నష్టాల బాటలో ఆర్టీసీ
Published Thu, Aug 8 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి.
రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్‌జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్‌స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు.
చాలా బస్సులు రద్దు
తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి.
సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement
Advertisement