వికలాంగ మహిళపై హత్యాయత్నం
Published Thu, Aug 8 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగురాలైన ఓ మహిళను సజీవ దహనం చేసేందుకు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి భార్య యత్నించింది. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బంటుమిల్లి రోడ్డు ప్రాంతానికి చెందిన వికలాంగురాలు యార్లగడ్డ వెంకటేశ్వరమ్మ(30) స్థానిక ముబారక్ సెంటర్లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. వీరంకి మురళి అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. వీరికి ఏడాదిన్నర వయస్సుగల కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్వరమ్మకు, మురళి భార్య దేవికి గతంలో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వెంకటేశ్వరమ్మ హోటల్‌లో ఉండగా దేవి అక్కడకు వచ్చింది. వెంటనే వెంకటేశ్వరమ్మ కళ్లలో కారం చల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో వెంకటేశ్వరమ్మ పొట్ట, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసి, ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అమాయకంగా చూస్తున్న కుమారుడు..
వెంకటేశ్వరమ్మ చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడుతోంది. కుడి చెయ్యి సరిగా సహకరించదు. మురళి ద్వారా బిడ్డను కని, బంధువులకు దూరంగా ఉంటోంది. హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. హత్యాయత్నం తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరమ్మ వద్దనే కుమారుడిని కూడా ఉంచారు. తల్లికి ఏం జరిగిందో అర్ధం కాక, తండ్రి అం దుబాటులో లేక ఆ బాలుడు వచ్చిపోయే వారి వంక అమాయకంగా, బిత్తర చూపులు చూస్తుండటం అక్కడివారిని కలచివేసింది.
Advertisement
Advertisement