
బోధన్‌టౌన్: సోదరి అవుతుందన్న విషయం మరిచి చిన్నాన్న కూతురిపైనే కన్నేశాడో కీచకుడు. మిత్రుడితో కలసి రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్‌కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. పదో తరగతి చదివిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న ఆ యువతి పెద్దనాన్న కుమారుడు నవీన్ మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. మిత్రుడు రవితో కలసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె నోరు విప్పలేదు.
ఈ క్రమంలో ఆమెలో శారీరక మార్పులు గమనించిన తల్లి దండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. అయితే, ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కుల పెద్దలను ఆశ్రయించగా వారు ఈ విషయాన్ని బయటకు రాకుండా యత్నించారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీని కలసి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆమె వారిని వెంట బెట్టుకుని శనివారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment