Anita
-
హోం మంత్రి రాకతో పోలీసుల ఓవరాక్షన్
విజయవాడ స్పోర్ట్స్/రామవరప్పాడు: బుడమేరు వరద బాధితులకు సహాయం అందించాల్సిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిన్నకుండిపోయారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వద్దకు హోం మంత్రి అనిత రాగానే ఓవరాక్షన్ చేశారు. బాధితులను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా బారికేడ్లను అడ్డం పెట్టారు. దీంతో పోలీసులపై బాధితులు మండిపడ్డారు.ఇప్పటివరకు పట్టించుకోకుండా.. హోం మంత్రి రాగానే.. చచ్చీ చెడి ఈదుకుంటూ.. వచ్చిన మమ్మల్ని పక్కకు తోసేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ వాళ్లను తీసుకొచ్చేందుకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరిన బాధితులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. కాగా, రామవరప్పాడు ఫ్లై ఓవర్ దిగువ ప్రాంతంలోని ఎస్ఎల్వీ గ్రీన్ మెడాస్లోని విల్లాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ ఎస్ఎల్వీ విల్లాస్‌లో హోం మంత్రి అనితకు చెందిన విల్లాలు కూడా మునిగిపోయాయి. -
Anita Dongre: ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్!
అనితా డోంగ్రే.. ఫ్యాషన్‌తో ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్లకైనా బాగా తెలిసిన పేరు! ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’కి రీచ్ అయిన ఆ త్రెడ్స్ అండ్ నాట్స్ జర్నీ గురించి..అనితా డోంగ్రే.. ముంబై వాసి. సంప్రదాయ సింధీ కుటుంబం ఆమెది. ఇంటి పనులకే జీవితాన్ని అంకితం చేసిన ఆడవాళ్లున్న నేపథ్యంలో పెరిగి.. ఉద్యోగినులుగా, బాసులుగా, పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్న ఆడవాళ్ల మధ్యకు చేరింది. తనింట్లోని స్త్రీల్లా కాకుండా, తాను ఎరిగిన ప్రపంచంలోని మహిళల్లా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ నిశ్చయానికి ప్రేరణ సాధికారిక స్త్రీలే అయినా స్ఫూర్తి మాత్రం అనితా వాళ్ల అమ్మ! తన అయిదుగురు సంతానానికి ఆవిడే బట్టలు కుట్టేది. అవి రెడీమేడ్ దుస్తులకు ఏమాత్రం తీసిపోయేవికావు. పిల్లలు వాటిని స్కూల్లో వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వేసుకెళితే స్నేహితులు, బంధువులంతా ఏ షాప్‌లో కొన్నారంటూ కితాబులిచ్చేవారు. అలాంటి సందర్భాల్లోనే అమ్మ నైపుణ్యానికి మురిసిపోయేది అనితా. వర్కింగ్ విమెన్ని చూశాక.. అమ్మ పనితనాన్ని తనూ అందిపుచ్చుకుని వర్కింగ్ విమెన్‌కి అనువైన దుస్తులను డిజైన్ చేసి ఫ్యాషన్‌ను శాసించాలని కల కన్నది. తొలి అడుగుగా ముంబైలోని ఎస్ఎన్డీటీ (శ్రీమతి నతీబాయీ దామోదర్ ఠాకర్సే) మహిళా యునివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది.యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే తండ్రి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని, రెండు కుట్టుమిషన్లు కొని, సోదరితో కలసి చిన్న బొటిక్ పెట్టింది. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులను కోసం డ్రెసెస్ని డిజైన్ చేసి.. సేల్‌కి పెట్టింది. అనితా సృజనకు ఆమె బొటిక్ ఉన్న కాంప్లెక్స్‌లోని లేడీస్ డ్రెస్ వేర్ షాప్స్ అన్నీ వెలవెలపోసాగాయి. దాంతో ఆ మాల్లోని లేడీస్ ఎంపోరియం షాప్స్ వాళ్లంతా అనితా బొటిక్‌ని అక్కడి నుంచి ఎత్తేయించాలని పట్టుబట్టారు. మాల్ ఓనర్ వాళ్ల డిమాండ్‌కి తలొంచక తప్పలేదు.. అనితా వాళ్లు ఆ మాల్ నుంచి షిఫ్ట్ అవకతప్పలేదు.చేతిలో విద్య ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట.. అనే ధీమాతో మరో చోటును వెదుక్కుంది. కొన్ని నెలలల్లోనే బొటిక్‌ని కాస్త ఏఎన్డీ డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్గా మార్చేసింది. ఇక మిషన్ వీల్ వెనక్కి తిరగలేదు. ఏఎన్డీ లేబుల్ కాస్త ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’గా అవతరించింది. దేశీ, క్యాజువల్, బ్రైడల్, గ్లోబల్ .. దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. అనితా డోంగ్రే డిజైన్డ్ దుస్తులతో ముస్తాబవ్వాలని క్యూ కట్టారు. ఆ వరుసలో మాధురి దీక్షిత్, మలైకా అరోరా, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియంకా చోప్రా, మానుషీ చిల్లర్, కృతి సనన్, ఆలియా భట్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, కాజల్ అగర్వాల్, దియా మిర్జా, శోభిత ధూళిపాళ, రాధికా ఆప్టే, సొనాలీ బెంద్రే, మీరా కపూర్, పూజా హెగ్డే, కరిష్మా కపూర్, రష్మికా మందన్నా, అర్జున్ కపూర్, అయుష్మాన్ ఖురానా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లంతా కనిపిస్తారు.సంప్రదాయ కట్టు, కార్పొరేట్ లుక్, కార్పెట్ వాక్, పార్టీ వేర్.. ఏది కావాలన్నా, ఏ తీరులో మెరవాలన్నా ఏ వర్గం వారైనా కోరుకునే బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’నే! ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు తిరుగులేదు అనే స్థాయికి ఎదిగింది. పింక్ సిటీ పేరుతో జ్యూల్రీ లైన్‌నూ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె దగ్గర మూడు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్స్ ఆమె గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్లు సరే.. పలు ప్రాంతాల్లోని ఎంతోమంది చేనేత కళాకారులకూ పని కల్పిస్తోంది అనితా డోంగ్రే. -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సింహాచలం: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్‌కి రాజధానిని చేశారన్నారు. టాస్క్‌ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై దృష్టి సారిస్తామన్నారు.గంజాయి కారణంగా విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల గుర్తింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. రాత్రి పూట విశాఖలో గుంపులుగా ఉండే వారిపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ నగరంలో 1,700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. డీఅడిక్షన్ కేంద్రాల సంఖ్య పెంచి.. యువతకు, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తామన్నారు. లక్ష్మీనృసింహస్వామి భూముల్ని రక్షిస్తాం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను పరిరక్షిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచగ్రామాల భూసమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇటీవల చీమకుర్తిలో దివ్యాంగురాలి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఐదేళ్లలో ఎవరికీ భయం లేదని, తప్పుచేసిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉండటమే దీనికి కారణమన్నారు. పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు.కొంతమంది పోలీసులూ వైఎస్సార్సీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, లేదంటే తప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై ఎంక్వైరీ వేస్తామన్నారు. మహిళలు, ఆడపిల్లలను చెడుగా చూడటానికి కూడా భయపడేలా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాగా, హోంమంత్రికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవ్రస్తాన్ని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి అందజేశారు. -
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
మా వాళ్లని హీరోల్లా చూపించారు
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న. -
పాయకరావుపేట టికెట్ జనసేనకే.. అనిత పరిస్థితి ఏంటి..!
అనకాపల్లి: టీడీపీ జెండా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని పలువురు ఆశావహులు పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యరి్థగా ప్రచారం అవుతున్న అనితకు మద్దతు ఇచ్చి మళ్లీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడలేమంటూ వారు శనివారం పాయకరావుపేటలో జరిగిన సమావేశంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి జన సమీకరణ చేసి, బలప్రదర్శన చేశారు. కేవలం పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించాలన్న ప్రధాన ఎజెండాతోనే ఈ సమావేశం నిర్వహించారు. జనసేననుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి శివకుమారి, బోడపాటి శివదత్, పెద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటివరకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ఇకనైనా నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు. పార్టీరాష్ట్రకార్యదర్శి, సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచి, తర్వాత జనసేన నాయకులు, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని తెలిపారు. పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో పాయకరావుపేట టికెట్ టీడీపీకే ఇవ్వదలిస్తే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. అనితకు టికెట్ ఇస్తే మాత్రం కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలిపారు. జనసేన కార్యకర్తల అభ్యర్థనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాయకరావుపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీకుమారి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను పర్యటిస్తున్నారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలోను జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. -
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయి..
ఊర్కొండ/ కల్వకుర్తి టౌన్: కుమారుడి పుట్టినరోజు నాడే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, కుమారుడు విగతజీవులుగా మారారు. నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని కల్వకుర్తి పద్మశ్రీ నగర్ కాలనీకి చెందిన టేకులపల్లి వెంకటయ్య(45), అనిత(42) దంపతులకు కుమార్తె అంకిత, కుమారుడు సాయికిరణ్(5) సంతానం. శనివారం సాయికిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఊర్కొండ సమీపంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య, సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిత, అంకిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వెల్దండలోని ఎన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మరణించింది. కుమారుడి కోసమే.. వెంకటయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయిన తర్వాత వారసుడి కోసం వెంకటయ్య అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనితకు సైతం మొదటి కాన్పులో కూతురే పుట్టింది. చాలాకాలానికి సాయికిరణ్ జన్మించాడు. -
అనిత X సంజయ్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్‌ను బరిలో దించాడు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్‌భూషణ్ నమ్మిన బంటు సంజయ్‌ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్ నటి అనితా భట్ సోదరుడు గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోదరుని మరణాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. అనితా ట్వీట్లో రాస్తూ.. 'నిన్న నా గుండె ముక్కలైంది. కార్డియాక్ అరెస్ట్‌తో మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాలేడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. దయచేసి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ పోస్ట్ చేసింది. సోదరునితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అనితా భావోద్వేగానికి లోనైంది. కాగా.. అనితా భట్ 2008లో సైకో అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ లాంటి చిత్రాలలో నటించింది. A piece of my heart tore apart yesterday. My brother left us due to cardiac arrest. No words can explain the pain we are going through and the bitter truth we need to accept is he won't come back. Please bless him to get Sadgati. Need lots of yours blessing now 🙏🏻 pic.twitter.com/Ww9QOs1wog — Anita Bhat (@IamAnitaBhat) April 10, 2023 -
టీడీఫీ ఎమ్మెల్యే అనిత పాదయాత్రకు సొంత పార్టీ నుంచే నిరసన
-
తమిళనాట మిన్నంటిన నిరసనలు
చెన్నైః వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించక ఆత్మహత్యకు పాల్పడిన అనితకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. కాలేజ్ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు చెన్నైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అందచేసిన రూ 7 లక్షల చెక్కును అనిత కుటుంబ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వైద్య కళాశాలల్లో నీట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరిలోనూ నిరసనలు మిన్నంటాయి. దీనిపై ఈనెల 8న అఖిలపక్ష బహిరంగ సభను నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. పేద దళిత కుటుంబానికి చెందిన అనిత వైద్య వృత్తిపై మమకారంతో ఇంటర్లో మెరుగైన మార్కులు సాధించింది. నీట్ అడ్మిషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దీన్ని వ్యతిరేకిస్తూ అనిత సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ అయ్యారు. -
తాగుబోతుకు అత్తింట పరాభవం
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఓ తాగుబోతు కానిస్టేబుల్‌కు గ్రామస్తులు తగ్గిన బుద్ధి చెప్పారు. నిత్యం వేధిస్తుండటంతో దసరా పండుగపూట ఇంటికి పిలిచి దేహశుద్ధి చేశారు. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన కానిస్టేబుల్ అశోక్‌కు ముస్తాబాద్‌కు చెందిన అనితతో రెండు నెలల క్రితమే వివాహం అయింది. పెళ్లయినప్పటి నుంచి అశోక్ నిత్యం తాగివచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై అనిత కుటుంబసభ్యులకు తెలిపింది. మంగళవారం పండుగ అత్తవారింటికి మద్యం మత్తులో వచ్చిన అశోక్‌ను కుటుంబసభ్యులు నిలదీశారు. అతడు ఎదురు తిరగటంతో గ్రామస్తుల సాయంతో స్తంభానికి కట్టేసి భార్య సహా అందరూ అతడిని చితకబాదారు. ఆపైన, గ్రామంలో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. -
మనలో ఒక్కడు కోసం ఏసుదాస్
ఆర్పీ పట్నాయక్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మనలో ఒకడు’. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హీరోయిన్. ఆర్పీనే స్వరకర్త. ఈ నెల 27న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత గానగంధర్వుడు కేజే ఏసుదాస్ మా సినిమాలో ఓ పాట పాడడం ఆనందంగా ఉంది. ఆయన పాడిన ‘కలి కలి కలికాలం..’ పాటను వనమాలి రాశారు’’ అన్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ పాత్రలో ఆర్పీ నటిస్తున్నారు. ఆర్పీ ‘బ్రోకర్’ని మించేలా ఉంటుందీ సినిమా’’ అని జీసీ జగన్మోహన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, పాటలు: వనమాలి, చైతన్యప్రసాద్, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్ధ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రమణ్యం. -
జడ్జి శిక్ష వేశారని.. దోషి సోదరి వీరంగం
మీరట్: ఓ క్రిమినల్ కేసులో తన సోదరుడికి కోర్టు జైలు శిక్ష విధించడంతో ఓ మహిళ తీర్పు చెప్పిన న్యాయమూర్తిని దూషిస్తూ, ఆయన ఛాంబర్లో వీరంగం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు ఆవరణంలో ఈ ఘటన జరిగింది. ఓ క్రిమినల్ కేసులో అనిత అనే మహిళ సోదరుడితో పాటు ఇతర నిందితులను ఇటీవల కోర్టు దోషులుగా ప్రకటించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం అనిత మీరట్ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిని కలిసేందుకు వచ్చింది. జడ్జి ఛాంబర్లోకి అనుమతిలేకుండా వెళ్లిన అనిత జడ్జిని కలవాలని సిబ్బందిని కోరింది. ఓ పేపర్‌పై తన పేరు రాసి విశ్రాంతి గదిలో జడ్జిని కలిసింది. తన సోదరుడికి శిక్ష వేసినందుకు జడ్జిని దూషిస్తూ, వాటర్ బాటిల్‌ను విసిరేసింది. టేబుల్‌పై ఉన్ గ్లాసును పగలగొట్టింది. అనితను అడ్డుకునేందుకు వచ్చిన ఓ మహిళ కానిస్టేబుల్‌పై చైర్ విసరడంతో ఆమె గాయపడింది. అనితపై కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి ఏకే రాణె చెప్పారు. -
భార్యపై భర్త దాష్టీకం
రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీర నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. నాగేశ్ భార్యను అనుమానించటంతోపాటు అదనంగా కట్నం తేవాలంటూ గొడవకు దిగేవాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నాగేశ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..
ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి సూపర్ వాజ్‌మోల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం వంకరకంట గ్రామానికి చెందిన అనిత(20)కు ఇటీవలే పెళ్లి నిశ్ఛయమైంది. ఆ వివాహం యువతికి నచ్చకపోవడంతో.. ఆమె బంధువుల ఇంటికి వచ్చి సూపర్ వాజ్‌మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తమ పెళ్లి విషయం ఇంట్లో తెలుస్తుందన్న భయంతో ఓ యువ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పిల్లల చెరువు గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శ్రీను, అనిత పెద్దలకు చెప్పకుండా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమంటారోనన్న భయంతో ఆదివారం వారు ఇద్దరూ పురుగుల ముందు తాగారు. స్థానికులు గమనించి వారిని నర్సారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
తన భర్తను రెండో పెళ్లి చేసుకుందని...
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను రెండో పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన మొదటి భార్య బంధువులతో కలిసి రెండో భార్యపై దాడి చేసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా సాటి ఆడది అని కూడా చూడకుండా.. చెప్పెలేని చోట వాతలు పెట్టింది. ఇనుప సువ్వలను కాల్చి వాతలు పెట్టి తీవ్రంగా హింసించింది. అనంతరం బంధువులంతా కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాలో సోమవారం వెలుగుచూసింది. తండాకు చెందిన ఆంగోతు రవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు నిర్ణయించిన మేరకు స్వరూపను వివాహమాడాడు. అనంతరం అదే తండాకు చెందిన అనిత(24)ను ఎవరికి తెలియకుండా ఎనిమిది నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పై మొదటి భార్య స్వరూప తల్లిదండ్రులు పలుమార్లు కుల పెద్దల ఎదుట పంచాయితి నిర్వహించారు. అయినా రవి తన తీరు మార్చుకోకపోవడంతో.. ఆగ్రహించిన స్వరూప బంధువులు ఆదివారం రాత్రి అనితపై దాడి చేశారు. కర్రలు ఇనుప సువ్వలతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి అనంతరం ఆమెను వివస్త్రను చేసి తండాలో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాదితురాలని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయండి
బోస్ కుమార్తె అనిత న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు. తద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానన్నారు. జర్మనీలో ఉంటున్న ఆమె వచ్చే నెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనిత వెల్లడించారు. -
చెల్లెలి పెళ్లి ఇష్టం లేక అక్క ఆత్మహత్య
అత్తాపూర్: చెల్లెలు తన అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది అక్క ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జ రిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రేమావతిపేటకు చెందిన అనిత (32) నర్సింగ్‌రావు భార్యాభర్తలు. కాగా అనిత చెల్లెలు జయంతి కొద్ది రోజులగా నర్సింగ్‌రావు అక్క కుమారుడు క్రాంతిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన అనిత చెల్లెల్ని మందలించింది. అయినా వినకుండా ఈనెల 2న జయంతి.. క్రాంతిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని అనిత తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ప్రేమావతిపేటలోని శ్మశాన వాటికలో వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనిత సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకోవాలని ఉంది సారూ..
గొర్రెలకు కాపలాగా వెళుతున్న బాలికల ఆవేదన మెదక్ రూరల్: తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉందని గొర్రెలకు కాపలాగా వెళుతున్న మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన ఇరువురు గిరిజన బాలికలు అనిత, సంగీత వాపోతున్నారు. తమను పెద్దలు గతకొన్నిరోజులుగా చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాజ్‌పల్లి పంటపొలాల్లో జీవాలను మేపుతున్న ఆ బాలికలు సాక్షి ప్రతినిధి కంటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలనే ఉందన్నారు. తండాకు చెందిన లంబాడి హమ్యా లక్ష్మి దంపతులకు సంగీత ఒక్కతే కుమార్తె. ఆమె ప్రస్తుతం రాజ్‌పల్లి ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.సంగీత తండ్రి హమ్య ఇటీవల పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబం గడవటం కష్టంగా మారిందని, చేసేదిలేక తల్లి లక్ష్మి తన కూతురు చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపిస్తోంది. అయితే చదువంటే తనకు ప్రాణమని, ఆర్థిక ఇబ్బందువల్ల తన తల్లి చదువు మాన్పించిందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే చదువుకుంటానని చెబుతోంది. అలాగే ఇదేతండాకు చెందిన మంగ్యా, బీబ్లీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆఖరు సంతానం అనిత ప్రస్తుతం మెదక్‌లోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి తనను చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని అనిత పేర్కొంది. తమకు బాగా చదువుకోవాలని ఉందని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి సంగీత, అనిత తల్లి దండ్రులకు అవగాహన కల్పించి వారిని మళ్లీ బడికి పంపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గర్భిణి నరకయాతన
గండేడ్: ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి మూడు గంటలపాటు నరకయాతన అనుభవిం చింది. రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు అనితకు మంగళవారం రాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో గండేడ్ ఆరోగ్య కేంద్రానికి ఆమెను తీసుకొచ్చారు. తీరా అక్కడికి వచ్చాక ఆస్పత్రికి తాళం వేసి ఉండటం చూసి సిబ్బందికి ఫోన్ చేశారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అంటూ సిబ్బంది దాటవేత సమాధానం చెప్పడమే తప్ప ఆస్పత్రి ఛాయలకు మాత్రం రాలేదు. మూడు గంటలపాటు నరకయాతన అనుభవించిన మహిళ చివరకు ఆటోలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గండేడ్ ఆస్పత్రిలో సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
విభిన్న డిజైన్ ఆభరణాలతో
DESIRE మెరిసిపోయూరు నటి అశ్వని, మోడల్స్. జిగేల్వునే నెక్లెస్‌లు ధరించి అలరించారు. ఈ నెల 22 నుంచి తాజ్‌కృష్ణా హోటల్లో డి జైర్ ఎక్స్పో జరగనుంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ వ్యూక్స్ మీడియా సెంటర్లో సోమవారం విలేకరుల సవూవేశం నిర్వహించారు. 2 రోజుల ఈ ఎక్స్‌పోలో జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు పాల్గొంటారని, అత్యాధునిక దుస్తులు, ఇంటీరియర్స్ ప్రదర్శిస్తారని నిర్వాహకురాలు అనితా అగర్వాల్ తెలిపారు. ఎక్స్పో బ్రోచర్‌ని ఆవిష్కరించారు. సిటీ ప్లస్ -
అనిత.. తొలి అడుగు
దేవరకొండ : చందంపేట మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో 50 కుటుంబాలు ఉంటాయి. సుమారు రెండు వందల మంది జనాభా ఉంటుంది. ఆ చెంచుకాలనీకి చెందిన దాసరి అంజయ్య, ఈదమ్మలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో అనిత పెద్దకూతురు. ఈ కాలనీలో 50 కుటుంబాలున్నప్పటికీ పిల్లల చదువులు మాత్రం సగంలో ఆగిపోతున్నాయి. ఐటీడీఏ వారు ఈ కాలనీలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించేవారు. కుటుంబం గడవని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బడి మానేసి కూలి పనికో.. వలసబాటనో పడుతున్నారు. దీంతో ఆ పాఠశాల కూడా ప్రస్తుతం మూతబడింది. అయితే అనితను పదవ తరగతి వరకు దేవరకొండలోని ఎంబీ హైస్కూల్లో చదివిం చారు. పదో తరగతిలో ఉత్తీర్ణురాలైంది. చెంచులకు రిజర్వేషన్ అమలవుతుండడంతో ఇంటర్ చదివించాలన్న ఆలోచనతో దామరచర్లలోని ఏపీటీడబ్ల్యూఆర్జీ జూనియర్ కళాశాలలో చేర్పించారు. అనిత ఇటీవల ఇంటర్లో ఉత్తీర్ణురాలు కావడంతో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టర్ ఆశయాన్ని నిజం చేసిన అనిత.. 24 ఏళ్ళ క్రితం ఓ కలెక్టర్ కన్న కల నేటికి సాకారమైంది. చెంచులు అడవిలో ఆకులు అలములు తింటూ గడ్డు జీవితాన్ని గడపడాన్ని జీర్ణించుకోలేని అప్పటి కలెక్టర్ తుకారాం (చెంచు) చెంచుల అభ్యున్నతి కోసం ఏదైన చేయాలని తలచారు. చందంపేట అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో చెంచుకాలనీలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, భూమి లేని వారికి భూమి పంపిణీ చేసి వారిలో మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం, నిధుల మంజూరులో అలసత్వం కారణంగా కలెక్టర్ తుకారాం ఆశయం నీరుగారింది. ఈ చెంచుకాలనీలను శ్రీశైలం ఐటీడీఏలో భాగస్వామ్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉపాధి అవకాశాలు లేకపోగా, చెంచులు జీవిత గమనం మళ్ళీ అడవికే చేరింది. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణా చట్టం, విద్యాహక్కు చట్టం వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యంగా మారిందనడానికి అనిత ఉదంతమే ఒక ఉదాహరణ. ఏదేమైనా కలెక్టర్ తుకారాం ఆశయాన్ని నిజం చేసే దిశగా అనిత అడుగులు వేస్తోంది. కాగా టీటీసీ చదవడానికి ఆమె దాతల నుంచి సాయం కోరుతోంది. ఓ వైపు కుటుంబానికి ఆసరాగా.. మరోవైపు లక్ష్యసాధన దిశగా.. ఇంటర్ వరకు చదివిన అనిత పై చదువుల కోసం తపిస్తోంది. ప్రభుత్వ టీచర్ కావాలన్న లక్ష్యంతో టీటీసీ పరీక్షకు హాజరైంది. కానీ తన ర్యాంకుకు ప్రభుత్వ కోటాలో సీటు రాదేమోనని బెంగపెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనిత తన కుటుంబానికి ఆసరాగా కూలి పనిచేస్తుంది. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు శివ కూడా మామిడి మొక్కలు నాటడానికి గోతులు తీసే పనికి వెళ్తున్నారు. ఉద్యోగం చేసి చెల్లెళ్లను చదివిస్తా మా అమ్మనాన్న రోజు కూలి పనిచేసి కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అందుకే నేను బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉన్నాను. ఉద్యోగం చేస్తూ నా ఇద్దరు చెల్లెళ్ళను చదివించాలన్నదే నా కోరిక. ఇప్పుడు చెల్లెలిద్దరిని మోడల్స్కూల్లో చదివిస్తున్నారు. తమ్ముడు చదువు మానేసి అమ్మానాన్నలతో కలిసి కూలి చేస్తుండు. నేను కూడా అప్పుడప్పుడు మా వాళ్ళతో కలిసి ఊళ్లో కూలికెళ్తుంటా. అందరం కష్టపడితేనే ఇళ్లు గడుస్తుంది. ఈ కష్టాలన్నీ తీరాలంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలి. మున్ముందు మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. ప్రభుత్వం చేయూతనిస్తే మా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుంది. - అనిత దరిచేరని పథకాలు.. కాగా, గత 24 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ చెంచుకాలనీలోని వారి అభ్యున్నతి కోసం మౌలిక సదుపాయాలు కల్పించి భూమి లేని వారికి భూమినిచ్చిఆదుకుంది. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులు మాత్రం వారి అభ్యున్నతిని గాలికొదిలేశారు. దీంతో ఆ చెంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది వలసబాట పట్టడంతో కొంతమంది మాత్రమే ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, అంజయ్యకు అప్పటికి వివాహం కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రెండు ఎకరాలకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అంజయ్య, ఈదమ్మలు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు. నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణ చట్టం, విద్యాహక్కుచట్టం వంటి ఎన్నో చట్టాలు అమలుచేసి విద్యను ప్రోత్సహిస్తున్నామని అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. చెంచులు కూడా విద్యాపరంగా అంత ఆసక్తి చూపకపోవడం.. .వారిని చైతన్యం చేయడంలో అధికారులు విఫలమవుతుండడంతో వారి బతుకులు మారడం లేదు.