నిరసన హోరు
సమైక్య కాంక్ష రోజురోజుకూ ఉద్యమ కెరటమై ఎగసిపడుతోంది. జిల్లాలో ఆరోరోజు బంద్ విజయవంతమైంది. డాక్టర్లు, లాయర్లు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టారు. మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో మున్సిపల్ ఏఈ కేసీఆర్‌కు దహన సంస్కారాలు నిర్వహించి గుండు గీయించుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. పెడనలో మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. శవయాత్రలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరు ఊపందుకొంది.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. జిల్లాలో ఆరో రోజూ బంద్ కొనసాగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. సోమవారం ఉదయం వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఉద్యమకారులు రోడ్డుపైకి వచ్చారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
జగ్గయ్యపేట లో జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో మిహ ళలు ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ సెంట్రల్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య తదితరులు పాల్గొన్నారు. నందిగామలో బంద్ విజయవంతమైంది. దివిసీమలో ప్రదర్శనలు, పామర్రులో ధర్నాలు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎ.కొండూరు మండలంలోని గోపాలపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యువకులు జగ్దల్‌పూర్- విజయవాడ జాతీయ రదాహరిపై రాస్తారోకో నిర్వహించారు. పెడనలో మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
పెడన శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ బ్రహ్మపురంలో ఉన్న కాలేజ్ నుంచి మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కేసీఆర్ , సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. చాట్రాయి మండలం పోలవరంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కంచికచర్ల మండల పరిధిలోని కీసర 65వ నంబర్ జాతీయ రహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మకు మెడలో చెప్పుల దండలు వేసి తగలబెట్టారు. కంచికచర్ల నెహ్రూ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. పరిటాల శివారులో అమ్రితసాయి కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరిపారు. మైలవరంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కైకలూరులో స్థానిక ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సందర్శించారు. కైకలూరులో కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం జరిపారు. పెనుగంచిప్రోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వేల్పుల విమలమ్మ మెమోరియల్ క్రైస్తవ మహిళామండలి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు.
తెలంగాణ ప్రాంత ఎంఈవోకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్..
వత్సవాయి మండలం మక్కపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మండల విద్యాశాఖాధికారికి ఉపాధ్యాయులు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టారు. జిల్లా సరిహద్దు 65వ నంబర్ జాతీయ రహదారి గరికపాడు వద్ద టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మను అన్నవరం గ్రామానికి చెందిన సమైక్యాంధ్ర వాదులు తగలబెట్టారు. గౌరవరం వద్ద రెండు గ ంటల పాటు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరు వైఎస్సార్ బ్రిడ్జిపై కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అంగలూరులో జోరువానలోను ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డం పెట్టి, రాస్తారోకో చేశారు. గుడివాడలో న్యాయవాదులు కోర్టు విధులను అడ్డుకున్నారు. చల్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కూరగాయల రైతులు, చిరువ్యాపారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
మున్సిపల్ సిబ్బంది విధుల బహిష్కరణ..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది విధులు బహిష్కరించారు. మూడు సర్కిళ్లలోనూ పౌర సేవలు నిలిపివేశారు. జాతీయ రహదారిపై ఉద్యోగులు మానవహారం ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయులు కూడా పలుచోట్ల విధులకు గైర్హాజరై ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు సిద్ధార్థ కాలేజీ సమీపంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అలంకార్ సెంటర్‌లో ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణాశాఖ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.
సమ్మెబాటలో మున్సిపల్, ఆర్టీసీ యూనియన్లు..
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధుల రాజీనామాకు ఎన్జీవోలు ఒత్తిడి పెంచే యత్నాలు ప్రారంభించారు. మున్సిపల్, ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎన్జీవోల ఆందోళనకు విజయవాడలో డాక్టర్లు, న్యాయవాదులు మద్దతు పలికారు. బెజవాడ బార్ అసోసియేషన్ లాయర్లు స్వచ్ఛందంగా కార్లు శుభ్రంచేసి తమ నిరసన తెలిపారు. ఎన్జీవో కార్యాలయంలో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, డాక్టర్లు, లాయర్లు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసేందుకు సమావేశమయ్యారు. ఒకరిపై మరొకరు విమర్శలు మాని ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పిలుపునిచ్చారు.