మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు.
దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్‌పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment