మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి.
18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్‌గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.
కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది.
.. నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!
.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా.
.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.
కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
పోలాండ్(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment