
నెల్లూరు యువతిని వివాహం చేసుకున్న ఓ వ్యక్తి
భర్త నిజస్వరూపం తెలిసి పోలీసులకు ఫిర్యాదు
నిందితుడు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు
నెల్లూరు: ఒకతను తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నని నమ్మించి రూ.లక్షల్లో కట్న కానుకులు తీసుకుని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా నటించాడు. అనంతరం భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాని భార్య.. భర్త ప్రవర్తనను నిశితంగా పరిశీలించగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదని యువతుల బ్రోకర్ అని తేలడంతో కన్నీటి పర్యంతమైంది.
పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మెక్లెన్స్ రోడ్డుకు చెందిన ఓ యువతికి ఆమె పెద్దలు మ్యాట్రిమోని ద్వారా వివాహ సంబంధాలు చూస్తుండగా.. విజయవాడ ప్రాంతానికి చెందిన అమీర్‌ఖాన్ పరిచయమాయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాని, నెలకు రూ.80 వేలు జీతమని నమ్మించాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతికి 2023 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అమీర్‌ఖాన్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో యువతి కుటుంబ సభ్యులు రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద ఇచ్చారు. రెండునెలలపాటు వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగింది.
చదవండి: కుటుంబ పరువు కోసం కన్న కూతురినే కడతేర్చిన తండ్రి
ప్రవర్తనలో మార్పు
క్రమంగా అమీర్‌ఖాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. గంటల తరబడి ఒంటరిగా గదిలో ఉంటూ ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఓ రోజు అతను బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆమె రూమ్ శుభ్రం చేస్తుండగా మంచం పక్కనే పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు ఉండటాన్ని గమనించింది. ఒకటి తీసుకుని అందులోని నంబర్లకు కాల్ చేసింది. అవతలి వాళ్లు చెప్పిన మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అనే విషయం బయటపడింది.
దీంతో భర్తను ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన అతను ఆమైపె దాడి చేశాడు. అత్తమామలు, ఆడబిడ్డ సైతం దుర్భాషలాడారు. అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఇటీవల ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధిత మహిళ నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని బోరున విలపించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నని తమను నమ్మించి మోసగించిన భర్త, అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని చిన్నబజార్ ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment