Disabled woman
-
జగనన్న వచ్చాడు...పెన్షన్ ఇచ్చాడు..
-
కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు?
సాక్షి,కరీంనగర్‌క్రైం: మచిలీపట్నంలోని ఇనగదురుపేట పోలీసుస్టేషన్ పరిధికి చెందిన ఒక దివ్యాంగురాలి(40)పై కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందగా.. విచారణ నిమిత్తం కరీంనగర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. వివరాలలోకి వెళ్తే.. దివ్యాంగురాలైన మహిళ మరో ఇద్దరితో కలిసి వంట పని కోసం గత ఫిబ్రవరిలో కరీంనగర్ వచ్చింది. (చదవండి: భర్త కోసం అందరినీ వదిలి వచ్చా.. ఇప్పుడు ఎవరూ లేరు ) తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు మహిళ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో మార్చి 09న ఆమె మచిలీపట్నం చేరుకుంది. ఆ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కేసు నమోదవగా ఆరుపేట సీఐ బృందం కరీంనగర్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆది, సోమవారాల్లో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో, కొత్తపల్లి ఠాణా పరిధిలో కొంతమంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. -
పదిహేను సర్జరీలు అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు..
ప్రతి విజయం వెనుక కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు నిరంతర సాధనతో సమస్యలను అధిగమించి విజయ తీరాలకు చేరతారు. కానీ వైకల్యంతో ఉన్నతస్థాయికి ఎదగాలంటే మాత్రం... ‘కష్టాల కడలి’ని ఈదాల్సిందే. ఇటువంటి కష్టాల కడలిని ఎంతో ధైర్యంగా ఈది సమాజంలో తనకంటూ గుర్తింపును ఏర్పర్చుకున్నారు ‘ఇయర్‌బుక్ కాన్వాస్’ సహవ్యవస్థాపక సీఈవో సురాశ్రీ రహానే. వైకల్యాన్ని ఓడించి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ప్రేరణగా నిలసున్నారు సురాశ్రీ. నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో సురాశ్రీ రహానే జన్మించింది. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో సురాశ్రీ పదిహేను రోజుల శిశువుగా ఉన్నప్పుడే కాళ్లకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అంతటితో సమస్య తీరుతుంది అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అది ప్రారంభం మాత్రమే అని తర్వాత తెలిసింది వారికి. ఒకపక్క తనసమస్యతో బాధపడుతూనే సురాశ్రీ స్కూలుకెళ్లి చక్కగా చదువుకునేది. ఒకసారి మేజర్ సర్జరీ అయింది. అప్పుడు కొన్ని నెలల పాటు స్కూలుకు వెళ్లడం కుదరలేదు. దీంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నందుకు తనకు ఎంతో బాధపడేది. ఇప్పటిదాక మొత్తం పదిహేను సర్జరీలు అయినప్పటికి సురాశ్రీ∙వైకల్యానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు! ఇలా ఉంటే నేను ముందుకు వెళ్లలేను బాగా చదువుకోని ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ సురాశ్రీ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ‘‘చిన్నప్పుడు నాకాళ్ల మీద నేను నిలబడేందుకు కాళ్లు సహకరించలేదు! అయినా ఎంతో కష్టపడి నడవడం నేర్చుకున్నాను! ఇప్పుడు కెరియర్లో కూడా నాకు నేనే ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. జ్ఞాపకాల ఐడియా.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న కష్టాలు, వైకల్యంతో కోల్పోయిన కార్యక్రమాలు, ఆనందకరమైన సందర్భాలు, స్నేహితులతో సరిగ్గా గడపలేని క్షణాలు తనకి గుర్తుకొచ్చాయి. ‘‘ఇటువంటి మధుర, చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఒక దగ్గర రాసుకుని ఏడాది తరువాత చూసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది’ అన్న సురాశ్రీ ఆలోచనకు ప్రతిరూపమే ‘ఇయర్‌బుక్ కాన్వాస్’. స్టార్టప్ మార్వారీ కెటలిస్ట్ ఇన్వెస్ట్ చేయడంతో ఇయర్‌బుక్ కాన్వాస్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇయర్‌బుక్ కాన్వాస్‌కు మంచి గుర్తింపు రావడంతో ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ ఆసియా పసిఫిక్ యూనివర్సిటి నుంచి ‘అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా’ అవార్డులు సురాశ్రీని వరించాయి. టెడెక్స్, యూనెస్కో, యుపెన్ వంటి అంతర్జాతీయ వేదికలపై మోటివేషనల్ స్పీకర్‌గాకూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను ఎప్పుడూ జ్ఞాపకాలు రాసుకోవడానికి బుక్ కొనుక్కోలేదు. నాకు ఎవ్వరూ సలహా కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను బుక్ కొనకపోవడం వల్లే ఈరోజు ఇయర్ బుక్‌ను తీసుకు రాగలిగాను. భారతదేశంలో నంబర్ వ¯Œ ఇయర్ బుక్ కంపెనీగానేగాక, ఆసియాలో మొబైల్ అప్లికేషన్ కలిగిన ఏకైక బుక్ కంపెనీ గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ‘కార్పొరేట్ మెమరీ బుక్’ను తీసుకొచ్చాం. గతకాలపు జ్ఞాపకాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇయర్‌బుక్, కార్పొరేట్ మెమరీ బుక్‌లు తీసుకొచ్చాము. త్వరలోనే వైకల్యం గలిగిన పిల్లల కోసం ‘ఫ్యూచర్ ఎంట్రప్రెన్యూర్ బుక్’ తీసుకొస్తున్నాం’’అని సురాశ్రీ చెప్పింది. -
ప్రియమైన గెలుపు
మనిషి డిజేబుల్డ్ అయినా పర్లేదు.. జీవితం డిజేబుల్డ్ కాకూడదు! సమస్యలు శక్తిని పెంచాలే తప్ప.. ప్రయాణాన్ని ఆపేలా చేయకూడదు! బతుకుబండి పాస్, ఫెయిల్యూర్లతో కాదు.. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో నడవాలి చివరిశ్వాస వరకూ ఆస్వాదించాలి.. ఇది పద్మప్రియ నమ్మి, ఆచరిస్తున్న బాట!! ఆమె.. గాయని.. థియేటర్ ఆర్టిస్ట్.. జీవితం విసిరిన ప్రతి సవాలుకు జవాబు ఇస్తూ ముందుకు వెళ్తున్న ఫిజికల్లీ చాలెంజ్డ్ విజేత... ‘నా పేరు పద్మప్రియ. చూస్తున్నారుగా నన్ను? చక్రాల కుర్చీలేందే కదల్లేను. అయినా మిమ్మల్ని కలుసుకోవాలి.. మీతో మాట్లాడాలి అన్న ఆశ.. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించేలా చేసి ఇదిగో ఇలా మీ దగ్గరకు చేర్చింది. నాతో ఉన్న ఈ ఇరవైమందీ నా లాంటివాళ్లే. ఒకరు వినలేరు.. మరొకరు మాట్లాడలేరు.. ఇంకొకరు చూడలేరు.. కండరాలు బిగుసుకుపోయి ఒకరు.. అవయవాలన్నీ అచేతనమై మరొకరు.. ఒక్కోరిదీ ఒక్కో సమస్య. అయినా మేం ఎక్కడా ఆగలేదు. ఆత్మహత్య అన్న ఆలోచనే చేయలేదు. ఇదేం బతుకురా దేవుడా అని మా మీద మేం జాలి పడలేదు. ప్రతిరోజూ కొత్త ఉదయాన్ని చూస్తామన్న నమ్మకంతో నిద్రపోతాం. కనిపించిన ఉదయాన్ని కొత్తగా మార్చుకునే ధైర్యంతో నడుస్తాం. అలాగని మాకంతా హాయిగా సాగిపోతోందని అనుకోకండి. మాలో చాలామంది బాల్యం వెక్కిరింతలు, అవహేళనలు, చీదరింపులు, చీత్కారాలతోనే గడిచిపోయింది. వాటినుంచే బలాన్ని తెచ్చుకున్నాం. పోరాటానికి ఆయుధంగా మలచుకున్నాం.. ఈ రోజు మా జీవన పాఠాన్ని మీకు చెప్పి.. మీలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే స్థాయికి వచ్చాం. గెలుపు అంటే మార్కులు, పరీక్షలో పాస్ అవడం కాదు. గెలుపు అంటే జీవితాన్ని ఆస్వాదించడం. మంచి అయినా.. చెడు అయినా చివరిశ్వాస వరకూ జీవించాలి. భయం ఒక అపోహ..’ కాలేజీ పిల్లలకు చెప్పుకు పోతోంది పద్మప్రియ. ఆమెతోపాటు ఉన్న మరో 20 మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులూ తమ జీవితంలోని సవాళ్లను చెప్పుకొచ్చారు. కిందటేడు.. సాంకేతిక పొరపాటు వల్ల ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. దాంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ‘అరే.. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్యలా? రేప్పొద్దున జీవితంలో ఇంకెన్ని చూడాలి? మానసికంగా ఎంత బలంగా ఉండాలీ పిల్లలు?’అని కలత చెందింది.. చలించిపోయింది పద్మప్రియ. ఆ పిల్లల్లో ఆత్మబలం కలిగించడానికి తనలా ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారుల జాబితా ఒకటి తయారు చేశారు ఆమె. తను చేయబోయే పని గురించి వాళ్లకు చెప్పారు. ఆసక్తి, సమయమూ ఉన్న 20 మంది కళాకారులు కూడారు. పద్మప్రియ నాయకత్వంలో తెలంగాణలోని పది జిల్లాల్లోని ప్రతి కళాశాలకు వెళ్లి తమ జీవిత గాథలతో విద్యార్థులను మోటివేట్ చేశారు. తాము పడ్డ అవమానాలు, పొందిన ఆనందాన్ని పంచుకుంటూనే స్కిట్స్, పాటలు, డ్యాన్స్‌తో పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేసి ఫలితం సాధించారు. నేపథ్యం.. పుట్టిపెరిగిందంతా ఖమ్మంలోనే. తల్లి కుసుమ గృహిణి. తండ్రి సత్యం.. ప్రైవేట్ ఉద్యోగి (ఇప్పుడు లేరు). పద్మప్రియకు ఇద్దరు తోబుట్టువులు.. ఒక అక్క, తమ్ముడు. చిన్నప్పుడే పద్మకు పోలియో సోకింది. ఆరేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను ఖమ్మంలోనే సెయింట్ మేరీ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. ప్రతి ఎండాకాలం ఒక ఆపరేషన్ చొప్పున పదహారేళ్లొచ్చేప్పటికి ఎనిమిది ఆపరేషన్లతో కూర్చొని.. చంక కర్రల సహాయంతో నడవగలిగే దశకు చేరింది పద్మ. పాటలకు గమకాలు నేర్చుకుందక్కడే.. ‘కాళ్ల మీద నిలబడ్డమే కాదు జీవితంలో నిలబడ్డం నేర్చుకుందీ ఆ క్రిస్టియన్ మిషనరీలోనే. నా తొలి గురువు క్లారా హీటెన్. కథలు, పాటలు నేర్పి, నాలో పాడేకళకు మెరుగులు దిద్దింది ఆవిడే. నాటకాలు, చిన్న చిన్న స్కిట్స్ వేస్తూ నటనలోనూ అక్కడే తర్ఫీదు పొందింది ఆమె. జిల్లా, రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొనడం, ప్రైజ్‌తో హాస్టల్‌కు రావడం సర్వసాధారణంగా ఉండేదామెకు. కృష్ణుడు .. పాండురంగడూ ఖమ్మంలోనే డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానంలో పీజీ డిప్లమా పూర్తిచేసి ..పాటలతో ఫ్యూచర్‌ను నిర్మించుకోవాలనుకొని హైదరాబాద్ చేరింది. ‘మాయాబజార్ (దాసరి దర్శకత్వంలో)’ అనే సినిమా కోసం వంశీ ఇంటర్నేషనల్ నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొంది. పోటీ జరగలేదు.. కాని పాటలు పాడే ప్రోగ్రామ్ జరిగింది శివరాత్రి నాడు కావడంతో భక్తిపాటలను ఆలపించింది పద్మ. ఆమె గాత్రాన్ని మెచ్చిన వంశీ రామరాజు తన ‘వేగేశ్న’ ఫౌండేషన్‌లో ఉద్యోగమివ్వడమేగాక సంగీతం లో శిక్షణనిచ్చే బాధ్యతనూ తీసుకున్నారు. కొలువు చేసుకుంటూనే కర్ణాటక, లలిత సంగీతంలో శిక్షణపొందింది. పద్యగానంలో స్పెషలైజేషన్ చేసింది. మరోవైపు సినిమా ఫంక్షన్స్‌లో పాటలు, నాటకాలతో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత వంశీ రామరాజు తన వేగేశ్నలోని ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులతో దేశమంతా తిరిగి పౌరాణిక నాటకాలు వేయించారు. అందులో కృష్ణుడిగా, పాండురంగడుగా, సత్యభామగా వేసిన పద్మప్రియకూ మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూడు పాత్రలతోపాటు వెంకటేశ్వరస్వామి పాత్రతో సహా పురుష పాత్రలకు పెట్టింది పేరుగా మారింది పద్మప్రియ. పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్.. ‘నీ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి అంటే నువ్వో సంస్థగానూ మారాలి. నీలాంటి పదిమందికి మార్గం చూపించాలి’ అని తొలి గురువు క్లారా, మలి గురువు వంశీ విజయరామరాజు చెవినిల్లు కట్టుకొని మరీ పోరారు. దాంతో 1999లో పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ సంస్థను పెట్టింది. 2001లో వేగేశ్న నుంచి బయటకు వచ్చి.. మొత్తం తన సంస్థ మీదే దృష్టి పెట్టింది. ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్లకోసం టైలరింగ్, కంప్యూటర్ విద్యతోపాటు సంగీత, నాటకాల్లోనూ శిక్షణ ప్రారంభించింది. ఆసక్తి ఉండి అవకాశాల్లేని ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులకు తమ సంస్థ తరపున అవకాశాలూ కల్పిస్తూ ఉపాధినిచ్చే ప్రయత్నమూ చేస్తోంది విజయవంతంగా. స్టేజ్షోస్తోపాటు టెలివిజన్‌లోనూ రాణిస్తోంది. విశిష్టప్రతిభా పురస్కారం.. పద్యగానంలో పద్మప్రియను మించినవారు లేరనే కితాబు తెచ్చుకుంది. అందుకే పద్యగానం ప్రాంతీయ కళే అయినా తన ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేసిన తీరుకి ముగ్ధులై 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ‘విశిష్ఠ ప్రతిభా పురస్కారం’తో పద్మప్రియను సత్కరించారు. ఆసియా ఖండంలోనే పద్యనాటకం వేసిన తొలిమహిళగా గుర్తింపునిచ్చారు. యేటికి ఎదురీది నిలబడ్డమే జీవితం అని చాటిన ఆమె శక్తికి 2010లో ‘స్త్రీ శక్తి పురస్కార’మూ తలవంచి ఆమెను వరించింది. ఇంకెన్నో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ అవార్డులూ వచ్చాయి. సెన్సార్‌బోర్డ్ సభ్యురాలిగానూ పనిచేసింది. కళాసేవే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంది పద్మ. పిడబ్ల్యూడీ యాక్ట్‌కి సంబంధించి తెలంగాణ అడ్వయిజరీ బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధికి సంబంధించి ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ హక్కుల కోసమూ పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. – సరస్వతి రమ -
యువతిపై పెద్దనాన్న కొడుకే అఘాయిత్యం
బోధన్‌టౌన్: సోదరి అవుతుందన్న విషయం మరిచి చిన్నాన్న కూతురిపైనే కన్నేశాడో కీచకుడు. మిత్రుడితో కలసి రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్‌కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. పదో తరగతి చదివిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న ఆ యువతి పెద్దనాన్న కుమారుడు నవీన్ మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. మిత్రుడు రవితో కలసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె నోరు విప్పలేదు. ఈ క్రమంలో ఆమెలో శారీరక మార్పులు గమనించిన తల్లి దండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. అయితే, ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కుల పెద్దలను ఆశ్రయించగా వారు ఈ విషయాన్ని బయటకు రాకుండా యత్నించారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీని కలసి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆమె వారిని వెంట బెట్టుకుని శనివారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
దివ్యాంగురాలితో ‘పెళ్లి’.. ఆపై అత్యాచారం
పాల్ఘర్: దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను వివాహం చేసుకున్న ఆ ప్రబుద్ధుడు ఆపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. టీచర్ అయిన మహమ్మద్ అన్వర్ మొయినుద్దీన్, వసాయి కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. గత మే నెలలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ‘అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తదుపరి ఆమెతో బంధాన్ని కొనసాగించ డానికి నిరాకరించడంతో ఆమె అతనిపై ఫిర్యాదు చేసింది’ అని పోలీసులు తెలిపారు. -
దారుణం.. దయనీయం
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమాదేవి.. అనాథ వికలాంగురాలు.. ఆపై నిండు గర్భిణి. వికలాంగుల పింఛనుకూ నోచుకోలేదు. ఈమె గత ఏడాది తనకు ఉపాధి కల్పించాలని సూర్యాపేటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడంతో స్థానికంగా ఉన్న రాజీవ్ విద్యామిషన్ హాస్టల్లో వాచ్‌మెన్‌గా ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగం ఇప్పించారు. ఆ తరువాత హాస్టల్‌ను అక్కడి నుంచి దూరంగా తరలించడంతో ఉపాధి కోల్పోయింది. తనకు లేదా.. తన భర్తకు ఏదైనా బతుకుదెరువు చూపాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆయన చుట్టూ ఉన్నవారు..సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వలేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తన సమస్య చెప్పుకుందామని గత వారం రోజులుగా తెలంగాణ సెక్రె టేరియట్ ఎదుట ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ పడిగాపులు కాస్తున్నా..అమాత్యుల దర్శనభాగ్యం దక్కలేదు. గురువారం వర్షంలో తడుస్తున్న ఆమెను గమనించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తన కారులో ఎక్కించుకుని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా ఈమె సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. చివరకు పిడమర్తి రవి జోక్యం చేసుకుని కేటీఆర్ సార్ లేనందున మరోసారి రావాలని చెప్పి చేతి ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -ఫొటోలు: అమర్ -
వికలాంగ మహిళపై హత్యాయత్నం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగురాలైన ఓ మహిళను సజీవ దహనం చేసేందుకు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి భార్య యత్నించింది. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బంటుమిల్లి రోడ్డు ప్రాంతానికి చెందిన వికలాంగురాలు యార్లగడ్డ వెంకటేశ్వరమ్మ(30) స్థానిక ముబారక్ సెంటర్లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. వీరంకి మురళి అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. వీరికి ఏడాదిన్నర వయస్సుగల కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్వరమ్మకు, మురళి భార్య దేవికి గతంలో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వెంకటేశ్వరమ్మ హోటల్లో ఉండగా దేవి అక్కడకు వచ్చింది. వెంటనే వెంకటేశ్వరమ్మ కళ్లలో కారం చల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో వెంకటేశ్వరమ్మ పొట్ట, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసి, ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకంగా చూస్తున్న కుమారుడు.. వెంకటేశ్వరమ్మ చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడుతోంది. కుడి చెయ్యి సరిగా సహకరించదు. మురళి ద్వారా బిడ్డను కని, బంధువులకు దూరంగా ఉంటోంది. హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. హత్యాయత్నం తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరమ్మ వద్దనే కుమారుడిని కూడా ఉంచారు. తల్లికి ఏం జరిగిందో అర్ధం కాక, తండ్రి అం దుబాటులో లేక ఆ బాలుడు వచ్చిపోయే వారి వంక అమాయకంగా, బిత్తర చూపులు చూస్తుండటం అక్కడివారిని కలచివేసింది.