ కుమార్ వాదనలు వినిపించారు. నీట్(యూజీ)కు హాజరైన జోత్స ్నకు తొలుత 482 మార్కులు వచ్చాయన్నారు. ఆలిండియాస్థాయిలో 1,00,456 ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 50,567 ర్యాంక్ వచ్చిందన్నారు. ఈ మేరకు ఫలితాలు వచ్చిన సెప్టెంబర్ 7న ఎన్టీఏ ఫలితాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అప్లోడ్ చేసిన జాబితా చూసి పిటిషనర్ షాక్‌కు గురయ్యారని చెప్పారు. మార్కులను 294కు తగ్గించారని, ఎన్టీఏ వెబ్‌సైట్‌ను తెరిచి చూడగా.. ఇదే మార్కులను చూపించిందన్నారు. దీంతో ర్యాంక్ ఆలిండియా స్థాయిలో 3,32,143కి, ఓబీసీ స్థాయిలో 1,44,313కి పెరిగిందన్నారు. దీనిపై ఎన్టీఏకు ఎన్నిసార్లు ఈ–మెయిల్ పంపినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఏ తరఫున న్యాయవాది బి.కవిత యాదవ్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ఎ. ప్రభాకర్‌రావు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మానసం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. -
NEET UG Rank 2022: నీట్ ఏ ర్యాంక్.. ఎక్కడ సీట్..?
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల ఔత్సాహికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)–యూజీ 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంచనాలు వేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్లో అర్హత పొందిన వారి సంఖ్య పెరిగింది. 2021లో రాష్ట్రం నుంచి 57,721 మంది పరీక్ష రాయగా 33,841 మంది అర్హత సాధించారు. ఇక ఈ ఏడాది (2022)లో 65,305 మంది నీట్‌కు హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు. అంటే 61.77% మంది నీట్లో క్వాలిఫై అయ్యారు. ఈ లెక్కన నీట్–2021తో పోలిస్తే 2022లో రాష్ట్రంలో 16.11 శాతం మంది అధికంగా అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 59.27 శాతం మంది మాత్రమే అర్హత సాధించగా రాష్ట్రంలో అంతకు మించి అర్హత పొందడం విశేషం. 20 శాతం పెరుగుదల దేశవ్యాప్తంగా వైద్య విద్యకు ఏటా క్రేజ్ పెరుగుతోంది. 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా నీట్ రాసిన వారి సంఖ్య 2022 నాటికి 20 శాతం మేర పెరిగింది. 2019లో దేశవ్యాప్తంగా 14,10,755 మంది నీట్ రాయగా, ఈ ఏడాది 17,64,571 మంది పరీక్ష రాశారు. ఇక రాష్ట్రం విషయానికి వస్తే 2021తో పోలిస్తే 2022లో నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య 11.61 శాతం మేర పెరిగింది. మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 6.18 లక్షల మంది అబ్బాయిలు, 8.63 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాశారు. ఈ ఏడాది 7.63 లక్షల మంది అబ్బాయిలు, 10 లక్షల మందికి పైగా అమ్మాయిలు పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రా వైద్య కళాశాలలో ఇలా.. సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల మొదటి చాయిస్ విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలకే ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ 2021–22లో ఎస్టీ కేటగిరీలో 472 స్కోర్‌తో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీల్లో 79,876 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీల్లో 32,693 ర్యాంక్ వరకు, ఓసీల్లో 15,824 ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్ వరకు చివరి సీట్లు వచ్చాయి. మరోవైపు డెంటల్ కోర్సులకు సంబంధించి విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఓసీ కేటగిరీలో 86,787 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీలో 1,38,271 ర్యాంక్ వరకు, ఎస్సీ కేటగిరీలో 1,65,600 ర్యాంక్ వరకు, ఎస్టీ కేటగిరీలో 2,09,406 ర్యాంక్‌కు చివరి సీటు వచ్చింది. -
నీట్ ఫలితాలు విడుదల 9.93 లక్షల మంది ఉత్తీర్ణత
-
ప్రశాంతంగా నీట్ పరీక్ష
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్–2022) ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో.. 29 కేంద్రాల్లో మ.2 గంటల నుంచి సా.5.20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 95 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈసారి ప్రశ్నపత్రం గత రెండేళ్లతో పోలిస్తే కాస్త కఠినంగా ఉందని నిపుణులతోపాటు చాలామంది విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలావరకు సమయం అక్కడే వృథా అయిందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. ఆ 20నిమిషాలపై భిన్నాభిప్రాయాలు మరోవైపు.. 20 నిమిషాల అదనపు సమయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు తమకు అదనపు సమయం కలిసొచ్చిందని చెబితే.. మరికొందరు దానివల్ల ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. కెమిస్ట్రీలో 4–5 ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాసేవిగా ఉన్నాయని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఈసారి కటాఫ్ తగ్గొచ్చు.. గతేడాది ఎక్కువ మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించగా ఈసారి ఆ సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో కొత్తగా మ్యాచింగ్ ప్రశ్నలు, స్టేట్మెంట్ ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు 10–12 వరకు ఉన్నాయి. ఇలా ఇస్తారన్న సమాచారం కూడా విద్యార్థులకు లేకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సరైన సమాధానమేలేదు. బోటనీలో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంది. ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ పరిధి నుంచే వచ్చాయి. అయితే, ఈసారి నీట్ ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉండటంతో గతం కంటే 10 మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశముంది. జనరల్ కటాఫ్ 130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఉల్లాసంగా సాక్షి నీట్ మాక్ టెస్ట్ (పోటోలు)
-
మెడిసినా.. లైట్ తీసుకో ఇప్పుడొద్దు!
సాక్షి బెంగళూరు: మెడికల్ సీట్లంటే ఎంత క్రేజో చెప్పవలసిన పని లేదు. కానీ ఇప్పుడు ముఖచిత్రం మారింది. రాష్ట్రంలో వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌లో చుక్కెదురవుతోంది. ఇప్పటికే నాలుగురౌండ్ల కౌన్సెలింగ్ ముగిసింది. అయినప్పటికీ సీట్లు పూర్తిగా భర్తీ కాలేదు. ప్రభుత్వ కోటా సీట్లపై కూడా విద్యార్థులు నిరాసక్తత చూపుతున్నారు. కారణాలేమిటి ► గతంలో మెడిసిన్ సీట్లకు రాష్ట్రంలో భారీ డిమాండ్ ఉండేది. ఇక్కడ సీట్లు లభించని వారు విదేశాలకు వెళ్లి చదువుకునేవారు. ఎంతో ప్రతిభావంతులైనప్పటికీ వైద్య సీటు పొందాలంటే చాలా కష్టంగా ఉండేది. పోటీ అంత తీవ్రంగా ఉండేది. ► అయితే గతేడాది కోవిడ్ కారణంగా నీట్ పరీక్ష ఆలస్యంగా జరిగింది. సీట్ల పంపిణీ సమయానికి విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్సుల ప్రారంభం మరింత జాప్యం జరిగింది. ► రాష్ట్రంలో 14,305 సీట్లు ఉండగా ఇందులో ఇంకా 2,800 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో దంతవైద్య సీట్లు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది కోవిడ్‌తో పాటు వివిధ కారణాల వల్ల విద్యార్థులకు వైద్య విద్యపై ఆసక్తి సన్నగిల్లింది. భారీగా పెరిగిన ఫీజులు, కోవిడ్ వల్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఈ దుస్థికి కారణమని తెలుస్తోంది. భయపెడుతున్న ఫీజుల భారం ► ప్రతి ఏటా మెడికల్ కాలేజీల్లో 30 శాతం ఫీజు పెంపు జరిగేది. ప్రభుత్వ కోటాలో సీటు పొందినప్పటికీ లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెడిసిన్ సీటు పొందడం జనరల్ కేటగిరీ విద్యార్థులకు భారంగా మారింది. ఇతర వర్గాలవారూ లక్షల్లో ఫీజులను కట్టలేక వేరే కోర్సులను చూసుకుంటున్నారు. ► ఇక డెంటల్ కోర్సు పూర్తి చేసి సొంతంగా క్లినిక్ ప్రారంభించినా చదువుకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో డెంటల్ కోర్సు దండగని చాలామంది భావిస్తున్నారు. -
నీట్–పీజీ ప్రత్యేక కౌన్సిలింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1,456 నీట్–పీజీ–2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్య ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్ణయాన్ని సమర్థించింది. వైద్య విద్యతోపాటు ప్రజారోగ్యంతో సంబంధమున్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ‘‘విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్–పీజీ–2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు’’ అని సూచించింది. -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది. కాగా నీట్ పీజీ-2021 కౌన్సిలింగ్ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడించింది. నీట్ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగాఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్సైట్ nbe.edu.in లో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి:చత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి -
నీట్‌పై రగడ.. మరోసారి హీటెక్కిన తమిళ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్(National Entrance-cum-Eligibility Test or NEET)పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఆమోదించాలని గురువారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. మరోవైపు.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపారు. కానీ, రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరిస్తారు’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని తన ఇంట్లో 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్ తీరు, కేంద్రంపై ఆగ్రహం -
జూన్‌లో నీట్? వచ్చే వారంలో నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: వైద్య సీట్లల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వర్గాలు తెలిపాయి. నీట్ పరీక్ష ద్వారా దేశంలోని 532 మెడికల్ కాలేజీల్లో 83,125 ఎంబీబీఎస్సీట్లు, 313 డెంటల్ కాలేజీల్లో 26,949 బీడీఎస్ సీట్లు, 52,720 ఆయుష్, 525 బీవీఎస్సీ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణలో 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో అదనంగా 8 వైద్య కళాశాలలు రానున్నాయి. వాటిల్లో 1,200 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. మెడికల్ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ కోటా కింద ఆయా అభ్యర్థులకు 10% రిజర్వేషన్ లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌కోటాకు అనుగుణంగా ఈసారి 5,200 మెడికల్ సీట్లు రానున్నాయని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ విద్యాసంస్థలతో పాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. నీట్–2021 పరీక్షకు 15 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా హాజరుకాగా, వీరిలో సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థి ర్యాంకు, కేటగిరీని బట్టి మెడికల్ కాలేజీల్లో సీటు దక్కుతుంది. ఈ పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహిస్తారు. -
మెడిసిన్ విదేశాల్లోనే ఎందుకు?
-
ఇక్కడిలా ఉండబట్టే.. అందరూ అటెళ్తున్నారు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఘటన దేశంలో వైద్యవిద్యపై చర్చకు తెర తీసింది. వేల సంఖ్యలో విద్యార్థులు బయటి దేశాలకు వెళ్తుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. లోపాలను సవరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే మౌలిక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రష్యా సేనలు జరిపిన దాడిలో కర్నాటకు చెందిన నవీన్ అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పంజాబ్‌కి చెందిన మరో విద్యార్థి యుద్ధం కారణంగా సకాలంలో వైద్య సాయం అందక ఉక్రెయిన్‌లోనే ఊపిరి వదిలాడు. మెడిసిన్ చదివేందుకు అక్కడికి వెళ్లిన ఎందరో విద్యార్థులు యుద్ధ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణక్షణం భయంభయంగా గడిపారు. వివాస్పద వ్యాఖ్యలు ఈ సమయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు వివాస్పదమయ్యాయి. విదేశాల్లో మెడిసిన్ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారంటూ ఆయన చేసిన విమర్శలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకంటూ నిప్పును మరింత రాజేశారు. కోట్లు ఖర్చు చేయలేం ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో చనిపోయిన నవీన్ తండ్రి స్పందిస్తూ.. నీట్ 97 శాతం మార్కులు వచ్చినా... ఇక్కడ కోట్లు పెట్టి చదివించలేకే ఉక్రెయిన్ పంపించనంటూ బోరుమన్నారు. దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతేకాదు వైద్య విద్య ఖరీదైనదిగా మారడంతో విదేశాలకు వెళ్లాల్సి వస్తుందంటూ చెబుతున్నాయి. మెడిసన్‌కు సంబంధించి మరింత లోతుల్లోకి వెళితే విస్తగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 2021 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం ఇండియాలో ప్రతీ 1,155 మంది జనాభాకు ఒక డాక్టరు ఉన్నట్టుగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కనీసం ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాలి. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన కనీస ప్రమాణాలకు కూడా ఆమడ దూరంలో నిలిచింది ఇండియా. డిమాండ్ అండ్ సప్లై కనీస ప్రమాణాలు అందుకునేందుకు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నా... మన ప్రభుత్వాలు కొత్త వైద్యులు తయారు చేయడంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం దేశంలో 83 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 16 లక్షల మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. ఖరీదెక్కువ అందుబాటులో ఉన్న మెడిసిన్ సీట్లలో సగానికి పైగా ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వైద్య విద్యకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అనధికారిక ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి కాలేజీలు. ఫలితంగా మెడిసిన్ చదవాలంటే కోట్ల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిభ ఉన్నా కోట్లాది రూపాయల ఫీజులు చెల్లించలేక మన విద్యార్థులు విదేశాలకు తరలిపోతున్నారు. విదేశాలకు వేల సంఖ్యలో తాజా వివరాల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను చదవుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. చైనా (23,000), ఉక్రెయిన్ (18,000), రష్యా (16,500), ఫిలిప్పీన్స్ (15,000), కిర్కిజిస్తాన్ (10,000), జార్షియా (7500), బంగ్లాదేశ్ (5200), పోలాండ్ (4,000), అమెరికా (3000)ల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మనకంటే వెనకబడిన దేశమైన బంగ్లాదేశ్‌కి కూడా మన విద్యార్థులు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఏటేటా పెరుగుతున్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే తప్పని సరిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. గత ఏడేళ్లుగా ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇయర్ల వారీగా పరిశీలిస్తే 2015లో 12,116 మంది 2018లో 21,351 మంది హాజరవగా 2021లో అయితే ఏకంగా 35,774 మంది ఎఫ్ఎంజీఈ పరీక్షలకు కూర్చుకున్నారు. అంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే విదేశాల్లో డాక్టరు పట్టా పుచ్చుకున్న వైద్యుల సంఖ్య మూడింతలు పెరిగింది. తీవ్ర కొరత ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశ జనాభాకు 14 లక్షల మంది డాక్టర్లు అవసరం. కానీ మన దగ్గర రిజిస్ట్రర్ అల్లోపతి డాక్టర్ల సంఖ్య 12 లక్షలుగా ఉంది. అంటే ఇప్పటికీ రెండు లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాక్టర్లలో అత్యధికం నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఈ కొరత మరింత ఎక్కువగా ఉంటుంది. మార్పు మొదలైంది ఇప్పటికైనా కేంద్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా వైద్యుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో వైద్య విద్య ఖరీదైన వ్యవహారం కాకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. ఆ తర్వాత తెలంగాణ సైతం ఇది బాట పట్టింది. - సాక్షి ప్రత్యేకం చదవండి: హైదరాబాద్‌లో మరో మెడికల్ కాలేజీ? ఆనంద్ మహీంద్రా సంచలన ప్రకటన -
నీట్ తేలేదెప్పుడు..? క్లాసులు కదిలేదెప్పుడు..?
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చి రెండు వారాలైనా ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. జాతీయస్థాయి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన నీట్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికీ విడుదల చేయలేదు. వాటిని ఇప్పటికే రాష్ట్రాలకు పంపాల్సి ఉండగా, మరింత ఆలస్యం అవుతోంది. త్వరలో రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారే కానీ, ఎప్పుడనేది స్పష్టత లేదు. దీంతో నీట్ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పలేదు. వాస్తవంగా నీట్ ఫలితాల ప్రకటన సమయంలోనే షెడ్యూల్ వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలని, కానీ ఈ విషయంలో ప్రతీసారి అస్పష్టతే ఉంటోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా గతేడాది వైద్య విద్య ప్రవేశాల్లో జాప్యం జరగ్గా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వైద్య విద్యా సంవత్సరం గందరగోళానికి గురవుతుందని వాపోతున్నారు. నాలుగైదు నెలలు ఆలస్యంగా ప్రవేశాలు ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ఫలితాలు ఈ నెల 1న విడుదలయ్యాయి. అనేకమంది తెలంగాణ విద్యార్థులు నీట్లో అర్హత సాధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రసిద్ధ వైద్య సంస్థల్లోని సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. అందుకోసం ముందుగా జాతీయ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.రెండు విడతల జాతీయ కౌన్సెలింగ్ తర్వాత 15 శాతం సీట్లలో ఏవైనా మిగిలితే వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. వాటిని రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనే నింపుకోవచ్చు. జాతీయస్థాయి కౌన్సెలింగ్ మొదలైన వెంటనే రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తారు. కరోనాకు ముందు సాధారణంగా ఆగస్టులో మెడికల్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యేవి. కరోనా వల్ల గతేడా ది చాలా ఆలస్యంగా తరగతులు మొదలుకాగా, ఈసారి మహమ్మారి తీవ్రత తగ్గినా కూడా మరింత జాప్యం అవుతోంది. త్వరగా కౌన్సెలింగ్ మొదలుపెడితే డిసెంబర్లో తరగతులు ప్రారంభించడానికి వీ లుండేది. అయితే, జనవరిలో ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులెక్కువ.. కరోనా కారణంగా వైద్య విద్యార్థులు చాలావరకు నష్టపోయారు. పది, ఇంటర్ మాదిరిగా ఆపై తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడం కుదరదు. అయితే, వైద్య విద్యార్థుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. 50 శాతం మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. కరోనా వల్ల గతేడాది కాళోజీ వర్సిటీ పరిధిలో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. నేరుగా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి సకాలంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, త్వరగా తరగతులు ప్రారంభించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. -
నీట్ పరీక్ష రాస్తున్న వారిలో బాలికలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిపై అమ్మాయిలు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ పరీక్షను బాలికలే అధిక సంఖ్యలో రాస్తున్నారు. అంతేకాదు ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తున్నారు. 2021–22 సంవ త్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు 15.44 లక్షల మంది హాజరయ్యారు. అందులో 8.63 లక్షల మంది బాలికలే ఉండగా, 6.81 లక్షల మంది బాలురున్నారు. పరీక్షకు హాజౖ రెనవారిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కాగా బాలుర కంటే బాలికలు 1.19 లక్షల మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అత్యధికంగా 4.94 లక్షల మంది బాలికలు అర్హులుగా నిలవగా, 3.75 లక్షల మంది బాలురు అర్హత సాధించారు. 2020లో నిర్వహించిన నీట్ పరీక్షలోనూ బాలికలే ఎక్కువగా అర్హత సాధించారు. అప్పుడు 4.27 లక్షల మంది బాలికలు అర్హులు కాగా, 3.43 లక్షల మంది బాలురు అర్హులుగా తేలారు. మొదటి ర్యాంకు ముగ్గురిలో ఒకరు బాలిక తాజా నీట్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు సమానంగా అంటే 720 మార్కులకు 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులను సాధించారు. అయితే అందులో తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి నంబర్ వన్ స్థానం సాధించినట్లు ప్రకటించారు. ముగ్గురికీ సమానంగా ఒకే ర్యాంకు, ఒకే మార్కు వచ్చినప్పుడు వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని నంబర్ వన్ స్థానాన్ని ప్రకటిస్తారు. అయితే మొదటి ర్యాంకు సాధించిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్తీక్ జి.నాయర్ (బాలిక) కూడా ఉండటం గమనార్హం 2021–22 నీట్‌లోబాలురు, బాలికల సంఖ్య అంశం బాలురు బాలికలు దరఖాస్తు 7,10,979 9,03,782 హాజరు 6,81,168 8,63,093 అర్హత 3,75,260 4,94,806 కష్టపడే తత్వం ఎక్కువ మెడికల్ సీటు సాధించాలన్నా, ఆ తర్వాత దాన్ని కష్టపడి చదవాలన్నా, వైద్య వృత్తిలో రాణించాలన్నా ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. బాగా కష్టపడేవారికే మెడికల్ సీటు వస్తుంది. ఈ తత్వం బాలికల్లోనే ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచీ బాలికలే వైద్య విద్యపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ఫలితాలు కూడా సాధిస్తుంటారు. మేము ఇస్తున్న నీట్ కోచింగ్‌ల్లో కూడా 60 నుంచి 70 శాతం మంది బాలికలే ఉంటున్నారు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలు, హైదరాబాద్ -
నిట్‌లోని 750 సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో చేరడానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించిన తొలి రౌండ్లోనే నిట్‌లో ఉన్న 750 సీట్లు అయిపోయాయి. ఇక్కడ చేరడానికి అంగీకారం వ్యక్తం చేస్తూ 750 మంది ఆప్షన్‌ను ఇచ్చారు. ఈ వివరాలను బుధవారం రాత్రి నిట్ అధికారులు వెల్లడించారు. నిట్‌లో మొత్తం సీట్లు 750 ఉండగా, ఆరు రౌండ్లలో ఈ సీట్లను ఆప్షన్‌గా ఎంచుకొనే అవకాశం ఉంది. తొలిరౌండ్ బుధవారం సాయంత్రానికే సీట్లు పూర్తయ్యాయి. సీట్ల ఎంపికలో మూడు ఆప్షన్లు ఉంటాయి. ఫ్రీజింగ్ (ఇన్స్టిట్యూట్లో చేరడానికి పూర్తిగా అంగీకారం తెలిపి సీటును రిజర్వు చేసుకోవడం), స్లైడింగ్ (ఇన్స్టిట్యూట్లో సీటు తీసుకోవడానికి అంగీకారం తెలిపి, బ్రాంచ్ మార్చుకొనే అవకాశం ఎంచుకోవడం), ఫ్లోటింగ్ (ఇన్స్టిట్యూట్ మార్చుకొనే అవకాశం ఎంపిక చేసుకోవడం) వంటివి ఉన్నాయి. ఎంత మంది ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నారనే విషయం గురువారం తెలియనుంది. -
నీట్–పీజీ కౌన్సెలింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా నీట్–పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రస్తుత(2021–22) విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్/బీడీఎస్, ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీకి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పలువురు ‘నీట్’ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీబీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర సర్కారు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చేవరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టబోమని వెల్లడించారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాతో చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. మెడికల్, డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లు, పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద ఉంటాయి. ఈ సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ ఉత్తర్వుల ప్రకారం నీట్–పీజీ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. -
సీఎం వైఎస్ జగన్‌తో తమిళ ఎంపీల భేటీ
సాక్షి, అమరావతి: తమిళనాడు ఎంపీలు సోమవారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం నిర్వహిస్తున్న ‘నీట్’ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ రాసిన లేఖను సీఎం జగన్‌కు ఎంపీలు అందించారు. సీఎంను కలిసిన వారిలో చెన్నై ఉత్తరం ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి, రాజ్యసభ ఎంపీ ఇళంగోవన్ ఉన్నారు. ‘నీట్’ అడ్మిషన్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలల ప్రవేశాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనికోసమే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నాయకుడు స్టాలిన్ లేఖ రాసినట్లు తమిళనాడు ఎంపీలు.. సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. -
ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితి విధించారు ?
న్యూఢిల్లీ: నీట్ ప్రవేశాల్లో వైద్య విద్య కోర్సుల్లో చేరే ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు రూ.8 లక్షల వార్షిక ఆదాయం పరిమితిని కేంద్రం విధించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితిని వర్తింపజేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌గా పరిగణిస్తామనడంపై అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలకు కోర్టు సూచించింది. నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ను ఆధారంగా చేసుకుని ఆదాయ పరిమితిని నిర్ణయించామని, ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘వేర్వేరు రాష్ట్రాలు, పట్టణాల్లో జీవన వ్యయాలు వేరుగా ఉంటాయి. యూపీలోని చిన్న పట్టణాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువ. అలాంటపుడు ఒకే రకమైన ఆదాయ పరిమితిని ఎలా విధిస్తారు? కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పి తప్పించుకోలేరు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు వార్షిక ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
జేఈఈ, నీట్ కోర్సులు: అమెజాన్‌తో చేతులు కలిపిన శ్రీ చైతన్య
న్యూఢిల్లీ: అమెజాన్ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్ ఆన్లైన్ తరగతులు బోధిస్తారు. అమెజాన్ అకాడెమీ రూపొందించిన బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి దాకా కంటెం ట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమోల్ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య గ్రూప్) డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. చదవండి : సిద్ధాంత్‌కు సీటివ్వండి! -
NEET: బయాలజీ చాలా సులువు.. కెమిస్ట్రీ కఠినం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్ష తెలంగాణలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని వైద్య విద్య నిపుణులు వెల్లడించారు. అందరికీ మార్కులు తగ్గే అవకాశముందన్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్ష సులువుగా ఉండగా, అప్పట్లో 720 మార్కులకుగాను, 700కుపైగా మార్కులు సాధించినవారు చాలామంది ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య చాలావరకు తగ్గే అవకాశముంది. గతేడాది నీట్ ఆలిండియాస్థాయిలో 625 మార్కులకు 10వేల ర్యాంకు రాగా, 2019లో 560 మార్కులకు, 2018లో 540 మార్కులకు ఈ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో గతేడాది జనరల్ కేటగిరీలో 497 మార్కులు వచ్చినవారికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఈసారి 470 నుంచి 480 మార్కులకు వచ్చే అవకాశముంది. 130 మార్కులొస్తే అర్హత! ఇక బయాలజీ పేపర్ చాలా సులువుగా ఉంది. అన్ని ప్రశ్నలూ సులువుగానే ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం కొంచెం కఠినంగానే ఉంది. ప్రశ్నతోపాటు అన్ని జవాబులను కూడా జాగ్రత్తగా చదివి సమాధానం రాయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫిజిక్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ కఠినంగానే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్స్ సుదీర్ఘంగా ఉన్నాయి. 45 ప్రశ్నల్లో 30 నుంచి 35 వరకు ఎక్కువమంది చేయగలిగేలా ఉన్నాయి. 10 నుంచి 15 ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులకు సమయం సరిపోలేదు. టాప్ 10 ర్యాంకులు సాధించగలిగే విద్యార్థులు మాత్రమే మొత్తం ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 147 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 113 అర్హత మార్కుగా ఉంది. 2019లో జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 134గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో ఇది 107గా ఉంది. ఈసారి జనరల్ కేటగిరీలో 130 మార్కులొస్తే అర్హత సాధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 105 మార్కులు ఉండే అవకాశముంది. 112 కేంద్రాల్లో పరీక్ష నీట్ పరీక్షను రాష్ట్రంలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరైనట్లు చెప్పారు. కరోనా జాగ్రత్తలు, పరీక్ష నిబంధనల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడినా ప్రశాంతంగానే జరిగినట్లు చెబుతున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో నీట్ పరీక్షపై నిఘా పెట్టారు. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సీసీటీవీల ద్వారా నిఘా ఉంచారు. కాగా, ‘నీట్’కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 95 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి దుబాయ్, కువైట్‌లోనూ ఈ పరీక్ష నిర్వహించారు. ఫిజిక్స్ కఠినం బాటనీ, జువాలజీ సులువుగా ఉన్నా, కొన్ని ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. జువాలజీలోని ఒక ప్రశ్న మినహా అన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉన్నాయి. చాలా ప్రశ్నలు మెమరీ ఆధారంగా ఉన్నాయి. కాన్సెప్ట్ ప్రశ్నలు చాలా తక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. అన్ని ప్రశ్నలూ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు అత్యంత సమీపంగా ఆప్షన్లు ఇచ్చారు. ఐదు నుంచి పది ప్రశ్నల వరకు కఠినంగా ఉన్నాయి. మూడు ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఫిజిక్స్ పేపర్ కఠినంగా, సుదీర్ఘంగా ఉంది. సాధారణ విద్యార్థులకు సమయం సరిపోలేదు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య కాలేజీ, కూకట్పల్లి మధ్యస్థంగా ప్రశ్నలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ పేపర్లలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. బయాలజీ సులువుగా ఉంది. మొత్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. నాకు 650 నుంచి 670 మార్కులు వచ్చే అవకాశముంది. – రోహన్ కృష్ణ వడ్లమూడి, విద్యార్థి, హైదరాబాద్ -
NEET Exam: బూట్లు వద్దు.. చెప్పులే వేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కఠిన నిబంధనలు, కరోనా జాగ్రత్తల నడుమ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వచ్చే నెల 12న నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు బూట్లు ధరించకూడదని ఎన్టీఏ ప్రకటించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించరు. ప్రధానంగా పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థులకు కఠినమైన నిబంధనలను అమలుచేస్తున్నారు. హెయిర్ పిన్ను, తాయత్తు ఏదీ వద్దు.. విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్టు సైజు ఫొటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్ కార్డు వంటివి తీసుకెళ్లొచ్చు. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు తప్పనిసరి. వాటర్ బాటిల్, 50 మి.లీ. శానిటైజర్ బాటిల్ తీసుకువెళ్లొచ్చు. ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఆభరణాలు ధరించకూడదు. ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిపోగులు, ముక్కు పోగులు, చైన్, నెక్లెస్, లాకెట్లు, బ్యాడ్జ్ మొదలైనవి పెట్టుకొని రాకూడదు. కాగితాల ముక్కలు, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పర్సు, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, పెన్ డ్రైవ్‌లు, రబ్బరు, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ మొదలైనవి వెంటతీసుకొని రాకూడదు. ఫోన్, బ్లూటూత్, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్, చేతి గడియారం, కెమెరా లాంటివి ఏవీ తీసుకెళ్లొద్దు. అలాగే వాలెట్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, హెయిర్పిన్లు, హెయిర్ బ్యాండ్, తాయెత్తులు పెట్టుకొని రావొద్దని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అడ్మిట్ కార్డు ట్యాంపరింగ్ చేయకూడదు.. సెప్టెంబర్ 12న ఆఫ్‌లైన్ మోడ్‌లో 11 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ మేరకు వచ్చే నెల 9న neet.nta.nic.in లో అడ్మిట్ కార్డు విడుదల చేస్తారు. ఈసారి దుబాయ్‌లో కూడా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అభ్యర్థులు పరీక్ష హాల్ లోపల ఇతర విద్యార్థులతో మాట్లాడొద్దు. ఎలాంటి అక్రమాలకు సహకరించొద్దు. ►విద్యార్థులు జవాబు బుక్లెట్ నుంచి ఏ పేజీనీ చించకూడదు. ►నీట్ అడ్మిట్‌కార్డు వంటి డాక్యుమెంట్లపై ట్యాంపరింగ్ చేయకూడదు. దరఖా స్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్ కార్డుపై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయరాదు. ►నిబంధనలు పాటించకపోయినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్ చేయడానికి ఆస్కారముంది. ►సంప్రదాయ దుస్తులు తప్పక ధరించాల్సిన అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ►నీట్ పరీక్ష కేంద్రాల్లో మాస్కులు అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక గంటలోపు పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. ►పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్ను ఇస్తారు. ►పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లకూడదు. కేటాయించిన సమయం ముగిసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ►పరీక్ష కేంద్రం వద్ద రద్దీని నివారించేందుకు విద్యార్థులకు నిర్ణీత టైం స్లాట్ కేటాయిస్తారు. ఆ ప్రకారం పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ మేరకు వారికి సమాచారం ఇస్తారు. -
అదే జరిగితే పీహెచ్‌సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
NEET-2021: నీట్ పరీక్ష తేదీ ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను జులై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. The NEET (UG) 2021 will be held on 12th September 2021 across the country following COVID-19 protocols. The application process will begin from 5 pm tomorrow through the NTA website(s). — Dharmendra Pradhan (@dpradhanbjp) July 12, 2021 -
వాళ్లను బలి పశువుల్ని చేయొద్దు: హీరో సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్, కేంద్ర విద్యావ్యవస్థను మరోసారి తప్పుబడుతూ ఒక ప్రకటన విడుదల చేశాడు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ప్రవేశ పరీక్షలు నిర్వహించడం.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతుందని తన అభిప్రాయాన్ని మళ్లీ వెలిబుచ్చాడు. కాబట్టి, అలాంటి ప్రవేశపరీక్షను రద్దు చేయడమే మంచిదని ఆ ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరాడు. వైద్యవిద్యా ప్రవేశాల్లో నీట్ ప్రభావం ఏమేర ఉందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. సూర్య తన అగరమ్ ఫౌండేషన్ తరపున ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు తన ఫౌండేషన్ తరపున ప్రభుత్వ ప్యానెల్‌కు నివేదిక సమర్పించిందని సూర్య ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘‘ఇలాంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానాలు సామాజిక న్యాయానికి విరుద్ధం. స్టూడెంట్స్‌ను బలి పశువుల్ని చేయొద్దు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యావ్యవస్థ తీరుతెన్నులను.. రాష్ట్రాలకే వదిలేయడం మంచిది’’ అని సూర్య ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. நமது கல்வி உரிமை காப்போம்!!#நமது_கல்வி_உரிமை pic.twitter.com/kdfWEpF0rX — Suriya Sivakumar (@Suriya_offl) June 19, 2021 బీజేపీ విమర్శలు కాగా, సూర్య తాజా ప్రకటనపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సినిమాల్లో నటిస్తే చాలని.. సొసైటీలో నటించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ విమర్శల పర్వంలో సూర్యకు ఫ్యాన్స్ సపోర్ట్ దొరుకుతోంది. ఆర్థిక పరిస్థితులు, భాషల ప్రతిపాదికన దేశంలో వేర్వేరు విద్యావిధానాలు అమలు అవుతున్నప్పుడు.. నీట్ తరహా ప్రవేశ పరీక్షలను అమలు చేయడం సరికాదని సూర్య ప్రస్తావించిన పాయింట్‌ను లేవనెత్తుతున్నారు ఫ్యాన్స్. ఇక నీట్ ప్రభావంపై అధ్యయనం కోసం స్టాలిన్ ప్రభుత్వం జస్టిస్ ఏకే రంజన్ నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అభిప్రాయాల్ని neetimpact2021@com కు మెయిల్ చేయాలని ప్యానెల్ కోరింది. చదవండి: నీట్‌పై కామెంట్లు.. చిక్కుల్లో సూర్య! -
గోల్డ్ మెడలిస్ట్.. అతని టార్గెట్ నీట్ విద్యార్థులే!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసిన యువతను టార్గెట్ చేసుకుని..ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసిన హైదరాబాదీ ఆనంద్‌ను భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా కోసం ఇతగాడు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ నిర్వహించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందిన వారూ ఉన్నట్లు తేలింది. దీంతో దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందం మంగళవారం వచ్చివెళ్లింది. బెంగళూరుకు చెందిన అర్వింద్ కుమార్ అలియాస్ ఆనంద్ కుటుంబం నగరంలో స్థిరపడింది. ఓయూ నుంచి ఎంటెక్ గోల్డ్ మెడల్ పొందాడు. ఇండోర్ వెళ్లి కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. అదే సమయంలో నీట్ పరీక్ష రాసిన అనేక మంది సీట్ల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తారని గుర్తించాడు. అలాంటి వారిని మోసం చేయడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ భోపాల్, ఇండోర్, పుణే, బెంగళూరుల్లో కార్యాలయాలు తెరిచాడు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల జాబితాలను సమీకరించే వాడు. తన కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న కాల్‌సెంటర్ల నుంచి ఫోన్లు చేయించి ఎస్ఎమ్మెస్లు పంపి ఆకర్షించేవాడు. రెండేళ్ల క్రితం ఓ నకిలీ వెబ్సైట్ రూపొందించాడు. దీనిలోకి ఎంటర్ అయిన వారి వివరాల ద్వారా అభ్యర్థుల ఫోన్లు చేయించి ప్రైవేట్ వైద్య కళాశాల్లో సీట్లంటూ చెప్పించే వాడు. స్టార్ హోటళ్లలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నమ్మకం కలిగించే వాడు. ఆపై విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్వాన్సుల పేరుతో రూ.లక్ష వరకు వసూలు చేసి మోసం చేసేవాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి మరో మహిళ సహకారం అందించింది. ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఆనంద్‌ను గత బుధవారం పుణేలో పట్టుకుంది. ఇతడి చేతిలో హైదరాబాద్ చెందిన వాళ్లూ మోసపోయినట్లు గుర్తించింది. ఆయా విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు తదుపరి దర్యాప్తు కోసం భోపాల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టీమ్ మంగళవారం వచ్చి వెళ్లింది. వందల మందిని మోసం చేసిన ఈ స్కామ్ రూ.కోట్లలో ఉంటుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
డెంటల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో 7,085 సీట్ల భర్తీకి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నెల 18 వరకు కౌన్సెలింగ్ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దంత వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి నీట్ యూజీ-2020 కనీస మార్కులు తగ్గించాలని, కౌన్సెలింగ్ గడువు పెంచాలని ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వైద్య కళాశాలల అసోసియేషన్లు, 20 ప్రైవేటు కళాశాలలు, కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్‌సింగ్, న్యాయవాది రమేశ్ అల్లంకి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. జనవరి 31 నాటికి కౌన్సెలింగ్ గడువు ముగిసిన తర్వాత కూడా 9 వేల సీట్లకు పైగా భర్తీ కావాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఏపీలో 421, తెలంగాణలో 415 సీట్లు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. వాదనలు విన్న కోర్టు ఈనెల ne4న తీర్పు రిజర్వు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. కేంద్రం వాదన సరిగా లేదు.. 2020-21లో దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కనీస మార్కులు తగ్గించేది లేదని గత డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి విచారణలో తెలిపారు. దేశంలో ప్రతీ 6,080 మందికి ఒక దంత వైద్యుడున్నట్లు కూడా పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘నీట్ ప్రవేశాల్లో ఆయా వర్గాల్లో తగిన సంఖ్యలో అభ్యర్థులు కనీస మార్కులు సాధించడంలో విఫలమైనప్పుడు.. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన కనీస మార్కులను తగ్గించే విచక్షణ కేంద్రానికి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. పర్సంటైల్ మార్కులు తగ్గించాలని గత డిసెంబర్ 28న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే దేశానికి నష్టమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయితే కేంద్రం పర్సంటైల్ మార్కులు తగ్గించడానికి అంగీకరించలేదు. కనీస మార్కులు తగ్గించడం, మొదటి సంఖ్యలో ప్రవేశాలకు పర్సంటైల్ తగ్గించడం అనేది విద్యా ప్రమాణాలను తగ్గించడం కాదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నాం.. కేంద్రం వాదన సరిగా లేదు. ఖాళీగా ఉన్న 7 వేల సీట్లలో 265 మాత్రమే ప్రభుత్వ సీట్లు.. మిగిలినవన్నీ ప్రైవేటు కళాశాలల్లోనివే.. విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రవేశ రుసుము తగ్గించుకోవడానికి ప్రైవేటు దంత వైద్య కళాశాలలు అంగీకరించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెడుతూ.. నీట్-యూజీ కోర్సుల్లో 2020- 2021 ప్రవేశాలకు పర్సంటైల్ మార్కులు 10 శాతం తగ్గిస్తూ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశిస్తున్నాం. జనరల్ కేటగిరీలో 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో 30, దివ్యాంగులు 35 పర్సంటైల్ తెచ్చుకున్న వారిని బీడీఎస్ తొలి సంవత్సరం ప్రవేశానికి పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఈ నెల 18 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాలి. కనీస మార్కులు తగ్గకుండా, ప్రవేశాల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన ఇతర అభ్యర్థులు కూడా బీడీఎస్ కోర్సు ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలి..’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2 లక్షల మందికి చాన్స్.. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మందికి అవకాశం దొరికిందని ఏపీ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గన్ని భాస్కరరావు, ఎల్.కృష్ణప్రసాద్ తెలిపారు. పర్సంటైల్ మార్కులు తగ్గితే సీట్లు వృథా పోవని గుర్తించి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తర్వాత ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు కూడా ముందుకురావడంతో కేసుకు ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. దంత వైద్యుల కొరత దృష్టిలో ఉంచుకొని మార్కులు లేదా పర్సంటైల్ తగ్గించాలని, నిబంధనలు సడలించాలని కోర్టును ఆశ్రయించామని గన్ని భాస్కరరావు పేర్కొన్నారు. -
కౌముదికి రూ.10 లక్షలు చెల్లించండి: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ పీజీలో ఓ విద్యార్థినికి ప్రవేశం నిరాకరించినందుకు గాను రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్‌కు చెందిన కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మోతుకూరి శ్రీయ కౌముది అనే విద్యార్థిని ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్ష రాసి అర్హత సాధించారు. ప్రవేశ అర్హత సాధించిన అనంతరం ఎంఎస్ సర్జన్ కోర్సులో ప్రవేశం నిమిత్తం కళాశాలకు సకాలంలో చేరుకున్నా ఆమెకు సదరు కళాశాల ప్రవేశం నిరాకరించింది. (చదవండి: ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!) దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుకూలంగా తీర్పునిస్తూ తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని కళాశాలను ఆదేశించింది. ఆ తీర్పును నేషనల్ మెడికల్ కమిషన్ సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ‘‘కౌముదికి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పించాలి’’అని తీర్పునిచ్చింది. -
వదులుకున్నారా.. సీటు గోవిందే!
కార్తీక్ (పేరు మార్చాం)కు గతేడాది ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వస్తుంది కాబట్టి రాష్ట్రంలో పేరొందిన కాలేజీల్లో చేరాలనుకున్నాడు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆప్షన్లు చాలా ఇచ్చాడు. ఆప్షన్ల ప్రకారం అతని ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని సుదూర ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. అది నచ్చలేదు. రెండో రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటే నచ్చిన కాలేజీలో సీటొస్తుందని భావించి, మొదటి కౌన్సెలింగ్‌లో సీటొచ్చిన కాలేజీలో చేరలేదు. దురదృష్టం ఏమిటంటే వచ్చిన కాలేజీలో చేరకపోవడంతో, తదుపరి కౌన్సెలింగ్లకు అర్హత కోల్పోయాడు. సాక్షి, హైదరాబాద్: ఎంతో కష్టపడి నీట్లో మంచి ర్యాంకు సాధించి కూడా మెడికల్ సీట్లు కోల్పోతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. సరైన గైడెన్స్, అవగాహన లేక ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఆప్షన్ల ఎంపికలో తప్పిదాలు, సీటొచ్చినా కాలేజీల్లో చేరకపోవడం వంటి కారణాలతో తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోతున్నారు. దీంతో కొందరు కన్వీనర్ కోటా, మరికొందరు జాతీయ స్థాయి కోటా సీట్లు సాధించే సత్తా ఉన్నా ఎంబీబీఎస్‌లో చేరలేకపోతున్నారు. అందుకే నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లేకుంటే ప్రతిభావంతులూ నష్టపోతారని అధికారులు అంటున్నారు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేటపుడే ర్యాంకు, సీటొచ్చే అవకాశం ఉన్న కాలేజీలను అంచనా వేసుకొని ఆప్షన్లు పెట్టుకోవాలి. ఒకవేళ తొలి కౌన్సెలింగ్‌లో అనుకున్న కాలేజీలో సీటు రాకపోతే దాన్ని వదిలేసుకోకూడదు. ఆప్షన్లు ఇచ్చిన వాటిలో సీటొచ్చిన కాలేజీలో ముందుగా చేరిపోవాలి. అప్పుడే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులవుతారు. తదుపరి కౌన్సెలింగ్‌లో సీటొచ్చాక అంతకుముందు చేరిన మెడికల్ సీటును వదిలేసుకొని ఇష్టమైన కాలేజీలో చేరవచ్చు. అలా చేయడం వల్ల అంతకుముందు చేరిన కాలేజీ కూడా చెల్లించిన ఫీజును తిరిగిచ్చేస్తుంది. అందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. సీటొచ్చిన కాలేజీలో చేరకపోతే, తెలంగాణలో కనీసం ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా సీట్లలో కూడా చేరే అవకాశాన్ని కోల్పోతారు. ఇతర రాష్ట్రాల్లోనే చేరడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా మెడికల్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పొరపాట్లు చేయవద్దని, ఆప్షన్లు పెట్టేటప్పుడే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాలని, సంబంధిత కాలేజీకి వెళ్లి పరిశీలించుకోవాలని వర్సిటీ సూచిస్తోంది. (ఏపీలో తగ్గిన ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు) జాతీయస్థాయి కౌన్సెలింగ్ ఇలా.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లకు ఆలిండియా స్థాయిలో జరిగే కౌన్సెలింగ్పైనా విద్యార్థులు స్పష్టతతో ఉండాలి. ఆలిండియా మొదటి, రెండో కౌన్సెలింగ్‌ల తర్వాత మిగిలే సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకే వదిలేస్తారు. అలా గతేడాది మన రాష్ట్రానికి 50 సీట్లు వెనక్కి వచ్చాయి. ఈసారీ అదే మేరకు వచ్చే అవకాశముంది. ఇక ఆలిండియా స్థాయిలో సీటొచ్చిన విద్యార్థులు, తమకు సంబంధిత రాష్ట్రంలోని కాలేజీ నచ్చకపోతే దాన్ని వదిలేసుకునేందుకు అవకాశమిస్తారు. అప్పుడు ఆ సీటును వదిలేసుకొని తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అందుకోసం ప్రతీ రౌండ్ కౌన్సెలింగ్‌కు నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎంపిక చేసుకున్న కాలేజీలో చేరాక, దాన్ని వదులుకోవాల్సి వస్తే కొంత జరిమానా చెల్లించాలి. కొన్ని జాతీయస్థాయి కాలేజీల్లో ముందే అడ్వాన్స్ ఫీజు కట్టించుకుంటారు. దాన్ని తిరిగివ్వరు. డీమ్డ్ వర్సిటీలైతే సీటు వదులుకుంటే రూ.2 లక్షలు వసూలు చేస్తాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్‌కు తాజా ధ్రువీకరణ తప్పనిసరి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్లు పొందే విద్యార్థులు ఏప్రిల్ 1 తర్వాత తహసీల్దార్ జారీచేసిన ధ్రువీకరణపత్రం పొందాలి. గతేడాది ధ్రువీకరణ సమర్పిస్తే సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో గతేడాది మాదిరే ఈసారీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేంద్రం 190 సీట్లను గాంధీ, కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయించింది. వీటిలో 95 మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయిస్తారు. మిగిలిన సీట్లను రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండేందుకు ఇతర కేటగిరీ రిజర్వేషన్లలో సర్దుబాటు చేస్తారు. ఇదిలావుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటాను కేటాయించలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ సూచిస్తోంది. విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి అన్ రిజర్వుడు సీట్లు: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లపై స్థానికులకు అధికారం ఉంటుంది. అయితే 15 శాతం సీట్లను అన్ రిజర్వుడుగా ఉంచుతారు. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులెవరైనా తమ ర్యాంకు ఆధారంగా సీటు పొందొచ్చు. మిగిలిన సీట్లను స్థానికులకే కేటాయిస్తారు. ఇక ప్రైవేట్ మెడికల్ సీట్లలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా తదుపరి ఏడాదికి సంబంధించిన ఫీజు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. మాప్ అప్ రౌండ్: అన్ని కౌన్సెలింగ్‌లు అయిపోయాక చివరగా మిగిలిన సీట్లన్నింటినీ అక్కడకు వచ్చిన వారికి ర్యాంకు ప్రకారం అప్పటికప్పుడు ఇవ్వడమే మాప్ అప్ రౌండ్. ఎక్కడైనా చేరినవారు మాప్ అప్ రౌండ్‌కు అనర్హులనే విధానం గతంలో ఉండేది. కానీ దాన్నిప్పుడు ఎత్తేశారు. ఆప్షన్లే కీలకం మెడికల్ ప్రవేశాల్లో పాల్గొనే విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకునేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పు చేస్తే ఇబ్బందులు పడతారు. ఆప్షన్లు పెట్టుకున్నాక సీటొచ్చిన కాలేజీల్లో చేరకపోతే, తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో చేరకుండా సీట్లను బ్లాక్ చేయడం వల్ల సమస్యలు వస్తుండటంతో ఈ నిబంధన తెచ్చాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్ల భర్తీ, రిజర్వేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతాయి. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వైస్‌చాన్సలర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (ఖరీదైన వైద్యానికీ ఆరోగ్యశ్రీ వర్తింపు) -
వారి కోసం 14న నీట్ నిర్వహణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్‌కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. -
జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. విలువైన విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వలేమని, కరోనా వైరస్ ఉన్నప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. (3 కోట్లు దాటిన పరీక్షలు) ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జేఈఈ పరీక్ష సెప్టెంబరు 1 –6 తేదీల్లో, నీట్ పరీక్ష అదే నెల 13వ తేదీన జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా వీటిని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదకొండు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని తమ పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశాలపై జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్‌ను దీర్ఘకాలం డోలాయమానంలో ఉంచలేమని వ్యాఖ్యానించారు. దీంతో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబరులోనే జరిగేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని, పరీక్షల వాయిదాతో తమకు సాంత్వన చేకూరుతుందని లక్షల మంది విద్యార్థులు సుప్రీంకోర్టువైపు చూస్తున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ, నీట్ నిర్వహించడం పిటిషన్దారులతోపాటు లక్షలాది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడమే. మరికొంత కాలం వేచి చూడటం మేలైన పని. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాతే పరీక్షలు నిర్వహించాలి’’అని ఆ పిటిషన్లో కోరారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఈ ఏడాది 161 కేంద్రాల్లో జేఈఈని ఆన్లైన్ పద్ధతిలోనూ, నీట్‌ను ఆఫ్లైన్లోనూ నిర్వహించాలని తీర్మానించిందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్టీఏ జూన్ 22న జరగాల్సిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేసిందని పిటిషన్‌దారులు తెలిపారు. బిహార్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రాష్ట్రాల విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఇదిలా ఉండగా.. ఆయుష్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీని వాయిదా వేయాలని, కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పరీక్ష నిర్వహణ సరికాదని పలువురు డాక్టర్లు సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం కొసమెరుపు. -
టాప్ మోస్ట్ ర్యాంకర్
పరీక్షల్లో ఎన్ని మార్కులైనా రానివ్వండి. ప్రతి మార్కు వెనుక వంద శాతం కష్టం ఉంటుంది! పేపర్–1,పేపర్–2ల వరకే పాసూ ఫెయిలు. ప్రయత్నంలో ప్రతి స్టూడెంట్ ర్యాంకు హోల్డరే. హిమాచల్ ప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు వచ్చాయి. తనూ కుమారి స్టేట్ ఫస్ట్. మార్కుల్లో టాప్ ర్యాంకర్ అని చెప్పడం కాదు. ప్లానింగ్‌లో టాప్ మోస్ట్ ర్యాంకర్ తను!! తనూ కుమారి ‘నీట్’కి ప్రిపేర్ అవుతోంది. మెడిసిన్‌లో సీటుకు ప్రవేశ పరీక్షే.. ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్). ఇంటర్ పాస్ అయి ఉండటం, లేదా ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసి ఉండటం కనీసార్హత. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. తనూ కుమారి ఇంకా అక్కడి వరకు రాలేదు. మొన్న జూన్ 9 నే హిమాచల్ ప్రదేశ్ టెన్త్ ఫలితాలు వచ్చాయి. తనూకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. 700 కి 691 మార్కులు. ఇవన్నీ కాదు ఆమె గొప్ప. ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ప్లానింగ్‌తో నీట్కి రెండేళ్ల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇప్పటి పిల్లలు ఎవరైనా చేసే పనే కదా అని మీకనిపిస్తే తనూ గురించి మరికొంత తెలుసుకోవాలి. (ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా) ట్యూషన్లు, కోచింగ్‌లు ఇష్టం లేని అమ్మాయి తనూ! స్కూల్లో టీచర్లు ఉన్నప్పుడు బయట మళ్లీ ట్యూషన్లు ఎందుకు అని ఆమెతో ఎవరూ అనలేదు. తనకే అనిపించింది. ‘నీట్’ని కొట్టాలంటే కోచింగ్ ఉండాలి అంటారు. నీట్‌ని కూడా కోచింగ్ లేకుండానే సాధిస్తాను అంటోంది! హిమాచల్‌ప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 22న మొదలై, లాక్‌డౌన్‌కి ముందే మార్చి 19న పూర్తయ్యాయి. పరీక్షలు దగ్గరకొస్తే కానీ పిల్లలకు చదివే మూడ్ రాదు. తనూ మాత్రం ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతున్నట్లే... టెన్త్‌లో తొలి క్లాసు మొదలైన రోజు నుంచే తనని తను ‘ఎగ్జామ్స్ మోడ్’లో ఉంచేసుకుంది! ఏ రోజూ ఆరేడు గంటలు చదవకుండా లేదు. ఏ రోజూ టీచర్లని సందేహాలు అడక్కుండా లేదు. చివరి పరీక్ష ముగిసే వరకు టీచర్లను అడిగి డౌట్స్ తీర్చుకుంటూనే ఉంది. కొన్నిసార్లు ఫోన్లో. కొన్నిసార్లు నేరుగా ఇంటికి వెళ్లి. ఫోన్లో మాట్లాడ్డం కూడా తనూకి వెలితిగా ఉండేది. లౌక్‌డౌన్‌లో ఇప్పుడంతా.. ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. తనూకి అలా ఇష్టం ఉండదు. ‘‘ఎదురుగా టీచర్ లేకపోతే నేర్చుకున్నట్లే ఉండదు’’ అంటుంది తనూ. కాంగ్రాలోని సమ్లోటీలో ఇషాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని తనూ. ఆమెకు స్టేట్ ఫస్ట్ రావడంతో ఆమె తల్లిదండ్రుల్లానే స్కూలు యాజమాన్యమూ పట్టలేని ఆనందంలో ఉంది. కుమారి తండ్రి తిలక్ రాజ్ సేల్స్‌మాన్. తల్లి గృహిణి. తనూ దగ్గరి బంధువుల్లో డాక్టర్లు ఉన్నారు కానీ.. డాక్టర్ అవ్వాలని మాత్రం టెన్త్ పరీక్షలు రాసే నాటికి తనూకి లేదు. కరోనా వచ్చి, వైద్యం ఎంత అవసరమో కళ్ల ముందు కనిపిస్తున్న కొద్దీ ఆమెలో మెడిసిన్ చదవాలన్న కోరిక కలిగి, క్రమంగా బలపడింది. అంతటి ఆర్థిక స్థోమత లేకపోవచ్చు. సాధించగలనన్న ఆత్మస్థయిర్యం ఉంది. ఫ్లానింగ్‌లో టాప్ మోస్ట్ ర్యాంకర్ కదా! -
జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రకటన రేపు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు. -
మైనారిటీ విద్యా సంస్థలకూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా∙గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల వల్ల ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలు స్థూలంగా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించినవని పేర్కొంది. అవి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు ఉద్దేశించినవే కానీ.. ప్రత్యేక హక్కుల మాటున తప్పుడు పరిపాలన విధానాలు అవలంబించేందుకు కాదంది. ‘సేవా ధర్మ భావన నుంచి విద్యను అమ్మకం వస్తువుగా మార్చారు. సంపన్నులకే లభించే వస్తువుగా విద్య మారింది. పేదలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని చదువుకుని, ఆ అప్పులు, వడ్డీలు తీరుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గలుగా ఉండగానే వారిని చిదిమేస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. ‘ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) తెచ్చిన చెడ్డపేరు కారణంగా మొత్తం వైద్య విద్య వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగవలేదు. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది’అని పేర్కొంది. కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి వైద్యులను తయారు చేసిన విషయాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించింది. నీట్’పేర్కొన్న అత్యున్నత నాణ్యత నిబంధనలు పాటిస్తూ సొంతంగా ప్రవేశ పరీక్షలు జరుపుకుంటామని పలు మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
నేటి నుంచి ‘నీట్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2020–21కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దరఖాస్తు విడుదల చేయనుంది. దరఖాస్తులను ఎన్టీఏ.ఏసీ.ఇన్, ఎన్‌టీఏనీట్.ఎన్ఐసీ.ఇన్‌ల్లో పొందవచ్చు. దరఖాస్తులో ప్రత్యక్ష ఫొటోతోపాటు అదనపు పత్రాలూ జోడించాల్సి ఉంటుందని, ఆ మేరకు మార్పులు చేసే అవకాశాలున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎయిమ్స్ ప్రవేశాలూ నీట్ ద్వారానే... 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కాలేజీ ల్లోని ఎంబీబీఎస్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 532 మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 914 ఆయుష్ కాలేజీల్లోని 52,720 సీట్లకు, 313 బీడీఎస్ కాలేజీల్లోని 26,949 సీట్లకు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లకు, రెండు జిప్మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లకు నీట్ ద్వారానే భర్తీ జరుగుతుంది. అన్ని రాష్రాల కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటిస్తుంది. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను 100 శాతం నీట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ, బీ కేటగిరీ సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. గతేడాది రాష్ట్రం నుంచి 48,996 మంది నీట్ రాయగా, 33,044 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. -
మెడికల్ సీటు ఇప్పిస్తానని ‘నీట్’గా మోసం
సాక్షి, పెద్దతిప్పసముద్రం(చిత్తూరు): సైబర్ నేరగాళ్ల గారడి మాటలకు, నకిలీ వెబ్సైట్లకు గ్రామీణ ప్రాంత అమాయకులే కాదు, చదువుకున్న విద్యావంతులు సైతం మోసపోతున్నారు. మండలంలోని టి.సదుం పంచాయతీ ఎరబల్లికి చెందిన రవితేజ అనే విద్యావంతుడు సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షల నగదు జమచేసిన అనంతరం తాను మోసపోయానని గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. పూర్వాపర వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తక్షణం కేసు నమోదు చేయాలని స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లును ఆదేశించారు. జిల్లాలోనే మొట్టమొదటి సైబర్ క్రైం కేసును పీటీఎంలో నమోదుచేశారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎరబల్లికి చెందిన అంకిరెడ్డి వెంకట్రమణ కుమారుడు ఏ.రవితేజ ఇంటర్ పాసయ్యాడు. ‘నీట్’ ఫలితాల్లో 474 మార్కులతో 53 వేల ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ మెహతా (సైబర్ నేరగాడు) ‘ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్’ పేరిట నకిలీ వెబ్ సైట్ సృష్టించి ఆన్లైన్లో పొందుపరిచాడు. అనంతరం రవితేజకు ఫోన్‌చేసి కోల్‌కతా మెడికల్ కళాశాలలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అందులో లేబర్ డిపార్ట్మెంటుకు 22 సీట్లు కేటాయించామని, దరఖాస్తు చేసుకుంటే మేనేజ్మెంటు కోటా ద్వారా సీటు ఇప్పిస్తామని నమ్మబలికాడు. సదరు అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో పంపిస్తున్నామని, బయోడేటా పూర్తిచేసి పంపాలని చెప్పాడు. అనంతరం అప్లికేషన్ అప్రూవల్ అయిందని రూ.45 వేలు చెల్లిస్తే దరఖాస్తు నిర్దారిస్తామని సూచించాడు. గత నెల 13న రవితేజ సొమ్మును ఫోన్‌పే ద్వారా జమ చేసాడు. మళ్లీ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి మెడికల్‌లో సీటు కోసం రూ.9 లక్షలు రెండు విడతలుగా చెల్లించాలని సూచించాడు. మొదటి విడతగా ‘డాక్టర్ సంపత్ కుమార్ శర్మ ఎస్బీఐ ఖాతా నంబర్–1178301818, న్యూ ఢీల్లీ’ పేరిట బి.కొత్తకోట బ్యాంకు ద్వారా రూ.4.50 లక్షల సొమ్ము జమచేసాడు. 14వ తేదీన తిరిగి మళ్లీ ఫోన్‌చేసి మెడికల్ సీటు ఖాయమైందని, మిగిలిన సొమ్ము జమ చేయమన్నాడు. దీంతో రవితేజ కళాశాలకే వచ్చి నగదు చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు. చదవండి : ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు అనంతరం ఢిల్లీకి వెళ్లి ఆరా తీస్తే ఫేక్ ఐడీల ద్వారా సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలు చేస్తుంటారని తెలుసుకున్నాడు. బాధితులు కంగుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, మచిలీపట్నం, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎంతోమంది విద్యావంతులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయినట్లు గుర్తించారు. తాము మోసపోయిన వైనంపై జిల్లా ఎస్పీకి రవితేజ తండ్రి అంకిరెడ్డి వెంకట్రమణ ఫిర్యాదు చేశాడు. -
‘నీట్’ పరీక్షకు రూ.లక్ష రుణం
టీ.నగర్: నీట్ పరీక్ష శిక్షణ కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రూ.లక్ష రుణం తీసుకుని చదివి ఉత్తీర్ణురాలైంది. పెరుంబాక్కం స్లమ్ క్లియరెన్స్ బోర్డు గృహంలో జానకీరామన్ నివసిస్తున్నారు. ఇతను రోడ్డు పక్కన పండ్ల రసం విక్రయిస్తుంటాడు. ఇతనికి నలుగురు కుమార్తెలు. నలుగురిలో రెండో కుమార్తె చారుమతి. ఈమె ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 370 మార్కులు పొంది ఉత్తీర్ణురాలైంది. దీంతో చారుమతికి పుదుక్కోటై ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు లభించింది. ఈమె కేళంబాక్కం ప్రభుత్వ పాఠశాలలో చదివింది. చారుమతి పాఠశాల విద్యలో ఉన్నతంగా రాణించింది. ఇలావుండగా ఆమె మెడిసిన్ చదివేందుకు ఆసక్తి చూపింది. ఈమె ప్లస్‌టూ చదివిన తర్వాత ఒక ఏడాది వేచిచూసింది. నీట్ పరీక్ష రాయాలంటే శిక్షణా సంస్థలో చేరాలి. ఇందుకు ఫీజు చెల్లించే స్థోమత లేకుండా పోయింది. దీంతో రూ. లక్ష రుణం తీసుకుని అడయారులోని శిక్షణ సంస్థలో చదివి ఉత్తీర్ణురాలైంది. -
‘నీట్’ కౌన్సెలింగ్‌కు ఆటంకాలు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు బుధవారం మొదలైన ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. www.mcc.nic.in వెబ్సైట్ మొరాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఆన్లైన్ కౌన్సెలింగ్ మొదలు కావాల్సి ఉండగా, సాయంత్రం వరకు వెబ్సైట్ మొరాయించడంతో ఈ పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించగా, కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్వహిస్తుంది. వెబ్సైట్ మొరాయించడంతో విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశముందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి దాదాపు 36 వేల మంది నీట్ అర్హత సాధించగా, అందులో దాదాపు 3 వేల మంది వరకు అఖిల భారత సీట్లకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశముందని పేర్కొన్నారు. 26న సీట్ల కేటాయింపు జాబితా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం మెడికల్ సీట్లకు, డీమ్డ్, కేంద్ర పరిధిలోని మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లకు అఖిల భారత నీట్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 78 వేల ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 40 వేల సీట్లున్నాయి. వాటిల్లో అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ద్వారా 7 వేల ఎంబీబీఎస్ సీట్లను భర్తీ, 1,000 బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. అందుకు ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. నీట్ అఖిల భారత ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో వివిధ దశలున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం, తర్వాత ఆప్షన్ల ఎంపిక, అనంతరం సీట్ల కేటాయింపు, తర్వాత కేటాయించిన కాలేజీల్లో చేరడం. ఈ నాలుగు దశల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. మొదటి దశ ఈ నెల 24 వరకు నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ర్యాంకు ఇతరత్రా అంశాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకటిస్తారు. దానిద్వారా లాగిన్ అయి విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో సీట్లను ఎంపిక చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు తమ సీటును జూన్ 25న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లాక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు లాక్ చేసుకోలేకపోతే సీటు పోతుంది. అలా లాక్ చేసుకున్నాక మొదటి సీట్ల కేటాయింపు జాబితాను 26న ప్రకటిస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఖాళీగా ఉంటేనే రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. జూలై 6 నుంచి 9 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
నీట్ విద్యార్థులకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికి నీట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు ఆయా వైద్య కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) రద్దు అనంతరం ఏర్పడ్డ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దేశవ్యాప్తంగా ఈడబ్లు్యఎస్ విద్యార్థులకు ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 25 శాతం వరకు సీట్లు పెరగనున్నాయి. వాస్తవానికి.. ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం కోటా మాత్రమే ఉంది. కానీ నియర్ రౌండప్ పేరుతో 100 సీట్లున్న కళాశాలకు అదనంగా మరో 25 నుంచి 50 సీట్ల వరకు పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 1,750 సీట్లు ఉండగా అదనంగా 550 సీట్లు పెరుగుతాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా పెంచిన సీట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పెంచిన సీట్లకు ఏడాది లోపు వసతులు కల్పించే విధంగా కళాశాలలకు అవకాశం ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం (2019–20) నుంచే పెంచిన సీట్లు అమల్లోకి వచ్చేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పెద్ద ఊరట మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 52 వేల మందికి పైగా నీట్ రాస్తే అందులో 39 వేల మందికి పైగా అర్హత సాధించారు. ఒక్కో సీటుకు 22 మందికి పైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 550 సీట్లు రాష్ట్రంలో పెరుగుతుండటంతో నీట్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్లు పెరగడమంటే చాలా కష్టం. అలాంటిది 10 శాతం ఈడబ్లు్యఎస్ కోటా రావడం, దానికి తోడు మరిన్ని సీట్లు పెరుగుతుండటంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్ నాటికి అందుబాటులోకి రావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి వారంలో తొలి విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. జూలై 30 నాటికి చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆర్థికంగా బలహీనవర్గాల కోసం కేటాయించే సీట్లలో ఒకవేళ జాప్యం జరిగితే ఆగస్టులో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడానికి సడలింపు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ప్రతిపాదనలు పంపాం.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన సీట్ల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు పంపినట్లు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ కె.బాబ్జీ చెప్పారు. ఈ ఏడాది నుంచే సీట్ల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, సీట్లు పెరిగిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సమాచారమిస్తామన్నారు. పెరిగిన సీట్లను బట్టి యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో పెరగనున్న సీట్ల వివరాలు.. -
ముక్కు పుడక, గాజులు, చెవి దిద్దులపై అభ్యంతరాలు
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల ఐదో తేదీన జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీ, డెబిట్, క్రెడిట్ కార్డులు సహా చేతికి వాచీ ఉన్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 5న జరగనున్న జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. నీట్ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గుంటూరు నగర, శివార్లలో పరిధిలోని విద్యాసంస్థల్లో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 8,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్, పేపర్ లీకేజీ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చూసే పేరుతో కఠిన నిబంధనలు అమలు పరుస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్ వంటి ఉన్నతస్థాయి వైద్య విద్యాసంస్థలు, రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీటు సాధించాలనే లక్ష్యంతో నీట్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఎన్టీఏ విధించిన నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇలా.. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ నీట్ జరగనుంది. విద్యార్థులను మధ్యాహ్నం 12.30 నుంచి పరీక్ష కేంద్రాల ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 వరకూ పరీక్ష హాల్లోకి పంపిన తర్వాత పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేయాలని ఎన్టీఏ విడుదల చేసిన నీట్ మార్గదర్శకాల్లో పొందుపర్చింది. 1.30 తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులకు ఎన్టీఏ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నీట్ రాసేందుకు సూచనలు చెప్పడం, ఓఎంఆర్ షీట్ పూర్తి చేయించేందుకు అరగంట సమయాన్ని కేటాయించారు. క్షుణ్ణంగా తనిఖీలు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష హాల్లోకి వచ్చిన విద్యార్థులు వారికి కేటాయించిన సీటులో కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి అడ్మిట్ కార్డులో వివరాలను పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విద్యార్థుల వద్ద ఎటువంటి స్లిప్పులు, నిషేధిత సామగ్రి లేవని నిర్ధారించుకున్న తర్వాత 1.45 గంటలకు ఓఎంఆర్ బుక్లెట్లు పంపిణీ చేసి పరీక్ష రాయడంలో సూచనలు ఇస్తారు. తదుపరి 1.50 గంటలకు గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకుని, 1.55 గంటలకు ఓఎంఆర్ షీట్లపై వివరాలను నమోదు చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు ఖచ్చితంగా పరీక్ష ప్రారంభమవుతుంది. తదుపరి సాయంత్రం 5.00 గంటల వరకూ విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. కఠినమైన ఆంక్షలు నీట్‌కు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై ఆంక్షలు విధించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేయనున్నారు. హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీ, డెబిట్, క్రెడిట్ కార్డులు సహా చేతికి వాచీ సైతం ధరించి వచ్చినా అనుమతించరు. ఆఖరుకు వాటర్ బాటిల్స్ సైతం తీసుకురాకూడదు. విద్యార్థినులు చెవులకు రింగులు, చెవి దిద్దులు, ముక్కు పుడక, మెడలో గొలుసులు, నెక్లెస్ వంటి ఆభరణాలతో పాటు జడకు పిన్నులు, క్లిప్స్‌తో రాకూడదు. లేత రంగు వస్త్రాలనే ధరించి రావాలి. పంజాబీ డ్రెస్‌లు లేత రంగులోనే ఉండాలి. హాఫ్ హ్యాండ్స్ కలిగి ఉన్న షర్ట్లు, టాప్లే ధరించాలి. షర్ట్‌లకు పెద్ద, పెద్ద బటన్లతో పాటు స్టిక్కర్లు అతికించి ఉండరాదు. హై హీల్స్ చెప్పులు, బెల్టులు, బూట్లతో వస్తే అనుమతించరు. సాధారణ పాదరక్షలే ధరించాలి. వెబ్సైట్లో మార్గదర్శకాలు నీట్–2019 మార్గదర్శకాల పేరుతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఏం తెచ్చుకోవాలో, వేటిని తీసుకురాకూడదో వివరిస్తూ ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చిన 101 పేజీల ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ప్రత్యేకంగా నాలుగు పేజీల జాబితాలో పేర్కొంది. నీట్–2019 నగర సమన్వయకర్తగా గుంటూరులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వై.రధినీ చౌదరి వ్యవహరిస్తున్నారు. వీటిని వెంట తెచ్చుకోవాలి నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుపై పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించి, మరొక పాస్‌పోర్ట్ సైజు ఫొటో వెంట తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు పెన్నులను పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. సమయం తెలిసేలా పరీక్ష హాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. నీట్ పరీక్ష కేంద్రాలు ఇవే ♦ ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల, చౌడవరం, గుంటూరు శివారు ♦ మలినేని పెరుమాళ్లు విద్యాసంస్థలు, పుల్లడిగుంట, వట్టిచెరుకూరు మండలం ♦ కళ్లం హరనాథ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చౌడవరం, గుంటూరు శివారు ♦ కేకేఆర్ అండ్ కేఎస్సార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వింజనంపాడు, వట్టిచెరుకూరు మండలం ♦ చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లాం, గుంటూరు శివారు ♦ హిందూ ఫార్మసీ కళాశాల, అమరావతి రోడ్డు, గుంటూరు ♦ వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, నంబూరు, పెదకాకాని మండలం ♦ ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, 5వ మైలు, పుల్లడిగుంట, వట్టిచెరుకూరు మండలం ♦ డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్, జేకేసీ కళాశాల రోడ్డు, గుంటూరు ♦ జేకేసీ కళాశాల, గుంటూరు ♦ చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, చౌడవరం, గుంటూరు శివారు -
‘నీట్’ లో జీరో.. అయినా ఎంబీబీఎస్ సీటు..!
న్యూఢిల్లీ : నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో సున్నా, నెగెటీవ్ మార్కులు వచ్చినా దాదాపు 400 మందికి ఎంబీబీఎస్ సీట్లు రావడం ఆందరిని ఆశ్చర్యానికి గురుచేస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో జిరో మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కాలేజిల్లో అడ్మిషన్ లభించడం గమనార్హం. నీట్లో పాస్ అయిన 1990 మందికి 2017లో వైద్య కళాశాల్లలో అడ్మిషన్ లభించింది. వీరిలో 530 మందికి ఫిజిక్స్, కెమెస్ట్రీ, రెండింటిలో కలిపి సింగిల్ డిజిట్, సున్న, నెగిటివ్ మార్కులు మాత్రమే వచ్చాయి. వీరిలో 507 మంది ప్రైవేటు మెడికల్ కళాశాల్లలో అడ్మిషన్ పొందారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర సబ్జెక్టులకు నీట్లో ప్రత్యేకంగా కటాఫ్ లేదు. ఒక్కో పేపర్లో కనీసం ఇన్ని మార్కులు రావాలన్న నిబంధన కూడా లేదు. దీంతో చాలా మందికి జీరో మార్కులు వచ్చినా కూడా సీటు లభించింది. గతంతో ప్రతి సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు రావాలనే నిబంధన ఉండేది. కానీ ఫిబ్రవరి 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఈ నిబంధనలను మారుస్తూ మొత్తం 50 శాతం వస్తే సరిపోతుందని నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం నీట్‌ను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. ఇకపై వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో జేఈఈ–మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. -
తమిళనాట మిన్నంటిన నిరసనలు
చెన్నైః వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించక ఆత్మహత్యకు పాల్పడిన అనితకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. కాలేజ్ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు చెన్నైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అందచేసిన రూ 7 లక్షల చెక్కును అనిత కుటుంబ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వైద్య కళాశాలల్లో నీట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరిలోనూ నిరసనలు మిన్నంటాయి. దీనిపై ఈనెల 8న అఖిలపక్ష బహిరంగ సభను నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. పేద దళిత కుటుంబానికి చెందిన అనిత వైద్య వృత్తిపై మమకారంతో ఇంటర్లో మెరుగైన మార్కులు సాధించింది. నీట్ అడ్మిషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దీన్ని వ్యతిరేకిస్తూ అనిత సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ అయ్యారు.