నీట్‌ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు | NEET PG admissions: students concern in telangana | Sakshi
Sakshi News home page

నీట్‌ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు

Published Wed, Dec 25 2024 5:56 AM | Last Updated on Wed, Dec 25 2024 5:56 AM

NEET PG admissions: students concern in telangana

జీవోలు 148, 149ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

జనవరి 7న సుప్రీంలో విచారణ  

ఇప్పటికీ మెరిట్‌ లిస్ట్, ర్యాంకు కార్డులను ఇవ్వని కాళోజీ వర్సిటీ

కౌన్సెలింగ్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే ఆలస్యమైన నీట్‌–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్‌లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్‌ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.

తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్‌ రిజిగ్నేషన్‌ పీరియడ్‌ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది.  

ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ  
నీట్‌–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్‌ ఉంటాయి. కన్వినర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.

ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్‌ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్‌ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్‌లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్‌ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్‌ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  

అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ 
రాష్ట్రంలో 2,886 మెడికల్‌ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్‌ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి.  

స్టేట్‌ రౌండ్‌ 1ను ప్రకటించాలి: టీ–జుడా 
అఖిలభారత కోటా మూడో రౌండ్‌ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్‌ న్యూటన్, చైర్‌పర్సన్‌ డి. శ్రీనాథ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్‌ రిజిగ్నేషన్‌ డెడ్‌లైన్‌ పూర్తయ్యేలోపు స్టేట్‌ మొదటి కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్‌ కుమార్‌ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement