Laugh movement
-
ఉన్నతాధికారులపై ఉద్యమం ఒత్తిడి
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభుత్వ ఉన్నతాధికారులపై వత్తిడి పెంచుతోంది. నిన్నటి వరకు ఎస్ బాస్ అన్న దిగువశ్రేణి ఉద్యోగులే ఇప్పుడు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి సమ్మెబాట పట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్య ఉద్యమానికి నడుంకట్టిన సంగతి తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం సమ్మె పేరుతో ఎటువంటి పనులు చక్కబెట్టకుండానే తమ కార్యాయాల్లో కాల క్షేపం చేస్తున్నారు. పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం సమైక్యాంధ్ర ఉద్యమానకి కలిసి రావాలని రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమావేశం జరిగే సమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ వెళ్లి సమ్మెకు రావాలని ఉన్నతాధికారులను కోరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలో ఉన్నతాధికారుల్లో ఉద్యమంపై ఏకాభిప్రాయం కుదరడంలేదని సమాచారం. ఉద్యమానికి మద్దతుగా సమ్మె బాట పట్టాలని కొందరంటే, సంఘీభావం ప్రకటిస్తే చాలని ఇంకొందరు, ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే ఉద్యోగ సదస్సుకు మద్దతు పలకాలని ఇంకొందరు ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. పలు శాఖలకు జిల్లా అధిపతులుగా ఉన్నందున ఉద్యమబాట పడితే ఎలా అంటూ మరికొందరు అధికారులు అధికార పార్టీకి విశ్వాసపాత్రులుగా గుర్తింపుపొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం. సమావేశం గురించి తెలుసుకున్న ఎస్సీ జె.ప్రభాకరరావు ఉద్యోగుల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకు మహారాష్ట్రకు చెందిన స్పెషల్ (సీఆర్పీఎఫ్) పోలీసులను కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం మోహరిం చారు. సమ్మెకు వెళ్లేందుకు ససెమిరా అంటున్న ఉన్నతాధికారులు, సమైక్య ఉద్యమానికి బాసటగా ఉండాలని కోరుతున్న దిగువస్థాయి ఉద్యోగుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇబ్బందులు తప్పవనుకున్న ఉన్నతాధికారులు మచిలీపట్నంలో కాకుండా విజయవాడలో తమ విధులు నిర్వర్తించేందుకు తరలివెళ్లినట్టు సమాచారం. ఉద్యోగుల వివాదాలకు అవకాశం ఉందని భావించిన ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ఇందిరా క్రాంతి పథం(మెప్మా) డెరైక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ను విజయవాడకు ఆఘమేఘాలపై మార్పు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉపాధ్యాయులు బహిష్కరించారు. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులు ఆయా ఆందోళన కార్యక్రమల్లోన్లే ప్రత్యేకంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరిం చడం విశేషం. బందరులో సమైక్య వాదులు నిర్వహించిన గురుపూజోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, మాదివాడ రాము తదితర వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
ధర్మఘోష
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 34వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు మెడలో తగిలించుకుని ప్రదర్శన చేశారు. ఎన్జీవో, మెడికల్ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, వాణిజ్య పన్నులశాఖ, మున్సిపల్ జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డ్వామా ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధర్మవరంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. వేలాది మంది సమైక్యవాదుల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో వైద్య సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. చిలమత్తూరులో పూసల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. ఆదర్శ రైతులు రిలే దీక్షలకు దిగారు. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అమడగూరు మండలం మహమ్మదాబాద్ హైస్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కదిరి డివిజన్ జర్నలిస్టులు క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతిలో శవపేటికలో సోనియా దిష్టిబొమ్మ ఊరేగించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర ఎన్పీకుంటకు చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2-కే రన్లో వేలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు. మడకశిరలో దేవుళ్ల చిత్రపటాలతో నిరసన ప్రదర్శన చేశారు. అమరాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఓడీ చెరువులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తచెరువులో రెడ్డ్డి సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, పుట్టపర్తిలో అంగన్వాడీ మహిళలు రిలే దీక్షలు చేశారు. పెనుకొండలో కార్మికులు నిరసన ప్రదర్శన, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గోరంట్లలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, శాంతి హోమం చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్, డీలర్లు పాల్గొన్నారు. వివిధ సంఘాల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో రజకులు ర్యాలీ చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నెలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో కళాశాల ఉద్యోగుల ర్యాలీలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విభజన అనివార్యమైతే... రాయల తెలంగాణ కోరుకోవడం తప్పుకాదని ఆయన అన్నారు. ఇదే పట్టణంలో మున్సిపల్, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఉరవకొండలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. -
ఉయ్యూరులో లక్ష గళ ఘోష విజయవంతం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం 32వ రోజూ ఉధృతంగా సాగింది. శనివారం వినూత్న పద్ధతుల్లో సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తామని నొక్కివక్కాణించారు. ఉయ్యూరులో నిర్వహించిన లక్ష గళ ఘోష కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా హాజరైన ప్రజలతో ఉయ్యూరు జన సంద్రమైంది. సంపూర్ణ బంద్ విజయవంతమైంది. తిరువూరులో సమైక్య జనగళఘోష నిర్వహించారు. పెద్ద ఎత్తున సమైక్యవాదులు రోడ్డుపైకి వచ్చి రాష్ట్రం ఐక్యంగా ఉండాలని నినదించారు. కార్యాలయాలు, దుకాణాలు బంద్ చేశారు. కైకలూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో గళ ఘోష కార్యక్రమం జరిగింది. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రేషన్ డీలర్లు దీక్షలు చేపట్టారు. కలిదిండి మండలంలో రోడ్డుపై వీఆర్వోలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో బంద్ నిర్వహించి రోడ్లపై ఆటలు ఆడారు. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందంటూ నూజీవీడులో విద్యార్థులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. జగ్గయ్యపేటలో రేషన్ డీలర్లు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాము భిక్షాటనే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో ఆరువేల మందితో ప్రదర్శన నిర్వహించి సమైక్య గర్జన చేశారు. ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడులో గ్రామస్తులు ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ మహిళా వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మందితో లలితా సహస్రనామ కార్యక్రమం జరిగింది. జననేత జగన్‌కు మద్దతుగా.. రాష్ట్ర విభజన చేయకూడదంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలువురు నాయకులు, కార్యకర్తలు దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావుల నాలుగోరోజు దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 10 మంది బందరు రోడ్డుపై రిలే నిరాహారదీక్షలు నిర్వహించగా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వారిని పరామర్శించారు. సాయంత్రం రాధాకృష్ణ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. నూజివీడులో ఐదోరోజు రిలేదీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. గుడివాడలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ పేరిట పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు. -
చంద్రబాబువే చీకటి ఒప్పందాలు : కల్పన
పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబువన్నీ చీకటి ఒప్పందాలేనని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన విమర్శించారు. రాత్రివేళ కేంద్రమంత్రి చిదంబరాన్ని కలుస్తూ, పగటివేళ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షను బలవంతంగా భగ్నం చేసినంత మాత్రాన రాష్ట్ర విభజనపై తమ పార్టీ అభిప్రాయం, నిర్ణయంలో మార్పు ఉండదనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జైలులోనే జననేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయన దీక్షపై ఎల్లో మీడియా దుష్ర్పచారారం చేస్తోందని విమర్శించారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి దీక్షలను విమర్శించే అర్హత రెండుకళ్ల సిద్ధాంతం ప్రదర్శించే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలకు లేదని ఎద్దేవాచేశారు. వర్లా... నిజాలు తెలుసుకుని మాట్లాడు వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, భారతి బెంగళురు నుంచి ఢిల్లీకి వెళ్లారని విమర్శించిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు ఢిల్లీ వెళ్లడం చూశావా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యవాదివి అయితే రాష్ట్ర విభజన వద్దంటూ చంద్రబాబుతో ప్రకటన చేయించాలని వర్లను డిమాండ్‌చేశారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి, షర్మిలపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. వర్లరామయ్య జిల్లాలో ఉద్యోగం చేసిన సమయంలో ఎంతటి నీతి, నిజాయితీగా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవాచేశారు. విజయమ్మపై విమర్శలుచేసిన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తంచేశార. దొంగనాటకాలు మానుకోవాలని హితవు పలికారు. పామర్రు ఉపసర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్ మోరా రాజారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ముత్తేవి ప్రసాద్, కుంపటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతటా రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణం, పల్లె తేడా లేకుండా హోరెత్తిపోయింది. పాతిక రోజులవుతున్నా ఉద్యమకారుల దీక్ష సడలడం లేదు. మరో వైపు గుంటూరులోని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసనగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పలు చోట్ల బంద్ నిర్వహించాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులూ దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెదబయలు మండల కేంద్రంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులు మూడు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ మూడు రోడ్ల కూడలిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు థింసా నృత్యం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నర్సీపట్నంలో నిర్వహించిన నమూనా అసెంబ్లీ ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితర నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. ఎన్నడూ లేని రీతిలో అనకాపల్లి పట్టణాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. పట్టణంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లోనూ రాళ్లు, వాహానాలను అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసేశారు. పట్టణమంతా బోసిపోయింది. అత్యవసర సేవలయిన మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మాత్రం వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సాగిన ఆందోళనకు స్టూడెంట్ జేఏసీ, ఎన్జీవోలు నేతృత్వం వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ నేతలు బంద్ నిర్వహించారు. ఉపాధ్యాయ, న్యాయవాదుల సంఘాలతో పాటు వైఎస్సార్సీపీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. పాడేరు పాత బస్టాండ్‌లో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమశాఖ డీడీ మల్లికార్జునరెడ్డి వారికి మద్దతు తెలిపారు. విజయమ్మ దీక్ష భగ్నానికి నిరసనగా పాడేరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సత్యవేణి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. లగిశపల్లి నుంచి పాడేరు వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏయూలో విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పౌరసరఫరాల శాఖ సిబ్బంది బీచ్‌రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాయకరావుపేటలో విద్యుత్ జేఏసీ రాస్తారోకో నిర్వహించారు. నక్కపల్లిలో మోకాళ్ల ప్రదర్శన ద్వారా ఉద్యమ కారులు తమ నిరసన వ్యక్తం చేశారు. చోడవరంలో మానవహారాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చోడవరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కశింకోట జాతీయ రహదారిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. -
విజయమ్మ దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ జనాగ్రహం
సాక్షి, విజయవాడ : సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్నినిరసిస్తూ శని వారం ఆ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైంది. మచిలీపట్నంలో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం తెలిపారు. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో బంద్ పాటించారు. బ్యాంకులు, పెట్రోలు బంకులను మూయించారు. నియోజకవర్గంలో ఆ పార్టీ మరో సమన్వయకర్త వాకా వాసుదేవరావు విజయమ్మ దీక్షలకు మద్దతుగా గత ఐదు రోజులుగా పెడనలో చేపట్టిన రిలేదీక్షలు మధ్యాహ్నం విరమించారు. కైకలూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయమ్మకు మద్దతుగా శనివారం బంద్ పెద్ద ఎత్తున జరిగింది. విద్యాసంస్థలు, దుకాణాలను మూయించారు. భారీగా ర్యాలీ చేపట్టి ఏలూరు రోడ్డు కూడలి వద్ద విజ్ఞాన్ కళాశాల విద్యార్థులతో కలసి మానవహారం, రాస్తారోకో చేపట్టారు. పామర్రులో ధర్నా.. విజయమ్మ దీక్ష భగ్నం చేసినందుకు నిరసనగా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోరుతూ ఒక పార్టీ అధ్యక్షురాలు చేపట్టిన దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. తోట్లవల్లూరు, కూచిపూడి, పమిడిముక్కల మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. విజయమ్మకు మద్దతుగా పెనమలురు నియోజకవర్గంలో బంద్ జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు పడమట సురేష్‌బాబు పెనమలూరు, కంకిపాడు సెంటర్లలో ర్యాలీలు నిర్వహించి షాపులు మాయించగా, తాతినేని పద్మావతి పెనమలూరులో బంద్ చేయించారు. విజయవాడ రూరల్ మండలం నున్నలో బంద్ నిర్వహించారు. షాపులు, పాఠశాలలు మూసివేశారు. బ్యాంకులు పని చేయలేదు. మైలవరంలో బైక్ ర్యాలీ.. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గ పరిధిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మరో సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ఇబ్రహీంపట్నం నుంచి ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు సహకరించాల్సిందిగా వాణిజ్య, వ్యాపార సంస్థలను కోరారు. నందిగామ పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో బంద్‌తో పాటు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. జగ్గయ్యపేటలో యూత్ నాయకులు బైక్‌లపై ర్యాలీ నిర్వహించి దుకాణాలు, కార్యాలయాలు మూసివేయించారు. పెనుగంచిప్రోలులో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి రాస్తారోకో చేశారు. ముండ్లపాడు గ్రామంలో పార్టీ మండల కన్వీనర్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయించారు. తిరువూరు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. తిరువూరులో పార్టీ మండల కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ నిర్వహించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడలోని వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. -
218 బడులు మూత
సాక్షి, విశాఖపట్నం: సర్కారీ స్కూళ్లకు అప్రకటిత సెలవులొచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు సమ్మెబాటతో ఈ పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాటికి జిల్లాలోని 218 స్కూళ్లు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన చోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. విద్యాశాఖ లెక్కల మేరకే 8,400(52 శాతం) మంది సమ్మెబాట పట్టారు. ఈ సంఖ్య పదివేల పైమాటే అని ఉపాధ్యాయ సంఘాల సమాచారం. శనివారం నుంచి ఎస్టీయూ సమ్మెకు పిలుపిస్తుండగా మరికొన్ని సంఘాలు ఇదేబాటలో ఉన్నాయి. మూసివేత దిశగా మరికొన్ని... జిల్లాలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ప్రాథమిక పాఠశాలలు 2,616, ప్రాథమికోన్నత పాఠశాలలు 351 ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో జిల్లా పరిషత్ యాజమాన్యంలో 247, మున్సిపాలిటీ పరిధిలో 27, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి 132 వరకు ఉన్నాయి. ఎయిడెడ్ యాజమాన్యంలో 52 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 26 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 16,106 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10 వేల మంది శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టారు. కొన్ని సంఘాల నేతలు సమైక్య సమ్మెకు వ్యతిరేకంగా ఫోన్ మెసేజ్‌లు విస్తృతంగా పంపినా ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. సంఘాలతో పనిలేకుండానే సమ్మెబాట పట్టారు. దీంతో 218 స్కూళ్లు పూర్తిగా తెరుచుకోలేదు. సమ్మెను వ్యతిరేకిస్తున్న సంఘాల్లో మండల ప్రధాన ప్రతినిధుల్లో కొందరు మాత్రం స్కూళ్లకు వె ళ్తున్నారు. సగం సిబ్బంది కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తెరిచిన పాఠశాలల్లో కూడా సక్రమంగా తరగతులు జరగడం లేదు. శనివారం, సోమవారం నాటికి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వసతి గృహాల సిబ్బంది సమ్మె బాట జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలకు సమైక్య సెగ తాకింది. నాలుగో తరగతి సిబ్బం ది కూడా శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టా రు. దీంతో వసతి గృహాలు మూతపడనున్నా యి. గురువారం నుంచి వార్డెన్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాలుగో తరగతి సిబ్బంది సమ్మె నోటీసు అందించారు. జిల్లావ్యాప్తంగా 79 ఎస్సీ వసతిగృహాలలో 5,500 మంది, 68 బీసీ వసతి గృహాలలో 6420 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగో తరగతి సిబ్బంది సమ్మె కారణంగా శుక్రవారం నుంచి విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. బీసీ హాస్టళ్లలో 136 మంది, ఎస్సీ హాస్టళ్లలో 137 మంది నాలుగో తరగతి సిబ్బంది సమ్మె లోకి వెళ్లనున్నారు. కాగా, ఎస్సీ వసతి గృహాలలో వంద మంది, బీసీ వసతి గృహాలలో పదిమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దూరంగా ఉన్నారు. జిల్లాలోని 15 ఎస్సీ, 16 బీసీ కళాశాల వసతి గృహాలు కూడా శనివారం మూతపడనున్నాయి. వీటి వార్డెన్లు కూడా సమ్మెబాట పడుతున్నారు. నేటి నుంచి సంక్షేమ అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సంక్షేమ అధికారులు సమ్మెకు దిగారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.అప్పారావు తెలిపారు. -
గురోద్యమం...
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపు తెచ్చేందుకు గురువులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రైవేటు కాన్వెంట్లు, కాలేజీలు సమైక్యాంధ్రకు మద్దతుగా సెలవులు ప్రకటించాయి. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొద్దిరోజులుగా వరుసగా ర్యాలీలు, మానవహారాలు తదితర నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాపితంగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపుతో జిల్లాలోని ప్రభుత్వ బడులు గురువారం నుంచి మూతపడనున్నాయి. పీఆర్టీయూ, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, తెలుగునాడు టీచర్స్ ఫెడరేషన్, బహుజన టీచర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు సమైక్యాంధ్ర ఉద్యమాలకు మద్దతుగా ఈ నెల 22 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లా అంతటా గురువారం నుంచే పాఠశాలలు మూసివేయాలని పిలుపునివ్వగా, జిల్లా కేంద్రమైన బందరు మున్సిపాలిటీలో ఈ నెల 24 నుంచి పాఠశాలల బంద్ పాటించాలని ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయించింది. బందరులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు అనుకూలంగా రాకపోవడంతో పాఠశాలల బంద్‌ను రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విభేదిస్తున్న పలు సంఘాలు.. జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా వాటిలో 16 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాటిలో 440 ఉన్నత, 600 ప్రాథమికోన్నత, 2,300 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సమ్మె పిలుపును కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్నాయి. దీంతో కొన్ని పాఠశాలలు మూతపడితే మరికొన్ని తెరుచుకునే అవకాశముందని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు సహకరించాలని సీమాంధ్ర (13 జిల్లాల) ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్ మత్తి కమలాకర్ కోరారు. విభేదించిన సంఘాలతోను ఏకాభిప్రాయం సాధించేదిశగా చర్చిస్తున్నట్టు ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నేతృత్వంలో మిగిలిన సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకటి రెండు రోజుల్లో సమ్మె బాట పట్టేలా చొరవతీసుకుంటామని తెలిపారు. సమ్మెలో తాము పాలుపంచుకుంటున్నట్టు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రియాజ్ హుస్సేన్ చెప్పారు. సమ్మెకు దూరం.. సంఘీభావం తెలుపుతాం ఉపాధ్యాయ సమ్మెకు తాము వెళ్లడంలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేఏ ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాంతాలవారీ ఉద్యమాలకు దూరంగా ఉండాలన్న తమ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గతంలో తెలంగాణ, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన వివరించారు. మిగిలిన సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినా ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్)లో ఉండే ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలకు వెళతారని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెకు తమ సంఘం దూరంగా ఉండాలన్ని నిర్ణయం తీసుకుందని, అయినా తమ వంతుగా సమ్మెకు సంఘీభావం తెలుపుతామని ఉమామహేశ్వరరావు చెప్పారు. పరిశీలిస్తాం : డీఈవో జిల్లాలో ఉపాధ్యాయ సమ్మె ప్రభావం, ముందస్తు చర్యల గురించి ఇప్పుడే చెప్పలేమని, సమ్మె మొదలైన తరువాత అందుకు సంబంధించిన చర్యలపై పరిశీలిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి చెప్పారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు వెళుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. సమ్మె మొదలయ్యాక ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. -
అష్టదిగ్బంధం
సమైక్యాంధ్ర పరిరక్షణ పోరు జిల్లాలో హోరెత్తుతోంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాలో రహదారులను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్మించారు. దీంతో జిల్లా అంతటా రోడ్లపై ట్రాఫిక్ గంటలతరబడి నిలిచిపోయింది. రైతులు, న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృత్తి కార్మికులు, మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం కోసం ఊరూవాడా ఏకమైంది. ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. రహదారులపై భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. కైకలూరు తాలుకా సెంటర్ వద్ద ఉద్యోగులు పామర్రు-కత్తిపూడి 14వ నంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. గంటకుపైగా రహదారిపై ఆందోళన చేశారు. జగ్గయ్యపేటలో అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగ, ఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం చేశారు. మహిళా ఉద్యోగులు ఆటలు ఆడగా, విద్యార్థులు నృత్యాలు చేశారు. జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. తేలప్రోలులో ఉషారామా ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. జాతీయరహదారిపై కబడ్డీ ఆడి వినూత్న నిరసన తెలిపారు. మైలవరం జాతీయ రహదారిలోని తెలుగు తల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు. బస్సులతో నిరసన ప్రదర్శన.. తిరువూరులో ఉపాధ్యాయులు, సమైక్య జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుడివాడలో నాలుగు వైపులా రోడ్లు పూర్తిగా మూసేసి రాస్తారోకో చేపట్టారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. 200 ఎడ్లబళ్లతో.. ఉయ్యూరులో రైతులు కేసీపీ కర్మాగారం నుంచి వీరమ్మ తల్లి ఆలయం వరకు 200 ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన సెంటర్లో బళ్లతో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ రోడ్డు వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ నేతృత్వంలో ఉద్యోగులు, కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి మండలం మూలలంకలో విద్యార్థుల ర్యాలీ, గుర్వాయిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. వత్సవాయిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గ్రామస్తులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వ్యాపారులు మైలవరంలో ర్యాలీ నిర్వహించారు. విస్సన్నపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో, ప్రదర్శన, రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడ నెహ్రూచౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగుతోంది. న్యాయవాదులు మునిసిపల్ కార్యాలయం ఎదుట కోర్టు నిర్వహించి నిరసన తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగుల వంటావార్పు.. మచిలీపట్నంలో న్యాయశాఖ ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి తెలుగు తల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు. ఇబ్రహీంపట్నం సెంటర్లో టైలర్లు జాతీయ రహదారిపై మిషన్లతో బట్టలు కుట్టి నిరసన తెలిపారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో వ్యవసాయశాఖ అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. కంకిపాడులో వస్త్ర, కిరాణా మర్చంట్స్, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. దుకాణదారులు రోడ్డుపై క్రికెట్ ఆడి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఉయ్యూరులో కటింగ్ సెలూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు రిలేదీక్షలు చేపట్టారు. పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో పెడన ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్ష చేశారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాం ప్రసాద్ సంఘీభావం తెలిపారు. రహదారుల దిగ్బంధంతో పాటు బంటుమిల్లిలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. కంచికచర్లలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై కేఆర్‌బీ విద్యార్థినులు రాస్తారోకో, మానవహారం నిర్మించారు. జాతీయ రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేశారు. కంచికచర్ల చెరువుకట్ట వద్ద జాతీయ రహదారిపై ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి, కబడ్డీ ఆడారు. నూజివీడులో ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జనరల్ బాడీ ఆధ్వర్యంలో చిన్న గాంధీబొమ్మ సెంటర్లో వంటావార్పు చేశారు. విజయవాడలో పోరు హోరు.. విజయవాడలో ఉద్యమం హోరెత్తింది. విజయవాడలో రామవరప్పాడు రింగ్, గొల్లపూడి, బెంజిసర్కిల్ వద్ద రోడ్లను దిగ్బంధం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష జరిపారు. న్యాయవిభాగం సిబ్బంది కోర్టుల ప్రాంగణానికి తాళాలు వేశారు. కోర్టు బయట బెంచీలు వేసి మాక్ కోర్టు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. పాత ప్రభుత్వాస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది భారీ ర్యాలీ జరిపారు. ఇరిగేషన్ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. -
పోరాట ప్రభంజనం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తుండగా తాజాగా ఉన్నతాధికారులు సైతం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా మిగిలిన అన్ని శాఖల ఉన్నతాధికారులు సైతం ఉద్యమ బాట పట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఉన్నతాధికారులు కూడా ఉద్యమిస్తుండడంతో అత్యవసర పనులు కూడా నిలిచిపోనున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు సైతం సమైక్యాంధ్ర కోసం కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా ఉన్నతాధికారులంతా ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ డి.వెంకటరెడ్డి, డీఆర్డీఏ పీడీ మహేశ్వరరెడ్డి, డీఎస్ఓ జ్వాలాప్రకాష్, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ షరీఫ్, డీపీఆర్ఓ బాబ్జీ, ఇతర ఉన్నతాధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో వైపు మంగళవారం నుంచి నగర పరిధిలోని ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రహదారుల దిగ్బంధం : మంగళవారం రహదారుల దిగ్బంధం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉదయం 7 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వందల మంది ఉద్యోగులు చేరుకొని కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న తరువాత హైవేను దిగ్బంధించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జాతీయ రహదారిలో ఎటువంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపచేయాలని భావిస్తున్నాయి. 21 బహిరంగ సభ : ఈ నెల 21 ఉదయం 11 గంటలకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభను నిర్వహించడానికి ఏపీఎన్జీఓలు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులతో జరిగే ఈ సభకు ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నంలో కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉద్యమం ఉగ్రరూపం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కాంక్షిస్తూ ప్రజానీకం చేస్తున్న ఉద్యమం రోజు రోజుకీ మహోగ్రరూపం దాలుస్తోంది. ఈ పోరులో తుది గెలుపు సాధించే వరకూ విశ్రమించే లేదని ఉద్యమ వీరులు సైనికుల్లా సాగుతున్నారు. ప్రభుత్వ పాలనతో పాటు ప్రజా జీవనం కూడా స్తంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళనలు, నిరసనలతో ఇప్పటికే జిల్లా హోరెత్తుతుంటే తాజాగా ఏపీఎన్జీవోలు మరింత ఉధృతానికి నిర్ణయించారు. ఈ నెల19న అన్ని ఉద్యోగ సంఘాలతో దాదాపుగా 10 వేల మందితో మహా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు రిలే నిరాహారదీక్షలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా వచ్చే నెల 2 తరువాత ఏ క్షణానైనా సమ్మెకు వెళ్లే అవకాశముంది. వారు సమ్మెకు దిగితే జిల్లా అంధకారంలోకి వెళ్లిపోనుంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరోవైపు ఎంసెట్ కౌన్సింగ్పై కూడా ఈ సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియకు జాప్యం జరిగింది. తాజాగా కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైనప్పటికీ విద్యార్థులకు ధ్రువపత్రాలు మంజూరు చేసే తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. సబ్బవరంలో విద్యార్థులు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూడురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేపట్టారు. ఉద్యమానికి సంఘీభావంగా పాయకరావుపేటలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు, తుని ఆర్టీసీ డిపో ఉద్యోగులు బస్సులతో భారీ ర్యాలీతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. -
పోరు మాని పోజులు!
సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా రగిలిపోతోంది. ఉద్యోగ సంఘాల సమ్మె బాటతో పాలన స్తంభించింది. రూ.కోట్లు నష్టం వస్తున్నా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. పదహారు రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం మద్దతుకే పరిమితమవుతున్నారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఒకటి రెండు రోజులు వచ్చి ఫొటోలకు పోజులివ్వడం మినహా.. ప్రత్యక్ష ఉద్యమానికి దిగడం లేదు. దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడప్పుడు కనిపించి వెళ్లడం తప్ప ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీక్ష, ధర్నా, ర్యాలీలు చేస్తున్న వారి శిబిరాలకు ఎమ్మెల్యేలు రావడం, మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పడం, పత్రికల కోసం ఫొటోలు దిగడం, అనంతరం వెళ్లిపోవడం మినహా చేసేదేమీ ఉండడం లేదని విమర్శిస్తున్నారు. ఒకవైపు సమైక్యాంధ్ర అంటూనే మరోవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామనడం వారి చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. పీఎన్జీవోలు సమ్మెకు దిగి పాలనను స్తంభింపచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. అంటే ఉద్యమం తీవ్రత రెట్టింపవుతోంది. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష పోరాటానికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. రాజీనామాలు చేశారా! : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జిల్లాలో ఉద్యమం పెల్లుబికింది. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాకు ఒత్తిడి తీవ్రమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు మినహా మిగిలినవారంతా రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్‌కు చేరాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వపరమైన సౌకర్యాలను పొందుతున్నారు. ప్రభుత్వ వాహనాలతో పాటు సెక్యూరిటీ కూడా కొనసాగుతోంది. దీంతో వీరు నిజంగా రాజీనామాలు చేశారా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించకపోగా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సమైక్యవాదులలో వేరు కుంపట్లు పెట్టేలా ప్రేరేపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో మూడు శిబిరాల వెనుక ఓ మంత్రి ‘హస్తం’ ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి బాలరాజు తీరుపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా రాజీనామా చేయకపోవడంతో పాటు చేయమని అడిగిన ఉపాధ్యాయ సంఘాలపై ఒంటికాలిపై లేవడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. -
కాంగ్రెస్, టీడీపీకి ఎన్జీవోల భయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను భయపెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు కార్యాలయాలు, పాఠశాలలకు తాళాలు వేసి ఉద్యమంలోకి దిగడం ఈ పార్టీల నేతలను మరింతగా కలవరపెడుతోంది. ఎన్జీవోలు, టీచర్లకు దూరమైతే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవన్న భయం ఇప్పుడు వీరిని వెంటాడుతోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, టీచర్లు వంటి వారి ఆగ్రహానికి కారణమైనందునే చంద్రబాబు నాయుడు 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారనే భావన తెలుగుదేశం నేతలు, క్యాడర్లో ఉంది. వస్తున్నా మీ కోసం యాత్ర చేపట్టిన చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని పలుచోట్ల అంగీకరించి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి తాను తిరిగి అధికారంలోకి వస్తే బాగా చూస్తానని, పలు సదుపాయాలు కల్పిస్తానని హామీలు గుప్పించారు. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఉద్యోగ అనుకూల విధానాలు వారిలో విశ్వాసాన్ని పెంచాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రె స్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఎన్జీవోలు తమవంతు సహకారాన్ని అందించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయేదీ తామే అన్న భావనతో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఉద్యమాన్ని వారు ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమన్న నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా వీరు పలు పార్టీల అధినేతలను స్వయంగా కలసి విన్నవించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్జీవోలకు సానుకూల స్పందన రాలేదు. విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చంద్రబాబునాయుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఏపీ ఎన్జీవో నేతలను బాగా నిరాశపరిచింది. దానికి తగ్గట్టుగానే చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎన్జీవోల ఉద్యమంలోనూ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు పెద్దగా పాల్గొనడం లేదు. కాంగ్రెస్‌కు చెందిన తిరుపతి ఎంపీ చింతామోహన్ తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని గట్టిగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమన్నట్లుగా ఆయన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. తిరుపతిలో తెలుగుదేశం నేతలెవరూ సమైక్య ఉద్యమాల్లో పాల్గొనడం లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పార్టీ నేతల వైఖరి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ పార్టీ నేతల వైఖరి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఎన్జీవో సంఘాల నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు దూరమైతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్, తెలుగుదేశం కిందిస్థాయి నేతలు భయపడుతున్నా ప్రజాప్రతినిధులను మాత్రం ఒప్పించలేకపోతున్నారు. -
మరో పోరాటం
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం స్వాతంత్య్రదిన వేడుకలపై గట్టిగా పడనుంది. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తగ్గే అవకాశముంది, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమబాట పట్టడంతో సందడి లేకపోవచ్చు. అవనిగడ్డ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రచారం లేకుండా వేడుకలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. అందుకే ఆడంబరాలు లేకుండా అత్యంత సాదాసీదాగా వేడుకలను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈసారి ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనకు కూడా అనుమతి లేదు. గత ఏడాది సుమారు రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వ పథకాల గొప్పతనం వివరిస్తూ శకటాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఉపఎన్నిక కారణంగా పథకాల బాకాలు లేకుండానే వేడుకలు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికిచ్చే ప్రశంసాపత్రాల సంఖ్యను కూడా కుదించారు. సుమారు 67 ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు చెందిన వారు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఆగస్టు 15న ప్రశంసాపత్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది దాదాపు 300 మందికి ఉత్తమ సేవా ప్రశంసాపత్రాలను ఇవ్వగా, ఈసారి వాటిని 150కి కుదించారు. ప్రశంసాపత్రానికి విలువ పెంచేందుకే తక్కువమందికి ఇస్తున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.వేడుకల్లో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ప్రసంగంలో సైతం ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పథకాల ప్రస్తావన ఉండదు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత, సమరయోధుల త్యాగం వంటి విషయాలకు మాత్రమే కలెక్టర్ ఉపన్యాసం పరిమితం కానుంది. జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు, బాలల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వేడుకలు నిర్వహిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ ‘సాక్షి’కి చెప్పారు. బుధవారం డీఆర్వో, ఎస్పీ జె.ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఏఎస్పీ షిమోశి బాజ్‌పాయ్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రశంసాపత్రాలకు దూరం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు జాతీయ పతాకానికి వందనం చేయాలని నిర్ణయించారు. ఆయా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేయాలని సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. ఉద్యోగులెవరూ ప్రశంసాపత్రాలను తీసుకోకూడదని పిలుపునిచ్చింది. పతాకావిష్కరణ అనంతరం మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా సమైక్య ఉద్యమంలోకి వెళ్లాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. -
నిరవధిక సమ్మెకు సైరన్
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఏపీ ఎన్జీవో సంఘం పిలుపునిచ్చింది. సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజు కూ ఉధృతమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, టీటీడీ, కార్మిక సంఘాల జేఏసీ సోమ వారం ఉదయం ఇందిరామైదానంలో ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ సమైక్య గళార్చన, సమైక్యాంధ్ర ప్రతిజ్ఞతో సమ్మెకు సైరన్ మోగించనుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ కుటుంబ సభ్యులంతా పాల్గొని సమైక్య గళం వినిపించనున్నారు. నిరవధిక సమ్మె విషయంపై మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.లోకేశ్వర వర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. నేడు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలకు సమ్మె నోటీసులు పంపనున్నట్లు తెలియజేశారు. అయితే పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ సిబ్బందిని సమ్మె నుంచి మినహాయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, న్యాయవాద సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలియజేశాయి. తిరుమలకు బస్సులు నడిపే విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిసింది. సోమవారం ఉదయం మరోసారి టీటీడీ అధికారులు ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొంటున్నట్లు ఆ సంఘం వారు ప్రకటించారు. ఉదయం నుంచి సమైక్య ఉద్యమంలో విస్తృతంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయి. ప్రైవేటు పాఠశాలలు మాత్ర మే మధ్యాహ్నం పూట నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
యువతను ఉత్తేజపరచడానికే సమైక్యగీతాలు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో యు వతను, ఉద్యమకారులను ఉత్తేజపరచడానికే ‘సమైక్య గీతాల’ సీడీని ఆవిష్కరించినట్టు ఇండియన్ బాయ్స్ క్రియేషన్స్ కన్వీనర్ ఎం.హరిప్రసాద్ తెలిపారు. ‘జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర’ పేరుతో రూపొందించిన పాటల సీడీలను శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రజలను ఏ విధం గా చూస్తోంది, ఉద్యమాల ఆవశ్యకత తదితర అంశాల ప్రాతి పదికగా పాటలు రూపొందించినట్టు తెలిపారు. సీడీ రూపకల్పన స్ఫూర్తితో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఉద్యమ దృశ్యాలను డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసి ఢిల్లీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమకారుల ఆవేదన, యువతలోని వేడి ని గుర్తించలేని కాంగ్రెస్ అధిష్టానానికి తమ డాక్యుమెంట రీ ద్వారా తెలియజేస్తామన్నారు. ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో ని వివిధ జేఏసీలు నిర్వహిస్తున్న శిబిరాలకు మాత్రమే ఉచి తంగా పంపిణీ చేస్తున్న పాటల సీడీలను సీమాంధ్రలోని మిగి లిన జిల్లాలకు కూడా పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని చెప్పారు. తాము త్వరలో రూపొందించనున్న డాక్యుమెం టరీకి సమైక్యవాదులెవరైనా సహకరించాలంటే 9652178769 నంబరులో సంప్రదించాలని కోరారు. పాటల సంగీత దర్శకు డు అంబికా సుమన్, ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఎపినేసర్, సభ్యులు రవికాంత్, రాజశేఖర్, అశోక్, విజయ్, మోహన్ పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరం
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. దాదాపు పాలన స్తంభించిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అత్యవసర విభాగాలు తప్పితే మిగతావన్నీ ఉద్యమ బాటలో ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. విద్యార్థులు, న్యాయవాదులు, వ్యాపారులు, వైద్యులు, విద్యుత్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు మూత పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలను ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భారీ వాహనాల రాకపోకలు తగ్గాయి. పెట్రోల్ బంకుల్లో చమురు విక్రయాలు 20 నుంచి 30 శాతం మేరకు తగ్గిపోయాయని జిల్లా పెట్రోల్ బంకుల యజమానుల సంక్షేమ సంఘం కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఉద్యమం తీవ్రతరం కావడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ వాహనాలతోపాటు, ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా తగ్గిపోయాయి. విశాఖ నుంచి తెలంగాణలోని జిల్లాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర సర్వీసులు అధిక సంఖ్యలో నిలిచిపోనున్నాయి. జిల్లా నుంచి తూర్పు గోదావరి కేవలం రాత్రి సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఫలితంగా రీజియన్ పరిధిలో రోజుకి రూ.30 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి బస్సులను నిలిపివేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు తెలిపారు. ఈ ప్రభావం నిత్యావసరాలతో పాటు అన్నింటిపై పడే అవకాశముంది. సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆరా నర్సీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఉద్యమంపై ప్రత్యేకాధికారిగా నియమితులైన అడిషనల్ డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఉమాపతి, ఎస్పీ దుగ్గల్ గురువారం స్థానిక టౌన్ పోలీస్‌స్టేషను సందర్శించారు. పది రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని గమనించి, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అడిషనల్ డీజీ స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. కార్యక్రమంలో ఓఎస్డీ దామోదర్, ఇన్చార్జ్ డీఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు స్థానిక సీఐలు రాజేంద్రకుమార్, ప్రసాదరావులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమం జనహితం
నెత్తురు చుక్క నేల రాలకుండా.. చిన్నపాటి విధ్వంసం జరక్కుండా.. సాగిన మహోన్నత పోరాటాలు చరిత్ర సృష్టించాయి. ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జనహితం కోరుతూ.. శాంతియుతంగా సాగుతున్న తీరు చరిత్ర తిరగరాస్తోంది. బిగిసిన పిడికిళ్లు.. కదిలే అడుగులు.. నినదించే గొంతులు సమైక్యబాట పడుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఉప్పెనలా కదులుతున్నాయి. పట్టణాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన క్వింట్ ఇండియా డేను శుక్రవారం జరుపుకుంటున్న తరుణంలో జిల్లాలో సమైక్య ఉద్యమం మరో మహోజ్వల ఘట్టంగా సాగుతోంది. గురువారం కూడా జిల్లా అంతటా ఉద్యమం ఉధృతం సాగింది. సాక్షి, మచిలీపట్నం : జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకుల చేతి నుంచి ఉద్యమం రాజకీయేతర జేఏసీ, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీల చేతిలోకి వెళ్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాలూ ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నామమాత్రంగా తిరుగుతున్నాయి. విద్యా సంస్థలు దాదాపు అన్ని ప్రాంతాల్లో మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. క్రమంగా జిల్లా అంతటా ఉద్యమ సెగ చుట్టుముడుతోంది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అన్నిచోట్లా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలు శాంతియుతంగానే నిర్వహించడం విశేషం. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. తొమ్మిదోరోజూ ఉధృత రూపం.. కేంద్రం తెలంగాణ ప్రకటన వెలువరించిన తొలిరోజు నుంచే విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. విజయవాడలో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత నాలుగు రోజులుగా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారులను కలిసి తన సంఘీభావం తెలిపారు. పెడనలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరహారదీక్షలు చేపట్టారు. కొద్దిరోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో శిబిరాన్ని పోలీసులు తొలగించారు. ఏపీ ఎన్జీవో సంఘం, విద్యార్థులు కైకలూరులో ర్యాలీలు నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమకారులు 30 బస్సుల్లో ఊరూరా బస్సుయాత్ర నిర్వహించి ప్రజల్లో సమైక్యాంధ్ర ప్రాధాన్యతను వివరించారు. గుడివాడలోని మున్సిపల్ కార్మికులు 72 గంటలపాటు చేసిన నిరవధిక దీక్షలు విజయవంతమయ్యాయి. మైలవరంలో ఆర్ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. షిర్డీసాయి భక్తిసమాజం ఆధ్వర్యంలో భక్తిపాటలకు బదులు సమైక్యాంధ్రపై పాటలు కట్టి ఆందోళనకు తమ గళం కలిపారు. రోడ్లపై వంటావార్పు.. ఆటాపాటా.. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమం వినూత్నంగా సాగుతోంది. రహదారులపై వంటావార్పు, ఆటాపాటా కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. జగ్గయ్యపేట టౌన్లో వంటావార్పు, మానవహారం చేపట్టారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికారు. నందిగామలో మెయిన్‌రోడ్డుపై న్యాయవాదులు క్రికెట్ ఆడి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉయ్యూరులో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతుండగా టీడీపీ, కాంగ్రెస్ కీలక నేతలు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులపై కేసులు.. జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా శాంతిభద్రతల సమస్యలు అంతగా ఉత్పన్నం కావడంలేదు. చిన్నపాటి ఘటనలను సైతం భూతద్దంలో చూస్తున్న పోలీసులు ఉద్యమకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గుడివాడలో ఆర్టీసీ బస్సు అద్దం పగలగొట్టిన ఘటనలో కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్టు చేశారు. నూజివీడు, జగ్గయ్యపేటల్లో రాస్తారోకోలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేశారు. హనుమాన్‌జంక్షన్‌లో జేఏసీ రెండు గ్రూపులుగా ఏర్పడి సోనియా దిష్టిబొమ్మ దహనం చేయడానికి అనుకూలంగా, వ్యతిరేకంగా గొడవకు దిగడంతో కేసులు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసినా, అటువంటి చర్యలకు పురిగొల్పినా ప్రజల ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రజల కోసం చేస్తున్న సమైక్యాంధ్ర ఆందోళనలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రజలే ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. పశుసంవర్థక శాఖ వినూత్న ప్రదర్శన.. విజయవాడలో పశుసంవర్థక శాఖ అధికారులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అనర్హులను అందలం ఎక్కిస్తే... అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోపెట్టి ఈ ర్యాలీ జరిపారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నే తృత్వంలో మహిళలు రంగా విగ్రహం వద్ద సమైక్యాంధ్ర ముగ్గులు వేశారు. నూజివీడులో మహాధర్నాతో పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆటోలు కాని, బస్సులు కాని, ఇతర ఏ వాహనాలు కూడా నూజివీడు పట్టణంలోకి రాలేదు. గుడివాడ నెహ్రూచౌక్‌లో విద్యార్థుల నిరసన దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గురువారం అర్థనగ్న ప్రదర్శన చేశారు. కోర్టు ఆవరణ ఎదురుగా గల రోడ్డుపై న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆగిరిపల్లి పెద్దకొఠాయి సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట విద్యుత్ సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. -
నష్టాల బాటలో ఆర్టీసీ
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి. రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చాలా బస్సులు రద్దు తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాధ్యమైనంత వరకు అణగదొక్కేందుకు పోలీసు యంత్రాం గం సిద్ధమైంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. జువనైల్ జస్టిస్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ), జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాలకు ప్రత్యేక హెచ్చరికలు పంపింది. ఇన్నాళ్లూ ఉద్యమాలకు ఆతిథ్యమిచ్చిన కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి తమ వైఖరి బయటపెట్టుకుంది. విద్యార్థుల్ని రోడ్డెక్కనీయొద్దు! ఏ ఉద్యమమైనా విద్యార్థుల భాగస్వామ్యం తోనే ఉధృత స్థితికి చేరుతుంద న్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విషయం తేటతెల్లమయింది. అదే దారిన జిల్లాలో కూడా ఉద్యమాల్లో విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ 18 ఏళ్లలోపు వయసున్నవారు తల్లిదండ్రులు/విద్యాసంస్థల యాజమాన్యాల పర్యవేక్షణలో ఉండాలని, అలాంటి వారిని రోడ్లపైకి ఆందోళనకు పంపిస్తే ఊరుకునేది లేదని నగర పోలీసు కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై విద్యార్థి జేఏసీ, రాజకీయ ప్రతినిధులు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం తెలంగాణవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనల్ని విశాఖలోనే ప్రవేశపెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండడంతో భయపడిన కొందరు తెలంగాణ సానుభూతిపరుల కుట్రపూరిత చర్యలేనని ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు శాంతియుత ఉద్యమాలు చేస్తున్నారు తప్ప, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడట్లేదని చెప్తున్నారు. -
ఆర్టీసీ నష్టం రూ.9.5 కోట్లు
సాక్షి, విజయవాడ : అసలే అంతంత మాత్రం ఆదాయంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీకి సమైక్యసెగ తగిలింది. ఆరు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల వల్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్‌కు సుమారు రూ.9.5 కోట్లనష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి, కష్ణా,గుంటూరు జిల్లాలు విజయవాడ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ మూడు జిల్లాలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో తెలంగాణ సకల జనుల సమ్మె కారణంగా 45 రోజుల పాటు ఆయా ప్రాంతాలకు బస్సులు నిలిపివేయడంలో కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన విజయవాడ జోన్ ప్రస్తుతం సమైక్యాంధ్ర సెగ తగలడంతో మరింత నష్టాలబాట పడుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగిన దాని ప్రభావం ఆర్టీసీపై పడుతూ ఉండటంతో నష్టాల నుంచి కొలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది. రోడ్డెక్కని 1500 బస్సులు.... జోన్ పరిధిలో సుమారు 3300 బస్సులు ఉండగా, అందులో 1500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల్లో బస్సులు మూడు రోజులు పాటు రోడ్డుపైకే రాలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, తెనాలి డిపోల బస్సులు, కృష్ణాజిల్లాలోని గుడివాడ డిపో బస్సులు రెండు రోజుల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. మిగిలిన డిపోల్లో బస్సులు తిరిగినా... ఆక్యుపెన్సీరేషియో (ఓఆర్) 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 25 బస్సులు ధ్వంసం - రూ.లక్ష నష్టం... జోన్‌పరిధిలోని సమైక్యాంధ్ర ఆందోళన కారులు బస్సులపై తమ ప్రతాపం చూపించారు. అయితే గతంలో తరహాలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి దారుణాలకు పాల్పడకుండా అద్దాలు పగలగొట్టడం, టైర్లలో గాలి తీసివేయడం వంటి నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపట్టారు. సుమారు 25 బస్సులు దెబ్బతినడం వల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. ప్రత్యామ్నాయం వైపు ప్రయాణికుల చూపు! సమ్మె జరుగుతున్న సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కంటే రైళ్లలోనూ, విమానాల్లోనూ ప్రయాణం చేయడం ఉత్తమమనే భావన ప్రయాణికుల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్లో నడిచే బస్సులు 60శాతం మించి ఓఆర్ రావడం లేదు. ప్రయాణికులంతా రైళ్లలో వెళుతూ ఉండటంతో అక్కడ సీట్లు దొరకడం క ష్టంగా మారింది. హైదరాబాద్ రూట్లో ఏ ఇబ్బందులు లేవని ప్రయాణికులు బస్సుల సౌకర్యం ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు బస్సులు నడుపుతాం మూడు జిల్లాలోనూ రోజుకు కోటిన్నర పైగా నష్టం వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు బస్సుల్ని నడుపుతున్నాం. అయితే బస్సు గమ్యస్థానం వరకు చేరదేమోనన్న భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కకపోవడంతో 50శాతం బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఓఆర్ తక్కువగానే ఉన్నప్పటికీ బస్సులు నడుపుతున్నాం. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్రవాదులు బస్సుల్ని అడ్డగించవద్దని కోరుతున్నాం. - నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ -
నిరసన హోరు
సమైక్య కాంక్ష రోజురోజుకూ ఉద్యమ కెరటమై ఎగసిపడుతోంది. జిల్లాలో ఆరోరోజు బంద్ విజయవంతమైంది. డాక్టర్లు, లాయర్లు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టారు. మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో మున్సిపల్ ఏఈ కేసీఆర్‌కు దహన సంస్కారాలు నిర్వహించి గుండు గీయించుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. పెడనలో మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. శవయాత్రలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరు ఊపందుకొంది. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. జిల్లాలో ఆరో రోజూ బంద్ కొనసాగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. సోమవారం ఉదయం వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఉద్యమకారులు రోడ్డుపైకి వచ్చారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జగ్గయ్యపేట లో జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో మిహ ళలు ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ సెంట్రల్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య తదితరులు పాల్గొన్నారు. నందిగామలో బంద్ విజయవంతమైంది. దివిసీమలో ప్రదర్శనలు, పామర్రులో ధర్నాలు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎ.కొండూరు మండలంలోని గోపాలపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యువకులు జగ్దల్పూర్- విజయవాడ జాతీయ రదాహరిపై రాస్తారోకో నిర్వహించారు. పెడనలో మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పెడన శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ బ్రహ్మపురంలో ఉన్న కాలేజ్ నుంచి మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కేసీఆర్ , సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. చాట్రాయి మండలం పోలవరంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కంచికచర్ల మండల పరిధిలోని కీసర 65వ నంబర్ జాతీయ రహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మకు మెడలో చెప్పుల దండలు వేసి తగలబెట్టారు. కంచికచర్ల నెహ్రూ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. పరిటాల శివారులో అమ్రితసాయి కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరిపారు. మైలవరంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కైకలూరులో స్థానిక ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సందర్శించారు. కైకలూరులో కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం జరిపారు. పెనుగంచిప్రోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వేల్పుల విమలమ్మ మెమోరియల్ క్రైస్తవ మహిళామండలి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఎంఈవోకి ఫ్రెండ్షిప్ బ్యాండ్.. వత్సవాయి మండలం మక్కపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మండల విద్యాశాఖాధికారికి ఉపాధ్యాయులు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. జిల్లా సరిహద్దు 65వ నంబర్ జాతీయ రహదారి గరికపాడు వద్ద టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మను అన్నవరం గ్రామానికి చెందిన సమైక్యాంధ్ర వాదులు తగలబెట్టారు. గౌరవరం వద్ద రెండు గ ంటల పాటు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరు వైఎస్సార్ బ్రిడ్జిపై కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అంగలూరులో జోరువానలోను ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డం పెట్టి, రాస్తారోకో చేశారు. గుడివాడలో న్యాయవాదులు కోర్టు విధులను అడ్డుకున్నారు. చల్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కూరగాయల రైతులు, చిరువ్యాపారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మున్సిపల్ సిబ్బంది విధుల బహిష్కరణ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది విధులు బహిష్కరించారు. మూడు సర్కిళ్లలోనూ పౌర సేవలు నిలిపివేశారు. జాతీయ రహదారిపై ఉద్యోగులు మానవహారం ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయులు కూడా పలుచోట్ల విధులకు గైర్హాజరై ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు సిద్ధార్థ కాలేజీ సమీపంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అలంకార్ సెంటర్లో ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణాశాఖ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సమ్మెబాటలో మున్సిపల్, ఆర్టీసీ యూనియన్లు.. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధుల రాజీనామాకు ఎన్జీవోలు ఒత్తిడి పెంచే యత్నాలు ప్రారంభించారు. మున్సిపల్, ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎన్జీవోల ఆందోళనకు విజయవాడలో డాక్టర్లు, న్యాయవాదులు మద్దతు పలికారు. బెజవాడ బార్ అసోసియేషన్ లాయర్లు స్వచ్ఛందంగా కార్లు శుభ్రంచేసి తమ నిరసన తెలిపారు. ఎన్జీవో కార్యాలయంలో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, డాక్టర్లు, లాయర్లు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసేందుకు సమావేశమయ్యారు. ఒకరిపై మరొకరు విమర్శలు మాని ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పిలుపునిచ్చారు.