సమైక్యాంధ్ర ఉద్యమం జనహితం | Laugh movement janahitam | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర ఉద్యమం జనహితం

Published Fri, Aug 9 2013 12:31 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

Laugh movement janahitam

నెత్తురు చుక్క నేల రాలకుండా.. చిన్నపాటి విధ్వంసం జరక్కుండా.. సాగిన మహోన్నత పోరాటాలు చరిత్ర  సృష్టించాయి. ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జనహితం కోరుతూ.. శాంతియుతంగా సాగుతున్న తీరు చరిత్ర తిరగరాస్తోంది. బిగిసిన పిడికిళ్లు.. కదిలే అడుగులు.. నినదించే గొంతులు సమైక్యబాట పడుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఉప్పెనలా కదులుతున్నాయి. పట్టణాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన క్వింట్ ఇండియా డేను శుక్రవారం జరుపుకుంటున్న తరుణంలో జిల్లాలో సమైక్య ఉద్యమం మరో మహోజ్వల ఘట్టంగా సాగుతోంది. గురువారం కూడా జిల్లా అంతటా ఉద్యమం ఉధృతం సాగింది. 
 
 సాక్షి, మచిలీపట్నం : జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకుల చేతి నుంచి ఉద్యమం రాజకీయేతర జేఏసీ, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీల చేతిలోకి వెళ్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాలూ ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నామమాత్రంగా తిరుగుతున్నాయి. విద్యా సంస్థలు దాదాపు అన్ని ప్రాంతాల్లో మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. క్రమంగా జిల్లా అంతటా ఉద్యమ సెగ చుట్టుముడుతోంది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అన్నిచోట్లా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలు శాంతియుతంగానే నిర్వహించడం విశేషం. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. 
 
తొమ్మిదోరోజూ ఉధృత రూపం..
 కేంద్రం తెలంగాణ ప్రకటన వెలువరించిన తొలిరోజు నుంచే విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. విజయవాడలో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత నాలుగు రోజులుగా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారులను కలిసి తన సంఘీభావం తెలిపారు. పెడనలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరహారదీక్షలు చేపట్టారు. కొద్దిరోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో శిబిరాన్ని పోలీసులు తొలగించారు. ఏపీ ఎన్‌జీవో సంఘం, విద్యార్థులు కైకలూరులో ర్యాలీలు నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్‌లో మానవహారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమకారులు 30 బస్సుల్లో ఊరూరా బస్సుయాత్ర నిర్వహించి ప్రజల్లో సమైక్యాంధ్ర ప్రాధాన్యతను వివరించారు. గుడివాడలోని మున్సిపల్ కార్మికులు 72 గంటలపాటు చేసిన నిరవధిక దీక్షలు విజయవంతమయ్యాయి. మైలవరంలో ఆర్‌ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. షిర్డీసాయి భక్తిసమాజం ఆధ్వర్యంలో భక్తిపాటలకు బదులు సమైక్యాంధ్రపై పాటలు కట్టి ఆందోళనకు తమ గళం కలిపారు.
 
 రోడ్లపై వంటావార్పు.. ఆటాపాటా..
 సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమం వినూత్నంగా సాగుతోంది. రహదారులపై వంటావార్పు, ఆటాపాటా కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. జగ్గయ్యపేట టౌన్‌లో వంటావార్పు, మానవహారం చేపట్టారు. ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికారు. నందిగామలో మెయిన్‌రోడ్డుపై న్యాయవాదులు క్రికెట్ ఆడి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉయ్యూరులో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతుండగా టీడీపీ, కాంగ్రెస్ కీలక నేతలు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
 
 ఉద్యమకారులపై కేసులు..
 జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా శాంతిభద్రతల సమస్యలు అంతగా ఉత్పన్నం కావడంలేదు. చిన్నపాటి ఘటనలను సైతం భూతద్దంలో చూస్తున్న పోలీసులు ఉద్యమకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గుడివాడలో ఆర్టీసీ బస్సు అద్దం పగలగొట్టిన ఘటనలో కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్టు చేశారు. నూజివీడు, జగ్గయ్యపేటల్లో రాస్తారోకోలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేశారు. హనుమాన్‌జంక్షన్‌లో జేఏసీ రెండు గ్రూపులుగా ఏర్పడి సోనియా దిష్టిబొమ్మ దహనం చేయడానికి అనుకూలంగా, వ్యతిరేకంగా గొడవకు దిగడంతో కేసులు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసినా, అటువంటి చర్యలకు పురిగొల్పినా ప్రజల ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రజల కోసం చేస్తున్న సమైక్యాంధ్ర ఆందోళనలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రజలే ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది.
 
 పశుసంవర్థక శాఖ వినూత్న ప్రదర్శన..
 విజయవాడలో పశుసంవర్థక శాఖ అధికారులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అనర్హులను అందలం ఎక్కిస్తే... అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోపెట్టి ఈ ర్యాలీ జరిపారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నే తృత్వంలో మహిళలు రంగా విగ్రహం వద్ద సమైక్యాంధ్ర ముగ్గులు వేశారు. 
 
 నూజివీడులో మహాధర్నాతో పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆటోలు కాని, బస్సులు కాని, ఇతర ఏ వాహనాలు కూడా నూజివీడు పట్టణంలోకి రాలేదు. గుడివాడ నెహ్రూచౌక్‌లో విద్యార్థుల నిరసన దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గురువారం అర్థనగ్న ప్రదర్శన చేశారు. కోర్టు ఆవరణ ఎదురుగా గల రోడ్డుపై న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆగిరిపల్లి పెద్దకొఠాయి సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట విద్యుత్ సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement