తమిళనాట మిన్నంటిన నిరసనలు
చెన్నైః వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించక ఆత్మహత్యకు పాల్పడిన అనితకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. కాలేజ్ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు చెన్నైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అందచేసిన రూ 7 లక్షల చెక్కును అనిత కుటుంబ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే.
వైద్య కళాశాలల్లో నీట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరిలోనూ నిరసనలు మిన్నంటాయి. దీనిపై ఈనెల 8న అఖిలపక్ష బహిరంగ సభను నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. పేద దళిత కుటుంబానికి చెందిన అనిత వైద్య వృత్తిపై మమకారంతో ఇంటర్‌లో మెరుగైన మార్కులు సాధించింది. నీట్ అడ్మిషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దీన్ని వ్యతిరేకిస్తూ అనిత సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ అయ్యారు.