అనితను మార్చాల్సిందే...
Published Thu, Aug 8 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
నక్కపల్లి/పాయకరావుపేట, న్యూస్‌లైన్: పాయకరావుపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించిన అనితను మార్చాల్సిందేనని తెలుగుతమ్ముళ్లు పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 11మంది సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి అనిత వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అనిత నియామకంతో పాయకరావుపేటలో తెలుగుతమ్ముళ్లు రెండుగా చీలిపోయారు.
ఇద్దరు ముఖ్యనేతలు రాజీనామా చేశారు. ఈ దశలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డిరామానాయుడు రాజీ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో అసమ్మతినేతలంతా పార్టీ అధినేతకు ఇక్కడి పరిస్థితిని వివరించారు. మొదటి నుంచి అనిత నియామకాన్ని పాయకరావుపేట మండలంలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం కనిపించింది. పలుగ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మండల మాజీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు గొర్లె రాజబాబు పార్టీ పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఇరువర్గాలను ఏకంచేసి రాజీ కుదిర్చేందుకు రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు మంగళవారం పాయకరావుపేటలో ఒకవర్గం ఏర్పాటుచేసిన కార్యాలయం వద్దకు వచ్చి రెండోవర్గంవారు రమ్మని కబురు పంపారు.అక్కడకు వచ్చేపనిలేదని కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రామానాయుడు రాజబాబు రాజీనామాను ఆమెదించేది లేదని ఆయనపార్టీలోనే కొనసాగుతారంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో రెండో వర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, చింతకాయలరాంబాబు,దేవవరపు వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో పలువురు ఎకాయెకిన బస్సులో మంగళవారం రాత్రి హైదరాబాద్‌వెళ్లారు. బుధవారం ఉదయాన్నే చంద్రబాబును కలిసి గెలుపొందిన సర్పంచ్‌లను పరిచయం చే శారు.
అనంతరం అనితపై ఫిర్యాదు చేశారు. అనిత వ్యవహారం నియోజవర్గంలో పార్టీకి తీరని నష్టం కలుగిస్తోందంటూ వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమికి ఆమె కృషి చేశారని, ఆమె వ్యవహార శైలి బాగాలేదని, తక్షణం మార్చకుంటే తాము పార్టీలో కొనసాగలేమని తేల్చిచెప్పినట్టు బాబును కలిసిన కొందరు నాయకులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. అనిత వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, తొందర పడొద్దని,సమస్యపరిష్కారానికి చర్యలు చేపడతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో పెదిరెడ్డిశ్రీను,దేవవరపుసత్యనారాయణ,లెక్కలగోవిందు సర్పంచ్‌లు చించలపు సన్యాసమ్మ, తదితరులతోపాటు మరో50మంది కార్యకర్తలు, ముఖ్యనాయకులు ఉన్నారు.
Advertisement
Advertisement