
కొమరగుంట యువకుడు హైదరాబాద్‌లో మృతి
అనుమానాస్పద మృతిపై బంధువుల ఆందోళన
కొమరగుంట క్రాస్ వద్ద రోడ్డుపై గ్రామస్తుల బైఠాయింపు
వెదురుకుప్పం : ‘ఐటీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు.. వివాహమై 14 నెలలు అవుతోంది. సంతోషంగా ఉన్నాడనుకున్నాం. అక్కడ ఏం జరిగిందో ఏమో శవమై తిరిగి వచ్చాడంటూ..’ మండలంలోని కొమరగుంట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం మేరకు.. కొమరగుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు జి.మహేష్ (30)కి దామరకుప్పం గ్రామానికి చెందిన గుణవర్ధన్‌రెడ్డి కుమార్తె అనితకు 14 నెలల క్రితం ప్రేమించుకుని పెద్దల ఆమోదంతో వివాహం చేసుకున్నారు.
మహేష్ భార్య అనిత సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం కొమరగుంటలో ఉన్న మహేష్ తండ్రి చంద్రశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా దిగ్బ్రాంతికర సమాచారం అందింది. ఉరి వేసుకుని చనిపోయినట్లు మహేష్ భార్య అనిత కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ సమాచారం అందింన వెంటనే కుప్పకూలిపోయారు. మహే ష్ మృతి చెందడంతో భార్య అనిత అక్కడే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనను పరిశీలించి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి శవపరీక్ష కూడా నిర్వహించారు.
ఆనవాళ్లు లేకుండా చంపేశారు..బంధువుల ఆందోళన
ఘటనకు సంబంధించి కొమరగుంట గ్రామస్తులు మంగళవారం ఉదయం పచ్చికాపల్లం–పెనుమూరు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున భైఠాయించారు. మహేష్‌ను పథకం ప్రకారం ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ధర్నా చేపట్టారు. భార్య అనిత కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ.. అది ఆత్మహత్య కాదు.. హత్యగావించినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మోహరించారు.
ఈసందర్భంగా తమకు న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపైనే భీష్మించుకూర్చున్నారు. పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోలేదు. ఓ దశలో పోలీసులకు ఆందోళన కారులకు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం ఆందోళన చేస్తున్న సమ యంలో శవం రావడంతో స్థానికులు మరింత కోపోద్రిక్తులై ఆందోళనను తీవ్ర తరం చేశారు.
మృతదేహం వెంట భార్య అనిత రాకపోవడంతో అనుమానం మరింత బలమైంది. మృతదేహాన్ని పక్కన పెట్టి నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. ఎట్టకేలకు రెవెన్యూ, పోలీసు శాఖ సమ న్వయంతో మధ్యాహ్నం కొమరగుంట గ్రామస్తులతో చర్చించి అనిత తరపున రావాల్సిన నగదు, బంగారాన్ని ఇచ్చేలా రాజీ కుదర్చడంతో ధర్నాను విరమింప చేశారు. ఈ ఆందోళనలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం కొమరగుంట సమీపంలో మహేష్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైనట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment